మేమిద్దరం ఒకేలా
ఇది యాభైఏళ్ల నాటి మాట. మా మామగారి కుడిభుజంపై గల కణతిని తొలగించేందుకు హైదరాబాదులోని ఉస్మానియా హాస్పిటల్లో చేర్చినప్పుడు ఆయనకు తోడుగా ఉండేందుకు వెళ్లాను. నేను హాస్పిటల్ లోపలికి వెళుతుండగా ఎదురుగుండా డాక్టర్ బాలకృష్ణయ్యగారు వస్తున్నారు. పరస్పరం ఒకరి ముఖాలొకరం చూసుకోవడంతో ఇద్దరమూ అవాక్కయ్యాము. ముందుగా నేనే “మీరు నాలా ఉన్నారా? నేను మీలా ఉన్నానా?” అని నా పేరు వి.బాలకృష్ణయ్య. మాది కొల్లాపూర్, అంటూ పరిచయం చేసుకున్నాను. “అరె మనిద్దరం ఒకేలా ఉన్నామే. నా పేరు కూడా ఎ.బాలకృష్ణయ్యనే” అంటూ చెప్పారు. ఆ తరువాత ఆయనే ఉస్మానియాలో మా మామగారి ఆపరేషన్ కు అన్ని ఏర్పాట్లనూ దగ్గరుండి చూసుకున్నారు. అప్పటికాయన ఎం.బి.బి.ఎస్. చివరి సంవత్సరంలో ఉన్నారు.
ఒకసారి వనపర్తి గ్రామపంచాయతి ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఆయన ఒక సభనుద్దేశించి ప్రసంగిస్తూ తను గతంలో చేసిన అభివృద్ధిని గురించి వివరిస్తున్నారు. తన ఉప న్యాసం ముగిస్తూ డాక్టర్ గారు “ఇప్పుడు గ్రామ పంచాయతి చట్టం గురించి ప్రజలకు శ్రీ వి. బాలకృష్ణయ్యగారు ప్రసంగిస్తారని ప్రకటించారు. నేను మైకు అందుకోగానే అంతా ఆశ్చర్యపో యారు. నేను అచ్చం ఆయనలాగే ఉండటంతో “ఇతనెవరు రెండవ బాలకృష్ణయ్యలా ఉన్నాడేమిటి” అని చర్చించుకున్నారు.
మా స్నేహం బలపడి క్రమంగా బంధుత్వంగా మారింది. మా అబ్బాయి పాండురంగమూర్తికి డాక్టర్ గారి అమ్మాయి దమయంతితో వివాహం జరిగింది. ఒకేలా ఉండటం కాక మేము బంధువులం కూడా అయ్యాము. ఆ తరువాత ఏదో అవసరార్థం నేను కొల్లాపూర్ నుండి వనపర్తికి వెళ్లి డాక్టర్ గారి హాస్పిటలికి వెళ్లాను. ఆయన గది సుమారు 50 మంది రోగులతో నిండిపోయింది. వారి మధ్యన ఆయన నాకు కనిపించలేదు. బయటికి వెళ్లారేమోనని తిరిగిపోతుండగా కంపౌండర్ నావద్దకు వచ్చి డాక్టరుగారు మీరు చూసిన గదిలోనే ఉన్నారు వెళ్లి చూడమన్నారు. తీరా వెళ్లి బాగా గమనించి చూస్తే రోగుల మధ్యలో ఆయన ఉన్నారు. నేను కల్పించుకుని వారిని ‘బావగారు’ అని పిలువగా ఒక్క గంటలోగా వస్తాను ప్రక్క గదిలో కూర్చోమన్నారు. కానీ ఆయన రెండు గంటల తర్వాత బయటికి వచ్చి నన్ను చిట్యాలకు తీసుకెళ్లారు. దారిలో ఎందరో కారుకు అడ్డంగా వచ్చి ఆపి ఆయనతో వైద్యపరీక్షలు జరిపించుకుని ప్రిస్క్రిప్షన్ రాయించుకున్నారు. కొందరు మందులు కొనేందుకు డబ్బులేదంటే జేబులోంచి తీసి ఇచ్చారు. ఇలా ఎంతకాలం బావా అంటే “ఇది నా అలవాటు. వారి బాధనెలా చూడగలను.” అనేది ఆయన సమాధానం.
మరొకసారి నేను అడ్వకేటుగా అవసరమై నాగర్ కర్నూల్ ఆర్డిఓ ఆఫీసుకెళ్లాను. వెనుక నుండి ఎవరో నన్ను డాక్టర్ బాలకృష్ణయ్యగారనుకొని “డాక్టరుగారు” అని పలకరించారు. నేను కాదనడంతో తొలుత అంగీకరించకపోయినా చివరకు నేను వకీలు బాలకృష్ణయ్యనని అంగీకరించారు. డాక్టర్ గారు శ్రీశైలం దేవస్థానం బోర్డు మెంబరుగా కొంతకాలం పనిచేసారు. ఆయన మరణానం తరం నేను అక్కడికి వెళ్లగా అక్కడి అధికారులు, పూజారులు “డాక్టర్ బాలకృష్ణయ్య గారు వచ్చారని సంభ్రమాశ్చర్యాలతో పలకరించారు. కానీ నేను కాదనే మాటను వారు అంత త్వరగా నమ్మలేదు. అంతెందుకు డాక్టర్ గారు మరణించాక దశదినకర్మకు హాజరైన నేను తిరిగి వెళుతుండగా ఎదురుగా ఒక వాహనంలో వస్తున్న ఆయన అభిమానులు నన్ను చూసి ఇదేమిటి డాక్టర్గారు ఎదురుగా వస్తుంటే ఈరోజు దినకర్మ ఏమిటి అని నన్ను పలకరించారు. కానీ నేను నేను డాక్టర్గారిని కాదని తెలిసి నిరాశపడ్డారు.
డాక్టర్ గారు, నేను ఇరువురమూ ఒకేలా ఉండటం కాదు ఇద్దరమూ స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నాము. కానీ నేను గాంధేయవాదినైతే ఆయన నామపంథావాది. ప్రజలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం కావాలని, చైనా
దేశ జీవనవిధానం అవలంబనీయమని చెప్పేవారు. నేను న్యాయవాదిగా, ఆయన వైద్యులుగా పేదలకు విశేషమైన సేవలందించాము. తెలుగుదేశం పార్టీ రాకతో ఆయన వనపర్తి శాసనసభ్యులైనారు. విద్యారంగంలో ఆయన ఎన్నో పాఠశాలలు, కాలేజీలు నెలకొనేలా చేశారు. ఆయన ఇతరుల బాధను తన బాధగా భావించి స్పందించేవారు. మేం ఇద్దరం ఒకే పోలికలో ఉండటం వల్ల చాలామంది పొరపడేవారు.
ఆయనలా నేనుండటం నా పూర్వజన్మ సుకృ తంగా భావిస్తాను. డాక్టర్ గారు జీవన్ముక్తుడు కానీ మా హృదయాల్లో ఆయన చిరంజీవి