మా ఇల్లు మాకు దక్కించిన డాక్టర్ బాలకృష్ణయ్య
శ్రీశ్రీగారి ఇల్లు వేలం అవుతోందని తెలుసుకుని, హైదరాబాద్ వాళ్లు శ్రీశ్రీగారికి సన్మానం చెయ్యటానికి చాలా తీవ్రంగా ప్రయత్నాలు, ఏర్పాట్లు చెయ్యటం ప్రారంభించారు.
ఇంటిమీద అప్పిచ్చినవాడు రోజూ ప్రాణం తీస్తున్నాడు. ఒకపక్క ఇంటి బెంగ నన్ను పీడించేసి శవంలా తయారుచేస్తోంది. వారు పైకి అనరు. నేను అంటున్నాను. మా ఇద్దరి అవస్థా ఒక్కలాగే ఉంది.
ఒకరోజు రాత్రి శ్రీ పత్తిపాటి వెంకటేశ్వర రావుగారు ఫోన్ చేసి శ్రీశ్రీ గారితో మాట్లాడారు. ఆయన మా శ్రేయోభిలాషి, శ్రీశ్రీగారంటే అపరిమితమైన అభిమానం.
‘27.1.82వ తేదీన మీకు హైదరాబాద్లో సన్మానం చేస్తున్నాం. అప్పులవాడి దగ్గర ఒక నెల రోజులు టైమ్ తీసుకోండి. మరేమీ బెంగపెట్టు కోవద్దు. మీ ఆరోగ్యం జాగ్రత్త, మీరొచ్చినప్పుడు సరోజాగారితో సహా రావాలి’ అని ఫోన్లో చెప్పారు వెంకటేశ్వరరావుగారు.
ఆ రోజు మేమిద్దరం ఎంత రిలీఫ్ పొందామో చెప్పలేను.
వనపర్తి నుండి మిత్రులు, అత్యంత శ్రేయోభిలాషులైన డాక్టర్ శ్రీ బాలకృష్ణగారు ఫోన్ చేసి, మార్చి 12వ 3໖ 1982 శుక్రవారంనాడు వనపర్తిలో సన్మానం ఏర్పాటుచేస్తున్నామని, ఆ వేళకి మరెక్కడా ప్రోగ్రామ్ పెట్టుకోవద్దని, ఇది ఖాయమని చెప్పారు.
27వ తేదీ శనివారంనాడు హైదరాబాద్ లో ఉన్నాం. ఆ రోజు మీటింగ్ ఎంత ఘనంగా జరి గిందో చెప్పటానికి లేదు. చాలా పెద్ద హాలు. రెండువేలమందికి తక్కువ లేకుండా జనం కిక్కి రిసిపోయారు.
శ్రీ రాజేశ్వరరావుగారు మాట్లాడుతూ… ‘మన శ్రీశ్రీకి మనం ఈరోజు సన్మానం చేసుకుంటున్నాం. శ్రీశ్రీ తలచుకున్నాడు కనుక అక్షర లక్షాధిపతి, మాటల కోటీశ్వరుడు అయ్యాడు. తలచుకోకపోవడంవల్ల ఆర్థిక కోటీశ్వరుడు కాలేకపోయాడు. ఏనాడో మన శ్రీశ్రీకి జ్ఞానపీఠ అవార్డు రావలసిన మాట, రాకపోతే పోయే, శ్రీశ్రీకి ఎవరో జ్ఞానపీఠ అవార్డు ఇవ్వలేదని బాధపడాల్సిన అవసరం లేదు. అంతకన్నా కోటిరెట్లు ఎక్కువైన ప్రజాపీఠ అవార్డునే మనందరం తలుచుకుంటే ఇవ్వగలం’ అనేసరికి హాలంతా చప్పట్లతో ధ్వనించింది.
తర్వాత శ్రీ పత్తిపాటి వెంకటేశ్వరరావుగారు చాలా ఉద్రేకంగా మాట్లాడారు.
‘మేము శ్రీశ్రీగారికి ఈ సన్మానంలో 15వేల రూపాయలు సమర్పిస్తున్నాం. ఇంకా ఎక్కువగానే చెయ్యాలనుకున్నాం. కాని వ్యవధి చాలలేదు. శ్రీశ్రీని పెద్దగా మనం ఆదుకోలేకపోయినా, శ్రీశ్రీ కుటుంబం నడిరోడ్డున పడకుండా, వేలానికి సిద్ధంగా ఉన్న వారింటిని కాపాడి ఆదుకోగలమన్న నమ్మకముంది.
