ఆయనొక మహావ్యవస్థ
అవి ఎమర్జెన్సీ రోజులు. అప్పటికి నేను ఇంటర్ విద్యార్థిని. ఆనాటికి వనపర్తి కేంద్రంగా చుట్టూ పాతిక ముప్పై కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాలపై డాక్టర్ బాలకృష్ణయ్యగారి ప్రభావం అధికంగా ఉండేది. ఒక డాక్టర్ గా, ప్రజా సేవకుడిగా నాటి తరాన్ని ప్రభావితం చేసిన మహోన్నత శక్తిగా ఆయన ప్రసిద్ధులు. నాడు మా యువతరం మొదలు పిల్లలు, వృద్ధులు ఎవరైనా సరే ఆయనతో పరిచయం లేకపోయినా ఆయన పేరుతోనే ప్రభావితమయ్యే కాలం అది. 1975, 76 కాలంలో మేం చదివే వనపర్తి జూనియర్ కాలేజీలోని ఉపేందర్ రెడ్డి, ఎస్.ఎన్. చారి అనే లెక్చరర్లు విద్యార్థుల్లో అభ్యుదయ భావాలను పెంపొందించడంలో తమదైన పాత్ర పోషించారు. అంతేగాక వారు నిర్భయం గా ఈ భావజాలం గొప్పతనానికి, ఆదర్శాలకు ఉదాహరణగా డాక్టర్ గారిని ప్రస్తావించేవారు. వీరు డాక్టర్ గారితో తమకున్న స్నేహం. భావసారూ వ్యతల వల్ల అక్కడి పరిస్థితులలో నిర్భయంగా ఆదర్శాల ప్రచారం చేసేవారు. ఒక కొత్త ఆలోచనను ప్రజల్లోకి తీసుకుపోవడానికి ప్రయత్నం చేసేవారికి డాక్టర్ బాలకృష్ణయ్యగారు కేంద్ర బిందువుగా నిలిచారు.
అలా విద్యార్థి దశలోనే డాక్టర్ గారి ప్రభావం మా లెక్చరర్ల ద్వారా మాపై పడింది. ఈ ప్రభావం అనంతరం నేను డిగ్రీ చదివేందుకు హైదరాబాదు వెళ్లాక కూడా కొనసాగింది. అయితే ఆయనతో
నాకు అప్పటికి వ్యక్తిగత పరిచయం లేదు. ఒక నేనేకాదు, నావంటివారు చాలామందే ఉండేవారు. కాలక్రమంలో 1977-80 మధ్యకాలంలో జరిగిన ప్రజాస్వామిక ఉద్యమాలు, అత్యవసర పరిస్థితి తరువాత జరిగిన శాసనసభ ఎన్నికల్లో డాక్టర్ గారు వనపర్తి స్థానానికి జనతా అభ్యర్థిగా పోటీచేశారు. నాకేమీ ఆయనతో పరిచయం లేకపోయినా, ఎన్నికల్లో పనిచేసే ప్రావీణ్యం లేకపోయినా డాక్టర్ గారికి మద్దతుగా ప్రచారం చేయాలనే తాపత్రయం ఉండేది. అలా నా సహ విద్యార్థులతో కలిసి డాక్టర్ గారికి మద్దతుగా స్వంత బాధ్యతగా భావించి ఎన్నికల ప్రచారం చేశాను.
అలా ఎన్నికల్లో ఒక ప్రజానాయకుడు స్వచ్ఛందంగా ఎన్నికల ప్రచారం చేయించుకోవడం ఆ రోజుల్లో చాలా గొప్ప విషయం. ఆ ఎన్నికల్లో డాక్టర్ గారు ఓడిపోయినా నాటి మార్పుకు, మారుతున్న ప్రజల అభీష్టానికి ఒక కేంద్రంగా నిలిచారు.
