నేనెరిగిన బాలకృష్ణయ్య
గడచిన శతాబ్దిలో వనపర్తిని అన్ని రకాలుగా ముందుకు నడిపిన లెజెండ్స్ లో ఒకరు డాక్టర్ బాలకృష్ణయ్య. మరొకరు కె.వెంకటేశ్వరరావు. ఎందరో అభ్యుదయవాదులను, మేధావులను, సాహిత్యకారులను రూపొందించిన వెంకటేశ్వర రావు ఒక పాఠశాల హెడ్మాస్టరు కావడం గమనార్హం. 40 ఏళ్లపాటు వనపర్తి ప్రజలను ప్రభావితం చేసారాయన. స్వాతంత్ర్యానంతరం జనంలోకి వచ్చిన వారు డాక్టర్ బాలకృష్ణయ్యగారు
డాక్టర్ బాలకృష్ణయ్య తండ్రి మహదేవయ్య, మా నాన్న మంచి మిత్రులు. మా రెండు కుటుంబాలు ఒకే కుటుంబంలా మెలిగేవి, డాక్టరుగారు మా కుటుంబంలో ఒకరుగా కలిసిపోయేవారు. 1944-45 ప్రాంతంలో అనుకుంటా నాకు నాలుగైదేళ్ల వయసున్నప్పుడు డాక్టర్ గారిని తొలిసారిగా చూశా. అప్పుడాయన హైస్కూల్ విద్యార్థి. ఆ తర్వాత చదువుకోసం ఆయన హైదరాబాద్ రావడంతో కొంత గ్యాప్ వచ్చింది. 1950లో నేను హైదరాబాద్ వచ్చాక మళ్లీ చూశా. యువ నాయకుడిగా 1954లో ఆయన్ను మెడిసిన్ నాలుగవ సంవత్సరం చదువుతున్నప్పుడు బాగా చనువు. అది మొదలు నేను, డాక్టర్ గారు, ఆయన చెల్లి ప్రమీల అంతా కలిసి మెలిగేవాళ్లం.
అయితే కాలప్రవాహంలో మేం అలా కొట్టుకుపోతూ ఒడిదుడుకుల్లో పడి కొంతకాలంపాటు మా కుటుంబాలు దూరమైనా, వేడు డాక్టర్ గారిని తలచుకుంటే వారితో నాకున్న అనుబంధం ఒక భావావేశంలా పెల్లుబుకుతుంది.
6.6.1973 హైదరాబాద్‌లో నా పెళ్లి జరిగిన మర్నాడే డాక్టర్ గారు వనపర్తిలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భం మా కుటుంబంతో ఆయనకున్న అనుబంధాన్ని రుజువు చేస్తుంది. డాక్టర్ గారిల్లు ఎందరో వామపక్ష భావాలున్న నేతలకు నిలయం, కారణం ఆయనో లెఫ్టిస్ట్. ఆ కాలంలో అక్కడ మరో లెఫ్టిస్ట్ లేరు. ఇంకా చెప్పాలంటే ఆ రోజుల్లో ఆంధ్ర, తెలంగాణలో డాక్టర్ బాలకృష్ణయ్య గారంటే తెలియని కమ్యూనిస్ట్ లేడు. ఆయన ఇంట్లోనే నేను బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణ రెడ్డి వంటి నేతలను తొలిసారిగా చూసాను. ఆ తర్వాత బద్దం ఎల్లారెడ్డి కూతురు (విజయ)ని వివాహమాడాను.
డాక్టరుగారు తన జీవితకాలంలో తొలిదశలో అతి తక్కువ సమయంలో ఒక గొప్ప లెజెండ్‌గా ఎదిగారు. అది అతి కొద్దిమందికే సాధ్యం. ఆయన అన్ని సామాజిక, రాజకీయ సమస్యలకు తీవ్ర గతిన స్పందించేవారు. తెలంగాణ విముక్తి పోరాట సమయంలో ప్రతి కార్యక్రమంలోనూ ఆయనే నాయకుడు, స్వాతంత్ర్య పోరాటంలో జెండా ఎగరవేయాలంటే ఆయనే ముందుండేవారు. వడ్ల గోవిందు, దర్జా వాసుదేవ్, చిరాగలి, జైరాములు, బాల్ రాం, పెట్బేర్ రామచంద్రారెడ్డి వంటి వారు ఆయన సహచరులు. ఆయన ఏం చేసినా అనాలోచితంగా, ఏ పరిస్థితికైనా రియాక్ట్ అయ్యేవారు. అరెస్ట్ కావడమంటే ఆయనకు భయం ఉండేది కాదు.
1957 డాక్టర్ బాలకృష్ణయ్య క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించిన సంవత్సరం. ఇది నాకు తెలిసినంతవరకు అప్పటిదాకా కాంగ్రెస్ పార్టీకి, సంస్థానాధీశులకు వ్యతిరేకంగా ఏ రాజకీయ నాయకుడూ తయారు కాలేదు. అది డాక్టర్ గారితోనే ప్రారంభం అయ్యింది. 1957-58 నాటికి వనపర్తిలో వైద్య సేవలు ప్రారంభించారు ఆయన. కాలంతోపాటు ముందుకు సాగుతూ రాజకీయంగా స్పందిస్తూ తన రాజకీయ జీవితానికి సటిష్టమైన పునాదులు ఏర్పర్చుకున్నారు. కమ్యూనిస్టు భావాలు అధికంగా గల ఆయన వల్లనే వనపర్తి పరిసర ప్రాంతాల్లో ఎందరో ఔత్సాహికులు వామపంథా ఉద్యమాల వైపు మళ్లారు.
