మా అన్నయ్య
శ్రీ ప్రమీలా రాణి
1947. ఆరోజు 15 ఆగస్టు, విద్యార్థి నాయకుడుగా బాలక్రిష్ణగారు వేణుగోపాలస్వామి ఆలయావరణలో జాతీయజండా ఎగురవేయవలసి ఉండెను. విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో హాజరైనారు. వారు జాతీయ జండా ఎగురవేస్తే వారిని పోలీసులు స్వాధీనపరచుకున్నారు. ఆయనను అరెస్టు చేసినందుకు నిరసనగా విద్యార్థులంతా ఉరేగింపు జరిపినారు. ఆ దృశ్యం ఇంకా నాకు కళ్లముందు కదలాడుతూనే ఉంది.
1947. ఆరోజు 15 ఆగస్టు, విద్యార్థి నాయకుడుగా బాలక్రిష్ణగారు వేణుగోపాలస్వామి ఆలయావరణలో జాతీయజండా ఎగురవేయవలసి ఉండెను. విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో హాజరైనారు. వారు జాతీయ జండా ఎగురవేస్తే వారిని పోలీసులు స్వాధీనపరచుకున్నారు. ఆయనను అరెస్టు చేసినందుకు నిరసనగా విద్యార్థులంతా ఉరేగింపు జరిపినారు. ఆ దృశ్యం ఇంకా నాకు కళ్లముందు కదలాడుతూనే ఉంది.
దాని పర్యవసానంగా వనపర్తి సబ్ జైలు నందు పెట్టి ఆ తరువాత ఇక్కడి నుండి తరలించి ముషీరాబాదు జైలుకు తరలించారు. వనపర్తి పాతకోట జైల్లో ఉన్నపుడు నాకు కండ్లకలక వచ్చినా అన్నయ్యకు రోజూ వెళ్లి పేపర్ ఇచ్చి వచ్చేదాన్ని. వారు చాలా ధైర్యముతో ఉద్యమాల్లో పాల్గొన్నారు. అన్ని జాతీయ కాంగ్రెస్ కార్యక్రమములలో పాల్గొని యువనాయకునిగా పేరుగాంచారు. అదే సమయంలో వనపర్తికి జయప్రకాష్ నారాయణ, ఆచార్య కృపలానీగారు వచ్చి స్వాతంత్ర పోరాటం గురించి ప్రజలకు తెలియచేసారు. రజకార్ల దౌర్జన్యాలను ఎదుర్కొని కర్నూలు ప్రాంతములో మిలటరీ శిక్షణ పొందారు. ఇదే సమయమందు యం.బి.బి.యస్ కు ఉస్మానియా మెడికల్ కాలేజీ లో చేరి రెండవ సంవత్సరం నుండే వీలయినప్పుడల్లా వనపర్తికి వచ్చి ప్రజలకు ఉచిత సేవలందిస్తూ అందరి మన్ననలు చూరగొన్నారు.
అక్టోబరు 1955 యం.బి.బి.యస్. పరీక్ష యందు ఉత్తీర్ణులయి చిన్నపట్టణమయిన వనపర్తికి సేవచేయాలనే ఉద్దేశ్యముతో ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం విస్మరించి అప్పటినుండి ప్రజలకు ఉచిత వైద్య సేవందిస్తూ అనతికాలములోనే.. ప్రజల డాక్టరుగా మన్ననలందుకున్నారు.
మనదేశం స్వాతంత్రం సంపాదించిన తరువాత కమ్యూనిస్టు పార్టీ యొక్క సిద్ధాంతాల వైపు మొగ్గు చూపి, బీదల సమస్యల ఎడల సానుభూతి కనబరచి, వారి కోసం అహర్నిశలు పోరాడి వారికి న్యాయం చేసేవారు. ఉన్నత విద్య కొరకై అతడు డోంశ్ చదువుటకై సీతాపూర్ (ఉత్తర్ ప్రదేశ్) వెళ్లినప్పుడు వారికి వీడ్కోలు చెప్పడానికి వనపర్తి రోడ్ రైల్వే స్టేషన్ కు వెళ్లిన జనసమూహము వారు చూపిన ప్రేమ, ఆదరణలకు నిదర్శనము.
మహబూబ్ నగర్ జిల్లా అన్నిటియందు వెనుకు బడినదిగా ఉండింది. వైద్యవృత్తి యందు తగిన వసతులు లేవు. ఉన్న కొన్ని రీసోర్సెస్ తో క్లిష్టమైన ఇబ్బులను కూడా నయం చేసేవారు. జిల్లా నలుమూలలనుండి ప్రజలు వచ్చి వారి వైద్య సేవలందుకొన్నారు.