అనంతరం నేను వామపక్ష విద్యార్థి ఉద్యమాలలో పాల్గొంటున్న కాలంలో 1980 ఏప్రిల్లో ఉద్యమాల్లో భాగంగా గ్రామాలకు తరలి ప్రజల జీవనవిధానాన్ని అధ్యయనం చేయాల్సి వచ్చినపుడు మా బృందం ఖమ్మం జిల్లా సత్తుపల్లికి వెళ్లింది. అప్పుడు సత్తుపల్లిలో భారత-చైనా మిత్రమండలి సభలు జరుగుతున్నవి. అప్పుడాయన ఆ సంస్థ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అది తెలుసుకున్న నేను ఆ సమావేశానికి వెళ్లాను. సభానంతరం నేను డాక్టర్ గారివద్దకు వెళ్లి నేను వనపర్తి దగ్గరలోని పాన్‌గల్ చెందినవాడినని పరిచయం చేసుకున్నాను. ఆయన నన్ను అత్యం త ఆప్యాయంగా పలకరించి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నేను వామపక్ష ఉద్యమాల్లో భాగంగా ఇతర జిల్లాలకు ప్రతినిధిగా రావడం గొప్ప విషయమని అభినందించారు. నన్ను తరచూ కలుస్తూ ఉండమని “నీవు, నీవంటి చాలామంది ఔత్సాహికులు మన జిల్లాలో కూడా పనిచేసి చాలామందిని ఉద్యమం వైపు నడిపించాలని చెప్పారు. అప్పటికి వనపర్తి ప్రాంతంలో వామపక్ష విద్యార్థి ఉద్యమాలు ఉన్నా అవి తక్కువే. ఆ తరువాత భారత-చైనా మిత్రమండలి రాష్ట్ర మహాసభలకు పశ్చిమ బెంగాల్ మంత్రి భక్త భూషణ్ మండల్ వచ్చారు. ఆ సభల్లో డాక్టర్ గారిని రెండవసారి చూడటం జరిగింది.
అప్పటినుండి మొదలైన డాక్టర్ గారితో సహచర్యం క్రమంగా ఆత్మీయబంధంగా మారింది. ఆయన రాజకీయ అభిప్రాయాలు నాకు మార్గదర్శకాలైనవి. కొన్ని కారణాల వల్ల నేను మహారాష్ట్ర లోని మరట్వాడ వర్సిటీనుండి ‘లా’ చదవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే పి.డి.ఎస్.యు.లో ఒక కార్యకర్తగా పనిచేస్తున్న డాక్టర్ గారి కూతురు వాసంతితో ఉద్యమ రాజకీయ ప్రస్థానంలో ఏర్పడిన పరిచయం పెళ్లి నిర్ణయం దాకా వచ్చింది. ఇది తెలుసుకున్న డాక్టర్ గారు నిస్సంకోచంగా మా పెళ్లికి అంగీకరించి, నా భవిష్యత్ లక్ష్యాన్ని హృదయపూర్వకంగా ఆహ్వానించి కులమతాలకతీతంగా 1983 జూన్ 19న మా పెళ్లి చేశారు. అప్పటికే ఆయన వనపర్తి ఎం.ఎల్.ఏ.గా ఎన్నికై ఉన్నారు. తర్వాత న్యాయవాద వృత్తి ప్రారంభించిన నేను దీనికి సమాంతరంగా రాజకీయవాదిగా కొనసాగుతూ వచ్చిన గుర్తింపు ఏదైనా ఉందంటే అది నా శ్రమకు తోడు డాక్టర్ గారి రాజకీయాల అండ కూడా ఉందనడానికి సందేహించను.