అప్పటిదాకా రాజా రామేశ్వరరావు తన రాజరికపు దర్పంతోనే వనపర్తి రాజకీయాలను నడిపేవారు. ఈ దశలో డాక్టర్ గారి రాజకీయ ప్రవేశం వనపర్తి రాజకీయ ముఖచిత్రాన్నే మార్చివేసింది. స్థానికంగా ఆయన ఒక సాధికారికమైన నేత అయ్యారు. ఇదంతా ప్రారంభంలోని రెండు మూడేళ్లలోనే జరిగింది. ఇందుకు ఈయన ఒక బి.సి. కావడం ప్రధాన కారణమని అనిపిస్తుంది. మరోవైపు ఒక కమ్యూనిస్టు భావజాలం గల వ్యక్తిగా రాజరికపు అధికారానికి ఎదురొడ్డి నిలవడం కూడా కారణమే.
1954లో డాక్టర్ గారికి నాతో పూర్తి స్థాయి సహచర్యం ఏర్పడి, 1983లో ఆయన తెలుగుదేశంలో చేరేవరకు ఆ సాన్నిహిత్యం కొనసాగింది. ఈ కాలంలో మేం రాజకీయాల గురించి ఎప్పుడూ మాట్లాడుకునే వాళ్లం. రాజా రామేశ్వరరావును ఎలా ఓడించాలనే విషయంపై సీరియస్ గా చర్చించుకునే వాళ్లం. 1957 ఎన్నికల్లో రాజా రామేశ్వరరావు పోటీలో ఉన్నా, డాక్టర్ గారు ఆ ఎన్నికలను సీరియస్ గా తీసుకోలేదు.
డాక్టర్ బాలకృష్ణయ్య 1946-1983 వరకు ఫార్మల్గా ఏ రాజకీయ పార్టీలోనూ నాలుగణాల సభ్యత్వం తీసుకోలేదు. కానీ లెఫ్ట్ పార్టీల సానుభూతిపరుడుగా ఉద్యమాలు మాత్రం ఒక స్ఫూర్తితో చేశారు. 1962లో ఆయన ఒక నాయకుడు. ఆయన వెంట సైనికుడిలా నేను పని చేశాను. ఆ రోజుల్లో నావంటి ఎందరో చదువులు మాని ఆయన మద్దతుదారులుగా స్వచ్ఛందంగా పని చేసిన యువకులు చాలామంది ఉన్నారు. రాణీ కుముదినీ దేవి (రాందేవ్ భార్య)కి వ్యతిరేకంగా నిలబడిన శివారెడ్డికి డాక్టరుగారు మద్దతుగా ప్రచారం చేశారు. ఇక్కడ విచిత్రమేమిటంటే రాందేవ్ వద్ద డాక్టర్ బాలకృష్ణయ్య గారి తండ్రి మహదేవ్ సింగ్ ఉద్యోగం చేస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని రాందేవ్ రావు తండ్రిద్వారా డాక్టర్ గారిపై వత్తిడి తెచ్చారు. కానీ డాక్టర్ గారు వినలేదు. దాంతో ఆయన్ను ఉద్యోగంలోంచి తొలగించారు. మరోవైపు మా అన్న రామకృష్ణ రావు రాజా రామేశ్వరరావు సహచరునిగా డాక్టర్ గారిని వ్యతిరేకించినా నేను మాత్రం ఈయన సహచరునిగానే కొనసాగాను.
డాక్టరుగారు యువకుడిగా ఒక ఉద్యమ స్ఫూర్తితో రాజకీయాలను నడిపిస్తున్న ఈ కాలంలో నాటి కాంగ్రెస్, సోషలిస్ట్ పార్టీలు రెండూ వనపర్తి రాజావారి ఆస్థానంలోనే తలొకరు పంచుకుని ఉండటం వల్ల ఈయనకు ఏ పార్టీలో అవకాశం లేకుండా ఇండిపెండెంట్లకు మద్దతు ఇవ్వడం తప్పలేదు. 1962లో వనపర్తి పట్టణాభివృద్ధి సమితి పేరున పని చేశారు. ఈ ఏడాదే జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో డాక్టర్ గారు మొత్తం 15 వార్డుల్లోను గెలుచుకుని చైర్మన్ అయ్యారు. రాజాగారి బంగ్లా పై ఈయన సాధించిన తొలి విజయం ఇది. సదుర్ల గోపాల్, కాగితాల బాలరాం వంటి ఆయన సహచరులు వార్డు మెంబర్లుగా ఎన్నికయ్యారు. తరువాతి 1967 ఎన్నికల నాటికి నేను నా విద్యాభ్యాసం, ఉద్యోగం కోసం ఢిల్లీ వెళ్లాను. అయితే ఈ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలే డాక్టర్ గారి రాజకీయ పురోభివృద్ధిని సూచిస్తాయి.
డాక్టర్ గారి రాజకీయ ప్రవేశం వనపర్తి రాజకీయ ముఖచిత్రాన్నే మార్చి వేసింది. స్థానికంగా ఆయన ఒక సాధికారికమైన నేత అయ్యారు. ఇదంతా ప్రారంభంలోని రెండు మూడేళ్లలోనే జరిగింది.