వైద్యవృత్తియే కాక వనపర్తి పట్టణాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో, వయో జన విద్య, పాఠశాలలు, జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేయుట, నిరక్షరాస్యత నిర్మూలనకు వారు కృషిసల్పినారు. వర్ణవిభేదాలను రూపుమాపుటకు సహపంక్తి భోజనమును ఏర్పాటు చేసినారు.
డాక్టరుగారి పట్ల ఊరిప్రజలకు అపారమైన ప్రేమ, అభిమానము ఒక రోజు డాక్టరుగారిని చిట్యాల యందు చంపే ప్రయత్నంచేశారని తెలిసి వనపర్తి ప్రజలంతా మేమందరము ఇండ్లకు కూడా తాళాలు వేయకుండా బయలుచేరినాము, చంద్రయ్య బావివద్దకు చేరిన తరువాత ఎలాంటి అపాయము జరుగలేదంటే ఊపిరి పీల్చుకున్నాం..
ప్రతి నెలకొకసారి ఆడవి ప్రాంతమునకు విశ్రాంతికని వెళ్లేవారు. ఆసమయంలో అక్కడ ఉండే చెంచులకు, లంబాడీలకు ఎరుకలకు మందులు, బట్టలు ఇచ్చేవారు. అదియే కాక వారి సుఖదుఃఖాలను, సమస్యలను తెలుసుకొని వాటి నివారణకు యత్నించేవారు. లంబాడీలకు చీరలు కట్టడం నేర్పిన ఘనత డాక్టరుగారిదే.
సమాజంలో ఉండే దురాచారాలను రూపు మాపి అక్షరాస్యతను పెంపొందించి సంస్కారవంతులను చేయాలనే తపన అధికంగా ఉండేది.
మా చిన్నతనంలో మేము చదువుకోవాలని మాకు చదువు చెప్పటానికి కొంత సమయం కేటాయించేవారు. నేను, మా చిన్నన్నయ్య (గోవర్దన్)కే కాక ఇరుగుపొరుగున ఉండే పిల్లలందరినీ ఒకచోట చేర్చి అందరికి చదువు చెప్పేవారు.
కొంతమంది అన్నయ్య స్నేహితులు అమ్మ దగ్గరకు వచ్చి అమ్మా మీవాడు ఎప్పుడూ చదువుతుంటాడు. పిచ్చివాడవుతాడంటే (అమ్మ నిరక్షరాస్యురాలు) ఆమె బాధతో బాల కిష్టయ్య ఎక్కువ చదివితే పిచ్చివాల్లవుతారంట కదరా అంటే ‘పిచ్ఛమ్మ ఎంత బాగా చదివితే అంత మంచి మార్కులతో ఫస్ట్ వస్తారు’ అని అమ్మకు నచ్చచెప్పేవాడు. అన్నయ్యలాంటి అన్నయ్య లాభోమేఁ ఏక్ చెప్పవచ్చు.
1981 నాకు విపరీతమైన కడుపునొప్పి వచ్చింది. అన్నయ్య వచ్చి చూచి మందులివ్వడం జరిగింది. అయినా నొప్పి తగ్గలేదు. అప్పుడే వనపర్తి యందు చైనా మిత్రమండలి సమావేశాలు జరుగుతుండేవి. అందులో పాల్గొంటూనే ఇటు నన్ను చూస్తూ మందులిస్తూ వచ్చారు మరుసటి రాత్రి 2 గం॥ లకు నొప్పి ఎక్కువై భరించుకోలేని పరిస్థితి ఉంది. మా వారు చిట్యాలకు వెళ్లి అన్నయ్యను తీసుకొని వస్తే నన్ను చూసి అమ్మా మీ అమ్మకు మంచినీళ్లు కూడా ఇవ్వొద్దండి దాహమంటే ప్రత్తితో పెదవులు తూడ్చండని మా పిల్లకు చెప్పారు. అదే విధంగా మరుసటి దినం మీటింగు అయిన తరువాత నన్ను హైదరాబాద్ కి డా. ఏ.కె. చారిగారి దగ్గరకు తీసుకొని వెళ్లారు. ఆ డాక్టరు నన్ను పరీక్షించి వీపు చరిచి రోగ నిర్థారణ ఎంత బాగా చేశావయ్యా, ఇంకెవరైనా ఐతే పేషంటుకు పాలో, పండ్లరసెమో ఇవ్వమని చెప్పేవారు లోపల పేగు చిట్లి. రోగి చనిపోయేది అని అన్నయ్యను చాలా కొనియాడారు. ఆరోజు మా అన్నయ్యే లేకుంటే నేనీరోజు బ్రతికుండేదానను కాదు. అందుకే మా అన్నయ్య నన్నెప్పుడూ వెంటాడే జ్ఞాపకం.