ఆయనతో వ్యక్తిగతంగా, కుటుంబపరంగా రాజకీయపరంగా ఉన్న అనుబంధంతో నన్ను నేను తీర్చిదిద్దుకోవడానికి, జనం చేరువ కావడానికి ఆయన భావాలు మాకుఎంతైనా తోడ్పడినవి. డాక్టర్ గారు నాకుగాని, నా సహచరులకు గాని ఏదైనా పని చెప్పడమంటే అది పరీక్ష పెట్టడం వంటిదే అయ్యేది. ఒకసారి భారత-చైనా మిత్ర మండలి జాతీయ కార్యవర్గ సమావేశాలు బెంగుళూరులో జరిగినప్పుడు ఆయనతో బాటు నేనూ వెళ్లాను. ఆ ప్రయాణంలో ఆయన చెప్పే చాలా విషయాలు ఆయన మేధోసంపత్తిని రుజువు పరిచేవే. మేం ఎక్కిన రైలు వాయిల్పాడు స్టేజి రాగానే స్టేషన్లో దిగుదామన్నారు. ఇద్దరం దిగాం. దిగగానే నాలుగడుగులు అటు ఇటూ వేసి మళ్లీ రైలెక్కారు. నాకు ఆయన వైఖరి ఏమి అర్థం కాలేదు. రైలు బయలుదేరింది. నన్ను, నా సందేహాన్ని గమనించిన ఆయన “ఏమీలేదు అప్పటి కమ్యూనిస్ట్ సాయుధ పోరాటకాలంలో ఈ వాయల్పాడు ప్రాంతంలో కూడా బలమైన పోరాటం నడిచింది. అందుకే ఈ ప్రాంతంలో కూడా కాలుమోపాలనుకున్నాను. అందుకే అలా దిగి మళ్లీ రైలెక్కా”నని చెప్పారు. ఈ ప్రాంతానికి చెందిన అవిభక్త కమ్యూనిస్ట్ పార్టీ ఎం.ఎల్.ఏ. సి.కె. నారాయణరెడ్డిగారితో తనకున్న అనుభవాల్ని వివరించారు. విచిత్రమేమిటంటే నారాయణరెడ్డి కొడుకు, కూతురు నాకు డిగ్రీలో, ‘లా’లో సహాధ్యాయులు,
డాక్టర్ గారు గొప్ప హాస్యప్రియుడు. అందులో వ్యంగ్యత ఉండినా సున్నితత్వం ఉండేది. ఆయన ప్రతి మాటకు తాత్విక భావన జతగూడేది. ప్రారంభదశలో నాస్తికుడే అయినా ఎదుటివారి భావాలను గౌరవించి తన అభిప్రాయాలను గౌరవింపజేసే వ్యక్తిత్వం ఆయనది. అందుకే ఆయన కొలమానానికి అతీతుడు.
డాక్టర్ గారు కొన్ని దశాబ్దాలపాటు ప్రజలకు సంబంధించిన సమస్యలతో ప్రజలకోసం పని చేశారు. వనపర్తి స్థానంనుండి అసెంబ్లీకి తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా ఎన్నికైనారు. రెండుసార్లు ఎం.ఎల్.ఏ.గా ఉండి ఆర్టీసి గోల్కొండ రీజియన్, వెనుకబడిన తరగతుల కార్పొరేషన్ల చైర్మన్ గా, అసెంబ్లీ హౌస్ కమిటీ చైర్మన్ గా పనిచేసి నాడు తనున్న పార్టీ అధినేత ఎన్.టి.ఆర్. చేత మున్నన, మర్యాదలు పొందిన అతి కొద్దిమంది ఎం.ఎల్.ఏ.ల్లో ఒకరీయన. ఎం.ఎల్.ఏ.గా ముఖ్య మంత్రితో కలిసారంటే ఏదో ఒక ప్రజా సమస్య పరిష్కారం కోసమే వెళ్లేవారు. ఆయన కాలంలోనే ప్రతి మండలానికో జూనియర్ కళాశాలను, వనపర్తిలో బాలికల జూనియర్ కళాశాలను, అప్పటికి ప్రైవేట్ యాజమాన్యం చేతుల్లో ఉన్న డిగ్రీ కళాశాలను ప్రభుత్వంలో విలీనం చేయడం, సుమారు 50 ప్రాథమికోన్నత పాఠశాలలను హైస్కూళ్లుగా అప్ గ్రేడ్ చేయడం పంచాయతీరాజ్ రోడ్లను ఆర్అండ్ లో విలీనం చేయడం చాలా గ్రామాల్లో మంచినీటికోసం వసతులు కల్పించడం వంటిని డాక్టర్ గారి కాలంలోనే జరిగినవి. ఒక ఎం.ఎల్.ఏ.గా ప్రజల పనులే తన పనులుగా జనబాహుళ్యానికి ఉపయోగపడే కార్యక్రమాలనే చేపట్టారుగానీ ప్రయోజనాల కోసం ఎప్పుడూ నిర్ణయాలు తీసుకోలేదాయన.
