సిసలైన సోషలిస్టు
తెలుగువాడి ఆత్మగౌరవం పేర తెలుగు దేశంపార్టీని నెలకొల్పి అనతికాలంలోనే అధికారంలోకి వచ్చిన నేత ఎన్.టి. రామారావు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అపాయింట్ మెంట్ లేకుండా వెళ్లడమే కాదు ఆయన ముందు కూర్చునే ధైర్యం కూడా ఎవరూ చేయని కాలమది. ఆ సమయంలో నేనూ, మా నాయకుడు ఏదో పనిపై ఆయన వద్దకు వెళ్లవలసి వచ్చింది. కార్డు పంపగానే నిమిషంలోనే ఇంటర్వ్యూ లభించింది. ఆయన స్వయంగా లేచి మా నేతకు రెండు చేతులూ జోడించి నమస్కరించి కూర్చోమ్మని కుర్చీ చూపారు. మా నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రమ్మని ఆయన్ని ఆహ్వానించగా “నాకన్నా ముందుగా ప్రజల మనిషిగా పేరొందిన ప్రజా నాయకుడు మీ వద్దనే ఉండగా నేను అవసరం లేదు. ఆయనే నాకన్నా గొప్పవారని ప్రశంసించారు. ఇంతలో ఒక మహిళా నేత ఏదో శుభసందర్భాన్ని పురస్కరించుకుని మిఠాయి తెచ్చి ఎన్టీరామారావు ముందుంచగా, నాకన్నా గొప్ప ప్రజా నాయకుడు నా ముందు కూర్చున్నారు. ముందుగా ఆయనకే ఇవ్వండి” అన్నారు. అలా సినిమాల్లో, రాజకీయాల్లో అజాతశత్రువుగా వెలుగొందిన ఎన్.టి. రామారావు వంటి మహానేతచే సమున్నత గౌరవం, ప్రశంసలు అందుకున్న మా నాయకుడు ఎవరో కాదు వనపర్తి ప్రజల మనిషిగా పేరొందిన డాక్టర్ బాలకృష్ణయ్య.
మహాత్ముని మరచిన ఈ దేశం మహనీయులను సంస్మరించుకుంటుందా? అనుకునే నాకు, నాకు అన్నగా, అన్నిటికన్నా మిన్న అయిన డాక్టర్ బాలకృష్ణయ్యగారి జీవితవిశేషాలతో ఒక సావనీర్ ను వెలువరించే విషయం తెలిసి పొందిన ఆనందం అక్షరాలకందనిది.
నాకు అన్నగారైన డాక్టర్ బాలకృష్ణయ్యగారి అడుగుజాడల వెంట విద్యార్థిదశ నుండే వారితో సాన్నిహిత్యం ప్రారంభమైంది. ఆయన విద్యార్థి దశలోనే సోషలిజం పట్ల ప్రభావితమయ్యారు. సోషలిస్టు పార్టీలో చేరారు. లోక్నాయక్ జయ ప్రకాష్ నారాయణ వనపర్తికి వచ్చిన సందర్భంగా నేటి జూనియర్ కళాశాల మైదానంలో సోషలిస్ట్ పార్టీ జెండాను బాలకృష్ణగారే ఎగురవేశారు. నాటి నుండి ఆయన తన రాజకీయ జీవితంలో ఏ వర్గానికి నాయకత్వం వహించినా ఆయన హృదయంలో నిజమైన సోషలిస్టుగానే జీవించారు. అలా ఆనాడు తెలంగాణా ప్రాంతంలో హైదరాబాద్ రాష్ట్రంలో సోషలిస్ట్ ఝండాను ఎగురవేసిన ఘనత బాలకృష్ణగారిది. అంతేకాదు. స్వాతంత్ర్యోద్యమ కాలంలో వనపర్తి ప్రాంతంలో జాతీయ జెండాను కూడా తొలుత ఎగురవేసింది బాలకృష్ణయ్యగారేననే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు.
నిజాం వ్యతిరేక పోరాట కాలంలో ఆయన వామపక్ష పార్టీ పట్ల ప్రభావితుడైనారు. పార్టీ సానుభూతి పరుడిగా ఈ ప్రాంతంలో వామపక్ష ఉద్యమాలకు తొలిబీజం వేశారు. కాలక్రమంలో వామ పంథా భావాలున్న చాలా మంది యువకులు ఆయన అనుచరులైనారు. ఇతర పార్టీలకు వ్యతిరేకులైనా వ్యక్తులకు ఆయన ఏనాడూ వ్యతిరేకి కాలేదు. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు విజయ మోహన్ రెడ్డి ప్రోద్భలం ఉన్నా చివరి నిర్ణయం తన అనుచరుల సలహామేరకే తీసుకున్నారాయన. అధికారంలోకి వచ్చాక ఆయన పలు నిర్మాణాత్మక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. విద్యావంతులు పెరగాలని అనియత విద్యా ప్రాజెక్టులను పెద్దసంఖ్యలో అమలయ్యేలా చర్య తీసుకున్నారు. పలు గురుకుల విద్యాలయాలు, పాఠశాలల స్థాపనకు కృషి చేశారు. చెరువుల అనుసంధానానికి నాడే ప్రయత్నించి ఎత్తిపోతల పథకాలతో సాగునీటిని సాధించేందుకు తొలిబీజం వేశారు. బృహత్తరమైన తారకరామ ప్రాజెక్టును చిట్యాల వద్ద నిర్మించేందుకు సర్వేలూ చేయించారు.