ఏ ప్రజలకోసం తన కలాన్ని ధారపోశారో, ఏ ప్రజల్ని నమ్ముకుని తన స్వవిషయాల్ని కూడా లక్ష్యపెట్టకుండా తనజీవితాన్ని అర్పించారో… అటువంటి మహాకవి శ్రీశ్రీని ఆదుకోడానికి మీరందరూ ముందుకు రావాలి.
పూజ్యులు శ్రీ రాజేశ్వరరావుగారు చెప్పినట్టు జ్ఞానపీఠ అవార్డు కాదు, ప్రజావాహిని ముందుకొస్తే ‘ప్రజాపీఠ’ అవార్డులు శ్రీశ్రీకి చాలా ఇవ్వగలం.
ఈ సొమ్ముతో వారి కష్టాలు గట్టెక్కవు. ఇంటి అప్పు, అసలు, వడ్డీ చక్రవడ్డీతో కలిపి 35 వేలు దాటిపోయింది. అందుచేత మీ అందరి సహాయం కావాలి. శ్రీశ్రీగారి మీదున్న గౌరవాభిమానాల్ని వెల్లడి చేసుకునేటందుకు ఇదే మంచి అవకాశం’ అంటూ 15వేల రూపాయల చెక్కుని శ్రీశ్రీగారి చేతికి ఇచ్చారు.
ఇంతలో ఆడియన్స్ నుండి ఎవరో శ్రీశ్రీ అభిమాని స్టేజీమీదకి వచ్చి ఆమె చేతికి ఉన్న రెండు బంగారుగాజులు (రెండున్నర కాసులకి తక్కువ ఉండదు) తీసి, అక్కడ ఉన్న హుండీలో వేశారు.
మేం హైద్రాబాద్ లో ఫిబ్రవరి ఒకటో తేదీన బయలుదేరి మద్రాసు వచ్చాం.
హైద్రాబాద్ నుండి మద్రాసు రాగానే ముందు
వాసుదేవన్ (అప్పిచ్చిన వ్యక్తి)కి ఫోన్ చేసి రమ్మన్నాం.
మమ్మల్నే రమ్మన్నాడాయన.
మేమిద్దరం వెళ్లి ‘ఎంతయింద’ని అడిగాం. ఓ రెండు గంటల్లో లెక్కలన్నీ చూసి ‘ఇదివరలో కట్టింది కాక ఇంకా 38 వేలు బాకీ’ అన్నాడాయన. నేను చాలా బాధపడ్డాను. తగ్గించమని ప్రాధేయ పడ్డాను.
‘మొత్తం పట్టుకురా, చూస్తాన’న్నాడాయన. సరేనని 12 వేలు కట్టి మేం తీసుకున్న వ్యవధిలోగా మిగిలింది కట్టేస్తామని చెప్పి ఇంటికి వచ్చేశాం.
ఈలోగా వనపర్తి నుండి మిత్రులు, అత్యంత శ్రేయోభిలాషులైన డాక్టర్ శ్రీ బాలకృష్ణగారు ఫోన్ చేసి, మార్చి 12వ తేదీ 1982 శుక్రవారంనాడు. వనపర్తిలో సన్మానం ఏర్పాటుచేస్తున్నామని, ఆ వేళకి మరెక్కడా ప్రోగ్రామ్ పెట్టుకోవద్దని, ఇది ఖాయమని చెప్పారు.
మా ఇద్దరికీ ఏనుగుబలం వచ్చేసింది. ఆపదల నుండి గట్టెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయని అనుకుని ఇద్దరం హాయిగా ఊపిరి తీసుకున్నాం. 12.3.82న హైద్రాబాద్ వెళ్లాం. 13న డాక్టరు బాలకృష్ణగారి దంపతులతో కలసి 10 గంటలకి వనపర్తికి బయల్దేరాం. మధ్యాహ్నం భోజనాల వేళకి వనపర్తికి చేరుకున్నాం.
