మహోన్నతుడు

ఈ పరమపవిత్ర శ్రీశైలం క్షేత్రాన్ని సేవా భావంతో భక్తుల సౌకర్యార్థం అభివృద్ధికి చిత్త శుద్ధితో కృషిచేసిన వారిలో ముఖ్యులు ముగ్గురు. వారిలో మొదట చెప్పుకోదగిన వ్యక్తి డాక్టర్ బాలకృష్ణయ్య (వనపర్తి) గారు, మిగతా ఇరువురు పైడి లక్ష్మయ్య (అనంతపురం), మద్దూరి సుబ్బారెడ్డి

ఈ ఆలయం ప్రభుత్వ ఆధీనంలో లేని కాలంలో మా చిన్నాయన సంగిన బసవయ్య ఇక్కడ ప్రధాన పూజారిగా ఉండేవారు. ఆయనతో డాక్టర్గారికి సన్నిహితమైన స్నేహం ఉండేది. తొలి రోజుల్లో ఆయన కూడా ఇక్కడకి నడిచివచ్చినట్లు నాతో చెప్పారొకసారి. వారబ్బాయిలలో ఒకరికి మహేష్ అనే పేరు కూడా మల్లికార్జునిపై గల భక్తితో పెట్టుకున్నారు.

తరచూ మలేరియా వ్యాధికి గురవు తున్న ఈ ప్రాంత ప్రజలకు ఆయన ఆ తర్వాతి కాలంలో వనపర్తినుండి మందులు తేవడమో, పంపడమో చేస్తుండేవారు. అప్పట్లోనే ఆయన్ను నేను ప్రజలకు నిస్వార్థంగా సేవచేసే మనిషిగా గుర్తించాను.

డాక్టర్ బాలకృష్ణగారితో నా పరిచయం జర3గింది 1967లో, 1967లోనే అనుకుంటా ముదిరాజ్ సంఘం పెట్టారు. ఆ సందర్భంలో డాక్టర్ గారు ఆనెగొంది మాణిక్యమ్మను వెంట తీసుకుని హైదరాబాద్ నుండి శ్రీశైలానికి వచ్చారు. అదే మొదటిసారి ఆయనను చూడటం. ఆ సందర్భం లో ఇక్కడ యాత్రికులకు వసతి సౌకర్యాలు లేవు. వారు వచ్చిన రోజు మా ఇంట్లోనే అన్ని వసతులు కల్పించాము. అప్పట్లో వచ్చిన రోజునే తిరుగు ప్రయాణం చేసే సౌకర్యాలు లేవు. శ్రీశైలం ప్రాజెక్టు శంకుస్థాపన తరువాతే శ్రీశైలం- హైదరాబాదు రోడ్డు వేశారు. డోర్నాల మీదుగా శ్రీశైలానికి రోజూ ఒకే బస్సు నడిచే కాలం అది. మహబూబ్ నగర్ ప్రాంతం నుండి రావాలంటే కాలినడకనే వచ్చేవారు. అప్పటికి శ్రీశైలంలో స్థిరనివాసం ఉన్నవి కేవలం పది కుటుంబాలే

1967లో మొదటిసారిగా వచ్చినపుడే డాక్టర్ గారు ఇక్కడి ప్రజల ఆరోగ్య పరిస్థితుల గురించి విచారించారు. తరచూ మలేరియా వ్యాధికి గురవు తున్న ఈ ప్రాంత ప్రజలకు ఆయన ఆ తర్వాతి కాలంలో వనపర్తినుండి మందులు తేవడమో, పంపడమో చేస్తుండేవారు. అప్పట్లోనే ఆయన్ను నేను ప్రజలకు నిస్వార్థంగా సేవచేసే మనిషిగా గుర్తించాను, తను అందించిన వైద్యసేవలకు డబ్బు తీసుకునేవారు కారు. ఏలాంటి సంబంధం లేకపోయినా మా ప్రాంతవాసులకు ఆయన అందిస్తున్న వైద్యసేవ ఆ కాలంలో వేలు ఖర్చు పెట్టినా దొరికేవి కావు. ఇలాంటి వ్యక్తి మా శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులుగా ఉంటే ఏకంగా ఈ క్షేత్రమే అభివృద్ధి చెందుతుందనుకున్నాను. ఇదే విషయాన్ని ఆయనతో అన్నాను. ఆ వెంటనే ఆయన బయోడేటా తీసుకువెళ్లి నేనే స్వయంగా ఎన్.టి.ఆర్. గారికి ఇచ్చాను. డాక్టర్ గారు అప్పటికే ఎం.ఎల్.. అయ్యారు. ఎన్.టి.ఆర్. కాలంలో సేవాదృక్పథం ఉన్నవారికే ట్రస్ట్ లో సభ్యత్వం ఇచ్చేవారు. కానీ కాలక్రమంలో అంతా రాజకీయమైంది.