బాలకృష్ణగారు పుస్తక పఠనాన్ని అమితంగా ఇష్టపడేవారు. శ్రీశ్రీ, వేమన, బసవేశ్వరుడు ఆయనకిష్టమైన వారు. 1982లో శ్రీశ్రీకి వనపర్తిలో సన్మానం చేసి 30వేల నగదును అందజేసి ఆయనను ఆదుకున్నారు. ఆరోజుల్లో వామపంథా రాజకీయాలపై నిర్బంధాలుంటే ఆ సన్మాన కమిటీ కి కన్వీనర్ గా ఉండేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అన్నగారు నన్ను పిలిచి “తమ్ముడూ ఈ కార్యక్రమానికి నీవు కన్వీనర్వి. నేను అధ్యక్షుడిని. నీకేమైనా అభ్యంతరనూ అన్నారు. నేను అంగీకరించాను. శ్రీశ్రీ సన్మానానంతరం కుల, మత, వర్గ బేధం లేకుండా సామూహిక భోజనాన్ని ఏర్పాటు చేశారు. శ్రీశ్రీ సైతం ఈయన ఏర్పాట్లకు ఆశ్చర్యపోయి అభినందించారు. నాకైతే బాలకృష్ణయ్యగారు అలనాటి బసవేశ్వరుడిలా కనిపించారు. 12వ శతాబ్దంలోనే బసవేశ్వరుడు సహపంక్తి భోజనాలు పెట్టి సమానతను బోధించాడు.
ఒక సందర్భంలో మా ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో కనబడిన బసవపురాణం పుస్తకాన్ని తీసుకుని బసవేశ్వరుడెవరని నన్నడిగారు. నేను వెంటనే ఆయన ఆ కాలంలోనే గొప్ప కమ్యూనిస్ట్ సంస్కర్త అని, సమ సమాజ నిర్మాణ లక్ష్యంగా “అనుభవమంటప” నిర్మాత (బసవేశ్వరుడి పార్లమెంట్) “వర్క్ ఈజ్ వర్షిప్” అనే సిద్ధాంతాన్ని నమ్మినవాడిగా, మానవ వృత్తులు వేరు కావచ్చు. మానవులంతా ఒక్కటే నన్నవాడని వివరించాను. అంతే ఆయన బసవేశ్వరుని చరిత్ర, శివపురాణం, సహస్ర శతక సంపుటి పుస్తకాలను తీసుకెళ్లి అధ్యయనం చేశారు
నల్లమల అడవుల్లోని కొండలు, లోయల నడుమ ఉన్న సల్వేశ్వరుని దర్శనం చేసుకున్న తరువాత ఆయన దైవం పట్ల విశ్వాసం పెంచుకున్నారు. శ్రీశైలం ఆయనకిష్టమైన తీర్థయాత్రా స్థలమైంది. శ్రీశ్రీ సన్మానానికి ఆర్థిక వనరులను సమకూర్చే సమయంలో ఆయనకు నిరుపేదలు ఒక్క పైసా ఖర్చు చేయకుండా వైద్య సౌకర్యాలు పొందే ఒక ఆసుపత్రిని నిర్మించాలనే ఆలోచనను నాతో పంచుకున్నారు. తాము నివసించే ఇంటి స్థలంలోనే ఆసుపత్రి భవనాన్ని నిర్మించాలని, అందుకు అందరి సహకారం తీసుకోవాలనుకున్నారు. కానీ అది ఆయన జీవిత కాలంలో నెరవేరలేదు. అయితే ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైందేమో మరి, వారి కుమారుడు డాక్టర్ భూపేష్ కుమార్ తండ్రి ఆశయానికి కార్యరూపమిచ్చి పేదలకు ఉచిత వైద్య సేవలందించే హాస్పిటల్ని నిర్మిస్తున్నాడు.
బాలకృష్ణగారు నాకో, కొందరికో, ఎందరికో కాదు వనపర్తికే “అన్న”. “తమ్ముడు” అన్న పదంలో ఎంత ఆత్మీయత ఉందో ఆయన పలుకుల్లో అది వ్యక్తమయ్యేది. ఆయన మరణం తో వనపర్తి చరిత్రలో ఒక శకం ముగిసింది. నేడు మనమధ్య ఆయన లేడు కానీ ఆయన జ్ఞాపకాలు నిరంతరం వెన్నాడుతూనే ఉన్నాయి.