ఊరవతల (చిట్యాల) తోటలో ఉన్న చిన్న మేడ మాకిచ్చారు. ఆ రోజంతా అక్కడే హాయిగా రెస్ట్ తీసుకున్నాం. మేడచుట్టూ ఓపెన్ ప్లేస్ ఉంది. మర్నాడు 14.3.82న సాయంకాలం నాలుగు గంటలకి ఆ ఖాళీస్థలంలో అమర్చిన స్టేజ్ మీదకి వచ్చేశాం. విపరీతమైన జనం వచ్చారు. ఐదున్నరకి మీటింగు ప్రారంభమై ఎనిమిదిన్నరకి ముగిసింది. ఆ మీటింగ్లో శ్రీశ్రీగారికి 25,000 రూపాయ లిచ్చి సన్మానం చేశారు.
ఆ రోజు ఒక బ్రహ్మాండమైన నాటకం వేశారు. 11 గంటలవరకూ కూర్చున్నాం. ‘ఇంకా ఉందా మ’ని శ్రీశ్రీ గారన్నారు. మంచు పడుతోందని నేను, బాలకృష్ణగారు శ్రీశ్రీగారిని తీసుకొచ్చేశాం. ఇల్లు దక్కింది
డాక్టర్ బాలకృష్ణగారికి, వారి భార్యకి కృతజ్ఞతలు చెప్పి, 15.3.82న జీపులో బయల్దేరి ఆ రాత్రే బయల్దేరి మరుసటి రోజుకి మద్రాసు. చేరుకున్నాం. ఒక రోజు రెస్ట్ తీసుకుని, మర్నాడు మాకు అప్పు ఇచ్చిన వాసుదేవన్ గారి దగ్గరికి వెళ్లాం, లెక్క అడిగాం.
మొత్తం 38 వేలకి 12 వేలు ఇచ్చారు. మిగిలిన డబ్బుతో ఒక నెల వడ్డీ కలిపి చెల్లించమన్నాడాయన.
‘మా దగ్గర 23వేల రూపాయలే ఉన్నాయి. ఇదివరకు 12 వేలిచ్చాం. మీకిష్టం ఉంటే తీసుకోండి. లేకుంటే మీ ఇష్టం. ఇది ఆంధ్రప్రజలు చీమూ, నెత్తురు కూడబెట్టి శ్రీశ్రీ కోసం ఇచ్చిన డబ్బు!’ అని గట్టిగా అన్నాను.
కొంత అల్లరి పెట్టినా, మొత్తంమీద అంతా శాంతంగానే జరిగిపోయింది. ప్రోనోటూ, ఎగ్రిమెంట్లూ అన్నీ చింపేసి ఇంటి పత్రాలను తీసుకు వచ్చేశాం.
ఇంటికి రాగానే పిల్లలందరూ ‘అమ్మా, అప్పా’ అంటూ మా చుట్టూ చేరారు. శ్రీశ్రీగారు పిల్లల్ని తన దగ్గర కూర్చోబెట్టుకుని… ‘ఇంటిపత్రాలు తీసుకొచ్చేశాం నాయనా! ఇంతకాలానికి అప్పుల బాధనుండి బయటపడ్డాం. కాని వడ్డీల బాధ మనకి ఇంకా ఉంది. మీ అమ్మ నగలు కొన్ని మార్వాడీ దగ్గరున్నాయి’ అన్నారు.
‘అబ్బ పోనీలెద్దురూ. డబ్బున్నప్పుడు నగలు తెచ్చుకుంటాం. లేకపోతే పోనివ్వండి. ఇల్లు దక్కింది అంతే చాలు’ అన్నాను.
ఇంతలో మా పెద్దమ్మాయి ‘అప్పా! హైద్రాబాదు నుండి ఫోన్ వచ్చింది. బాలకృష్ణగారట. తనకి ఫోన్ చెయ్యమని చెప్పారు’ అంది.
శ్రీశ్రీగారు వెంటనే బాలకృష్ణగారికి ఫోన్ చేశారు.
20వ తేదీన ఒక పెళ్లి ఉందని, అది మీ చేతులమీదగానే జరగాలని, శ్రమ ఇస్తున్నందుకు మన్నించాలని, అదొక ఆదర్శవివాహమని, బాలకృష్ణయ్యగారు ఫోన్లో చెప్పారు.