ఇక్కడ ఎన్.టి.ఆర్. గురించి కొంత చెప్పు.కోవాలి. ఎన్.టి.ఆర్. తో నాకు చాలా దగ్గర పరిచయం. ఎన్.టి.ఆర్. కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉండేవాడిని, తనతో నాకున్న సన్ని హితత్వంతో ఆయనే స్వయంగా ‘బందిపోటు భీమన్న’, ‘వాదీ ఆడజన్మే’ చిత్రాల్లో చెప్పి మరీ నాకు వేషాలిప్పించారు. ఆయన తెలుగుదేశం పార్టీని ప్రారంభించిన తొలిరోజుల్లో శ్రీశైలం వచ్చినప్పుడు ఆలయ లాంచనాలతో స్వాగతించడానికి ఎవరూ సాహసించలేదు. నేనే అందరినీ కాదని ఆయనకు దండ వేసి ఆహ్వానించాను. ఆరోజుల్లో అది సంచలనమైంది. నా పెళ్లైన కొత్తలో ఆయనే స్వయంగా మా దంపతులను తను ఇంటికి ఆహ్వానించి పదిరోజులపాటు తమ స్వంత కొదుకు కన్నా ఎక్కువగా ఆదరించారు.

ఈ నేపథ్యంలో నేను ఎన్.టి.ఆర్.తో డాక్టర్ గారి విషయం చెప్పగానే 1983లో ట్రస్ట్ బోర్ట్ సభ్యుడిగా నామినేట్ చేశారు. అప్పటికే డాక్టర్ గారంటే ఎన్.టి.ఆర్.కి ప్రత్యేక గౌరవం ఉండింది. ఆయన 1983 నుండి 1987 దాకా ఈ ట్రస్ట్ లో సభ్యులుగా కొనసాగారు. ఈయన సభ్యులుగా ఉన్న కాలంలోనే టి. బాలాగౌడ్ అనే ఎం.ఎల్.ఏ. బినామి పేరుతో శ్రీశైలంలో ఏకంగా సారా డిపోనే ప్రారంభించాడు. దీనితో ఈ పవిత్రమైన క్షేత్ర వాతావరణం కలుషితం కానారంభించింది. కొందరు ఆకతాయిలు సారా తాగి కొందరు మహిళల పట్ల ఘంటామటం వద్ద అసభ్యంగా ప్రవర్తించారు. భయపడి ఎవరూ దీన్ని పట్టించు కోలేదు, కానీ నేను వ్యతిరేకించి ఈ ప్రాంతంలో సారాడిపో ఎత్తివేయాలని డిమాండ్ చేశాను. దీంతో 1986లో నాటి ఆత్మకూరు ఎం.ఎల్.ఏ. బుడ్డా వెంగళ్ రెడ్డి నా ప్రతిఘటనను జీర్ణించుకోలేక తనకు వచ్చే నాలుగు లక్షల రూపాయల మామూళ్లకు గండి పడుతుందని నాపై దాడి జరి పాడు. ఈ సందర్భంలో డాక్టరుగారు చేదోడుగా నిలిచారు.

ఇక్కడ ఈ సంఘటన జరిగిన రాత్రే ఎన్.టి. ఆర్.కి కలలో మల్లికార్జునుడు వెళ్లి “నా క్షేత్రంలో రాక్షసులు రాజ్యమేలుతున్నారు. నువ్వేం చేస్తున్నావ్” అని హెచ్చరించడంతో ఆ ఉదయమే ఆయన డా॥ బాలకృష్ణయ్య, మంత్రులు నల్లపురెడ్డి శ్రీనివాసులురెడ్డి, వసంత నాగేశ్వరరావులను పిలిచి శ్రీశైలం వెళ్లి అక్కడ ఏం జరిగిందో తెలుసుకుని నాకు సాయంత్రంకల్లా రిపోర్ట్ కావాలన్నారు. అయితే నేనుగా ఎవరికి ఫిర్యాదు చేయలేదు. వారు మర్నాడు రావడం ఇక్కడ జరిగింది తెలుసు కుని ఎన్.టి.ఆర్.కు రిపోర్టు చేశారు. నాపై జరిగిన దాడికి ఆయన చాలా బాధపడ్డారు. ఆ ఎం.ఎల్.ఏ. ను అరెస్ట్ చేసి లోపల వేసేదాకా పరిస్థితి వచ్చింది. తర్వాత ఎన్.టి.ఆర్. స్వయంగా నన్ను హైదరాబాదు పిలిపించుకున్నారు. తన ప్రత్యేక గదిలోకి తీసుకుని వెళ్లి కన్నీళ్లు పెట్టుకున్నంత పని చేశారు. “ఎంత పని జరిగిందిరా” అని ఓదార్చారు.