1987-88 కాలంలో చిట్యాల వాగుపై “తారక రామ ప్రాజెక్టు” నిర్మించి వేలాది ఎకరాలకు సాగునీరు అందించడానికి పూనుకున్నారు. దీని రూపకల్పనకు ఆయన సర్వే కూడా చేయించారు. కానీ తర్వాతి కాలంలో వచ్చిన శాసనసభ్యుల నిర్లక్ష్యం వల్ల కార్యాచరణకు నోచుకోలేదు. కానీ ఈ ప్రాజెక్టు ఆలోచన డాక్టర్ గారి ముందుచూపును నిరూపిస్తుంది.
వయస్సు పైబడి ఆరోగ్యం సహకరించక పోవడంతో 1991 తరువాత ఎన్నికల రాజకీయాలకు డాక్టర్ గారు దూరమయ్యారు. ఆయన క్రియాశీల పాత్ర పోషించినంతకాలం పార్టీలో ఘర్షణ వాతావరణాన్ని లేకుండా చూశారు. పార్టీగా కాకుండా, ప్రజల్ని ప్రజలుగా చూసి ప్రేమించి పనిచేసిన మనిషి ఆయన. తన కుటుంబ సభ్యుల నెంతగా ప్రేమించారో అదే భావనతో ప్రజలను ప్రేమించారాయన. ఇది ఆయనకే సాధ్యమైంది. అదే నిజమైన మానవత్వం అనిపించుకున్నారు. అనేక ప్రాంతాలవారు అనేకమంది ఆయన. కుటుంబంలో సభ్యులుగా ఉండి చదువుకుని ఎదిగిన వారెందరో ఉన్నారు. కుటుంబ సభ్యులు కూడా ఆయన్ను సమాజం కోసం పుట్టిన మనిషి గానే గౌరవించారు. రాజకీయాల్లోని అసహాయ
స్థితి ఆయన ఆరోగ్యంపై ప్రభావం చూపింది. డాక్టర్ గారిది నిరంతరం శోధించే వ్యక్తిత్వం. ఏ విషయాన్నైనా సాధారణంగా గాక మరో కోణం లో ఆలోచించడం ఆయన కలవాటు. నావంటి సన్నిహితులు ఆయనకు చాలామంది ఉన్నా మా బల్‌రాం ని ఎక్కువగా అభిమానించేవారు.
నేనును ఆయన కుటుంబ సభ్యుడినే అయినా చివరిదాకా కూడా ఆయన్ను ప్రజల్ని ప్రేమించి, సంస్కరించిన ఒక మహావ్యక్తిగానే నేను గౌరవిం చాను. ఆయనతో వ్యక్తిగత, కుటుంబ, రాజకీయ పరమైన అనుబంధంలో మమ్మల్ని మేం తీర్చిదిద్దుకోవడానికి, జనం చేరువకావడానికి ఆయన భావాలు తోడ్పడినవి.
ఒక మనిషి మనీషిగానేగాక మహావ్యవస్థగా ఎదగవచ్చు అన్నదానికి డాక్టర్ గారి జీవితమే ఓ పెద్ద ఉదాహరణ. ఇది అరుదుగానే జరుగుతుంది. కానీ ఇదే చరిత్రలో నిలుస్తుంది