నేనూ-బాలకృష్ణయ్య
“కింగ్ కోఠీవైపు పదవోయ్ పదవోయ్
స్టేట్ కాంగ్రెస్ శంఖం ఊదోయ్ ఊదోయ్
పరిపాలనా హక్కు మనదోయ్ మనదోయ్”
1948సం.లో హైదరాబాద్ కింగ్ కోఠీలో జాతీయ జెండాను ఎగురవేయడానికి ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగిన ఆరోజు అంతా నిన్నో, మొన్న జరిగినట్లుగా నా కళ్ళముందు కదలాడుతూనే ఉంది. ఆరోజు నావెంట ఆ ఉద్యమంలో కలిసి సాగిన మిత్రుడు డాక్టర్ బాలకృష్ణయ్య.
డాక్టర్ బాలకృష్ణయ్యతో నా స్నేహం ఏ ఉద్యమాల నాటిదో, రాజకీయాల నాటిదో అవసరాల కోసం కలిసి పనిచేసిన నాటిదో కాదు. బాల్యంలో చెట్టాపట్టాల్ వేసుకుని లోకం తెలియకుండా తిరిగిన నాటిది. ఇంకా చెప్పాలంటే మా ఇద్దరిది వనపర్తి వీధుల్లో గోళీకాయలు ఆడుకున్న స్నేహం. ఒకచోట చదువుకుని పెరిగిన మాకు తెలియకుండానే మాలో అభ్యుదయ భావాలు వేళ్లూనుకున్నవి. ఇద్దరం కలిసి నియంత నిజాం వ్యతిరేక పోరాటంలో భాగస్వామ్యం పొందాము. నేను, బాలకృష్ణయ్య, జయరాములు ముగ్గురం కలిసి. ఉద్యమాల్లో కొనసాగాము. వనపర్తిలో తొలిసారిగా జాతీయజెండాను ఎగురవేసి జైలు పాలైనాము. నేను గుర్రంగడ్డ చంద్రారెడ్డి, జయరాములు, బాలకృష్ణయ్య వనపర్తి, మహబూబ్నగర్, హైదరాబాద్ జైళ్లలో జైలుశిక్షలు అనుభవించాము.
నా స్వగ్రామం కడుకుంట్లలో నన్ను అరెస్టు చేయడానికి వచ్చిన నైజాం పోలీసును నా మిత్రుడు కావలి గట్టన్నతో కలిసి అతనిని నిర్బంధించి తుపాకీని లాక్కెళ్ళటం సంచలనమైనది. నాటి కర్నూలు సమీపంలో నుండి రహస్యంగా తను ఉద్యమ కార్యక్రమాలను రహస్యంగా ప్రసారం చేసే భాగ్యనగర్ రేడియోలో ఈ విషయాన్ని ప్రధానంగా ప్రసారం చేశారు. ఆ తర్వాత నాపై 7 వారంట్లు మరియు కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ అయినవి. అయినా రహస్యంగా నేను శ్రీరాంనగర్ రైల్వే స్టేషన్లో తలదాచుకుని పురుషోత్తం అనే అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ సహాయంతో ఉద్యమ కార్యక్రమాల్ని నడిపేవాడిని. సాయుధపోరాటం చేయడానికి తుపాకులను సేకరించుకుని పెట్టుకున్నాం. కర్నూల్ వద్ద జరిగిన సాయుధ శిక్షణ శిబిరంలో తర్పీదు పొందినాము. అలా నేను డాక్టర్ గారు కలిసి పలు ఉద్యమాల్లో పనిచేసి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చవి చూసిన దినాలు ఒక కలలాగ కనిపిస్తూనే ఉన్నాయి.
నిజాయితీ, నిబద్ధత, సేవాభావం నిలువెల్లా నింపుకున్న డాక్టర్ గారితో కలిసి పనిచేయటం నా జీవితంలో అన్నిటికన్నా గొప్ప విషయం. ఆయన అటు వనపర్తిలో, నేను ఇటు కడుకుంట్లలో 20సం.రాల పాటు సర్పంచ్ గా కొనసాగి నాటి పంచాయితీ సమితిలో కలిసి పనిచేసినాము. చివరగా స్వాతంత్ర్యోద్యమ కాలం నాడు ప్రజలను జాగృతం చేసేందుకు భూస్వాముల దుర్నీతిని సామాజిక వివక్షతలను రైతు కూలీల వేదనలను అవిష్కరిస్తూ ఊరూర వాడవాడల
“లేరా లేరా అన్నా వోరన్నా
తెల తెల వారెను” అంటూ భారతీయులను మేల్కొల్పుతూ పాడిన పాట నేటి పరిస్థితులకూ అన్వయించుకోవచ్చు.