ఈ సంఘటన తర్వాత అసెంబ్లీలో డాక్టర్ బాలకృష్ణగారు ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ఎటూ పది కిలోమీటర్ల దూరంలో మద్యపానం, వ్యభిచారం, జూదం వంటిని జరగ కుండా చర్య తీసుకోవాలని ప్రసంగించారు. ఫలితం గా 1987లో ఇక్కడ ప్రత్యేక ఎక్సైజ్ అధికారులను నియమించారు. హిందూ దేవాలయాల చట్టం 1957 సెక్షన్ 23 ప్రకారం మద్యపానం నిషేధించబడిందని నేటికీ ఈ క్షేత్రంలోని అన్ని సత్రాలలో రాయబడింది. ఈ బృహత్తర నిర్ణయానికి డాక్టర్ బాలకృష్ణగారి కృషి కారణం.

డాక్టర్గా గారు ట్రస్టు సభ్యులుగా ఉన్నప్పుడు ఎప్పుడూ శ్రీశైలానికి సమావేశాలకు, ఇతర పనులపై వచ్చినపుడు ఒక్కసారికూడా ప్రయాణ, భత్యాల కింద సొమ్ము తీసుకున్న సందర్భాలు లేవు. కేవలం సేవాభావనతోనే చేసేవారు. ఆలయ అభి వృద్ధి కి, ఉద్యోగుల కోసం ఏం కోరినా ట్రస్ట్ మీటింగుల్లో వాదించి మరీ నాటి అమలుకు కృషి చేశారు. నేను 8 ట్రస్ట్లను, సుమారు 200 మంది సభ్యులనూ చూశాను. కానీ డాక్టర్గారి లాంటి నిస్వార్థమైన సభ్యులను చూడలేదు. చూడబోను.

రాజకీయాల్లో ఆయన ఏనాడు సంపాదించుకోలేదు. పిల్లలు చదివి సంపాదించేవరకూ ఆయన ఇబ్బందుల్లోనే గడిపారు. ఎం.ఎల్.ఏ.గా కూడా ఏమీ వెనకేసుకోలేదు. డాక్టర్గారితో కలిసి నేను శ్రీశైలం అభివృద్ధికోసం ఎన్.టి.ఆర్.ను కలిసిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

ఒకసారి నేను వనపర్తికి వెళ్లాను. అప్పుడాయన ఇంట్లో ఆ పూటకు వండేందుకు బియ్యం లేవు. కాని ఎందరో పేషెంట్లు, ఎందరో వస్తున్నారు. వెళుతున్నారు. కానీ జేబులోకి ఒక్క పైసా రావడం లేదు. నన్ను ఆయన వైఖరి ఆశ్చర్యపరిచింది. మరోవైపు పదిమందికి భోజనాలు ఏర్పాటు చేయమని చెప్పి పంపారు. నాకిదంతా ఏమీ అర్థం కాలేదు. అలా తన గురించి ఆలోచించక పేదల పట్ల ప్రేమ, ఉదారతగా వ్యవహరించే వారాయన. ఎం.ఎల్.ఏ. అయ్యాక కూడా ఆయన ఒక ఎం.ఎల్.ఏ.ననే దర్పాన్ని ఏనాడూ చూపలేదు. డాక్టర్ గారు ప్రజల కోసం జీవించారు. ఎన్.టి.ఆర్. కన్నా ముందుగా ప్రజలమనిషిగా రాజకీయాల్లో ఎదిగారు. అలాంటివారు మహోన్నతులు. అందుకే వారిని మళ్లీ మళ్లీ గుర్తుచేసుకుంటున్నాం.