వనపర్తి ప్రభుత్వాసుపత్రికి డా. బాలకృష్ణయ్య గారి పేరు

వనపర్తి పట్టణంలో నూతనంగా నిర్మించనున్న 501 పడకల ప్రభుత్వాసుపత్రికి ప్రముఖ ప్రజావైద్యుడు డాక్టర్ బాలకృష్ణయ్య గారి పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రజల సమక్షంలో బహిరంగ సభలో ప్రకటించి, స్వయంగా శంకుస్థాపన చేశారు.

ఈ చారిత్రక నిర్ణయం సాధ్యపడటంలో వనపర్తి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ మేఘారెడ్డి అన్నగారు కీలక పాత్ర పోషించారు.

డా. బాలకృష్ణయ్య గారి సేవలు

వనపర్తి ప్రజలకు 50 ఏళ్ల పాటు ఉచిత వైద్యసేవలు అందించారు.

స్వాతంత్ర్య సమరయోధుడు, వైద్యుడు, సర్పంచ్, మున్సిపల్ చైర్మన్ (20 సంవత్సరాలు), రెండు సార్లు ఎమ్మెల్యే, బిసి కార్పొరేషన్ చైర్మన్, ఆర్టీసీ గోల్కొండ డివిజన్ చైర్మన్, శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సభ్యుడు వంటి పలు పదవుల్లో విశేష సేవలు అందించారు.

వనపర్తి నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, ప్రతి మండల కేంద్రంలో ప్రాథమిక పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, బాలికల పాఠశాలలు, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేశారు.

వేలాది మంది విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు కల్పించగా, నిరుపేదలకు, నిరుద్యోగులకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు కల్పించారు.

ఆయన నిజాయితీ, నిబద్ధత, నిస్వార్థ ప్రజాసేవతో వనపర్తి ప్రజల హృదయాల్లో చిరస్మరణీయుడిగా నిలిచిపోయారు.

ప్రత్యేక కృతజ్ఞతలు

డా. బాలకృష్ణయ్య గారి శతజయంతి సందర్భంలో, వనపర్తి వైద్య కళాశాలకు నాన్నగారి పేరు పెట్టాలని మా కుటుంబం తరపున గౌరవనీయులు శ్రీ మేఘారెడ్డి అన్నగారిని విన్నవించగా, వెంటనే సుముఖత వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి గారితో చర్చించి ఆమోదం తీసుకొచ్చినందుకు ఆయనకు మా కృతజ్ఞతలు.

అదనంగా, వనపర్తి వైద్య కళాశాల మరియు నూతన ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో డాక్టర్ బాలకృష్ణయ్య గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని అన్నగారు హామీ ఇచ్చారు. అంతేకాక, ఈ సంవత్సరం జరగనున్న డాక్టర్ బాలకృష్ణయ్య గారి శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని తెలియజేశారు.

డా. బాలకృష్ణయ్య గారి కుటుంబ సభ్యులమైన మేము, వనపర్తి ప్రజల తరఫున, ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయన విశేష అభిమానుల తరఫున,

గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి

వనపర్తి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ మేఘారెడ్డి అన్నగారికి

మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.

✍️
శ్రీమతి ఉదయ శ్రీ
డాక్టర్ బాలకృష్ణయ్య గారి చిన్న కుమార్తె

Recent posts