‘తప్పకుండా వస్తాన’ని చెప్పి ఫోన్ పెట్టేశారు శ్రీశ్రీగారు.
“మొన్ననే ఊరునుండి వచ్చారు. మళ్లీ కేంపులా! ఒళ్లు ఏమౌతుంద’ని పిల్లలు కోప్పడ్డారు. ‘మీ అమ్మ ఉంటుంది నాయనా! మరేం ఫరవాలేదు. వెల్లి వచ్చేస్తా’ అని చెప్పారు.
ఇక ఈయనతో లాభంలేదు. మనం వెంట ఉండి జాగ్రత్తగా చూసుకోవడం ఒక్కటే మార్గమని నేను మరేమీ మాట్లాడలేదు.
19.3.82న హైద్రాబాద్ బయలుదేరం 20వ తేదీ ఉదయం 10 గంటలకి పెళ్లి.
అదొక డ్రామా హాలులా ఉంది. హడావుడి ఏమీ లేదు. మేళతాళాలేమీ లేవు, ముఖ్యులూ, కావలసినవాళ్లూ మాత్రం వందమందిదాకా వచ్చారు. అది కులాంతర వివాహం. కొత్త దంపతులిద్దరూ స్టేజి మీద కూర్చున్నారు. శ్రీశ్రీగారు స్టేజ్ ఎక్కి, వాళ్లిద్దరిచేతికి చెరొక పూలదండ ఇచ్చారు. ఇద్దరూ దండలు మార్చుకున్నారు. నూతన దంపతులు వేళ్లకి ఉంగరాలు మార్చుకున్నారు. ఆ పెళ్లి సందర్భంగా శ్రీశ్రీగారూ, బాలకృష్ణగారు తదితరులు మాట్లాడారు. ఈ పెళ్లితతంగం అంతా ముగిసేసరికి 2 గంటలు అయింది. పెళ్లి సింపుల్ గా చక్కగా జరిగిపోయింది. తర్వాత అందరం భోజనాలు చేశాం
ఏం మిగిల్చారు శ్రీశ్రీ?
‘ఇద్దరం కలిసి 150 చిత్రాల వరకు పనిచేశాం. ఇప్పటికీ వారిని గురువు’గారనే పిలిచేదానిని. మాకోసం మీరు బాధపడకండి అని నేనూ, పిల్లలూ ఎప్పుడూ చెబుతుండేవాళ్లం. వారిపేరు సాహిత్యంలో ఉన్నంతవరకూ మేమూ ఉంటాం! అదే మేము కోరుకున్నది, కోరుకునేదీను! నేను వారిదగ్గరకు అడుగు పెట్టేసరికి వారు 35 రూపా యల అద్దె ఇంట్లో ఉండేవారు. మా ఇద్దరి కష్టంతో తరువాత్తరువాత రెండిళ్లు సంపాదించుకున్నాం.
సకల యజ్ఞములకు సకల తీర్థములకు తలలు గొరుగుకున్న ఫలము లేదు మంత్రజలముకన్న మంగలిజలమెచ్చు విశ్వదాభిరామ వినురవేమ!
ఏ ప్రజల కోసం మీ జీవితాన్ని అంకితం. చేసుకున్నారో అలాగే నడవండి అంటుండేవాళ్లం. మా ఇల్లు వేలం సమయంలో ఉన్నప్పుడు ఆ ప్రజలే మమ్మల్ని ఆదుకున్నారు. హైద్రాబాదులో పత్తిపాటి వెంకటేశ్వరరావుగారు, ఇతర మిత్రులు, అభిమానులు 18,000 రూపాయలు ఇచ్చారు. అలాగే వనపర్తికి చెందిన శ్రీశ్రీ అభిమానులు డాక్టరు బాలకృష్ణగారు పెద్ద సన్మానం చేసి శ్రీశ్రీ గారికి 25,000 రూపాయలు ఇచ్చారు. అప్పుడన్నాను… చూశారా! మీరునమ్ముకున్న ప్రజలే మిమ్మల్ని గట్టెక్కించారని.
(సరోజా శ్రీశ్రీ రాసిన ‘సంసారంలో శ్రీశ్రీ’ నుండి కొన్ని భాగాలు యధాతథంగా