మళ్ళీ మాకో బాలకృష్ణయ్య కావాలి
1957-58లో వారితో నా మొదటి పరిచయం. అప్పుడప్పుడే ఆయన వైద్యవృత్తిని ప్రారంభించిన కాలమది. వనపర్తికి చెందిన వారవటం వల్ల ఆయన ప్రాక్టీస్ ఊపందుకోవడానికి అట్టే కాలం పట్టలేదు. ఫీజు లేకుండా వైద్యం చేయడం కూడా మరో కారణం. మొదటినుండి వనపర్తి అంటే ఆయనకు ప్రత్యేక అభిమానం. మెడిసిన్ చివరి సంవత్సరంలో కొంత ఆర్థిక ఇబ్బంది ఏర్పడితే వనపర్తిలోని కొందరు వారి కుటుంబానికి కొంత సొమ్మును ప్రోగుచేసి ఇవ్వగా ఆయన చదువు పూర్తయింది. బహుశా ఆయన అభిమానానికి ఇదొక కారణం కావచ్చు.
ప్రజలు విద్యావంతులైతేనే సామాజిక చైతన్యం పెరుగుతుందని భావించిన ఆయన స్వాతంత్ర్యోద్యమకాలంలోనే వయోజన పాఠశాలలను రాత్రివేళ ప్రారంభించి 30-40 ఏళ్ల వయసు పైబడిన వారికి చదువు చెప్పించారు. మరోవైపు విద్యార్థిగా ఉన్నకాలం నుండే డాక్టర్ గారు వామపక్ష పార్టీలతో సన్నిహితసంబంధాలు కలవారు కావడంతో ఆ తరువాత వనపర్తిలో మావంటి కమ్యూనిస్ట్ పార్టీ అభిమానులు తయారైనారు. ఆయన నేతృత్వంలో పలుసార్లు ఆ పార్టీ సభలు జరిగాయి. ఆయన సహచరుడు కాగితాల రంగన్న బుర్రకథలు చెప్పేవారు.
వనపర్తి మునిసిపాలిటి చైర్మన్ గా, మేజర్ గ్రామపంచాయతి సర్పంచుగా ఆయన రెండు దశాబ్దాలు పనిచేసిన క్రమంలో 1982లో తెలుగు దేశం పార్టీ ఆవిర్భవించిన తరువాత కొందరు ఆయన్ను చేరేందుకు వత్తిడి తెచ్చినా మొదట అంగీకరించలేదు. కానీ కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా కొంత ఐడియాలజీని ప్రకటించడంతో వనపర్తి సభలోనే ఆయన తెలుగుదేశంలో చేరారు. పేదల సంక్షేమానికి పెద్దపీట వేయడంతో టిడిపి వైపు మొగ్గుచూపడం జరిగింది.
ఆయన ఎం.ఎల్.ఏ.గా ఉన్న సమయంలో అనుచరులైన ప్రతి ఒక్కరికీ పూర్తి స్థాయి ప్రాధాన్యత ఉండేది. రెండో శ్రేణి నాయకత్వం ఎదగడానికి తానుగా ప్రోత్సహించేవారు. కానీ ఇప్పటిలాకాదు. నావంటి వారికి నియోజకవర్గం లోని పలుశాఖలలో పూర్తిస్థాయిలో పనులు జరిపించేలా బాధ్యతలు అప్పజెప్పేవారు. ఇప్పుడైతే ఒక వ్యక్తికి రేషన్ రేషన్ కార్డు ఇప్పించాలన్నా, హైద్రాబాద్, ఢిల్లీల్లో ఉన్న మా నేతను అడిగి చేయాల్సిన స్థితి. నాడు ఇలా లేదు. నేటికి ఈ ప్రాంతంలో టిడిపికి ప్రజాబలం ఉన్నదంటే అది డాక్టర్ గారు 20 ఏళ్ల నాడు వేసిన పునాదులే మూలం.
బాలకృష్ణయ్యగారు ఎలాంటి భేషజాలు, రాజకీయ కుతంత్రాలు ఎరుగని మనిషి, బహుశా ఆయన భోళాతనమే చాలా సందర్భాల్లో ఆయన్ను ఇరుకున పడేసింది. అలాంటిదే లోకాయుక్త కేసు. కానీ ఆ కేసు నిలువలేదు. కుల, మతాలకు ఆయన బద్ధవ్యతిరేకి. 70ల దాకా మాలాంటివారు ఆ కాలంలో దళితుల ఇంట్లో పెళ్లిళ్లకు వెళ్లడం, అక్కడే భోజనాలు చేయడం పూర్తిగా మా కుటుంబాల్లో నిషేధం. కానీ డాక్టర్ గారి నాయకత్వంలో అలాంటి వివక్షతలను వ్యతిరేకిస్తూ దళితుల వివాహాల్లో ప్రధానపాత్రను వహించడం ప్రారంభించాం. మరోవైపు వనపర్తిలో మతసామరస్యం నెలకొని ఉండటానికి ఆయనే స్ఫూర్తి
1981లో స్థానిక ఎన్నికలు జరిగినప్పుడు చిన్న పట్టింపుతో కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసేవాళ్లు డాక్టర్ గారు కేవలం తమ బలంతోనే గెలుస్తున్నా రని భావించి విడిగా స్వంత పానల్తో పోటీచేసి కేవలం రెండు వార్డుల్లోనే గెలిచి భంగపడ్డారు. మిగతా స్థానాలన్నీ డాక్టర్ గారి వర్గం గెలుచుకుంది. దీంతో వెనపర్తి అంతటా కేవలం డాక్టర్ గారి ప్రాభవమే ఉందని వారికీ తెలిసిపోయింది.
నిజానికి డాక్టర్ గారి నేతృత్వంలో పనిచేసిన రోజులే మాకు గొప్పవి. నేడు మోసపూరితమైన ఆలోచనలవల్ల రాజకీయాలు అవకాశవాదంతో స్వప్రయోజనాలను సాధించుకునేందుకు నాయకుల సాధనాలవుతున్నాయి. మళ్లీ ఒక డాక్టర్ బాలకృష్ణయ్యవంటి నేత ఈ తరానికి మార్గదర్శకత్వం వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది