ప్రగతివాది

డాక్టర్ బాలకృష్ణయ్య ప్రజల వైద్యుడిగా అందుబాటులో ఉంటూ, సేవలందించిన గొప్ప వ్యక్తి. వనపర్తి నియోజకవర్గంలోని మారుమూల గ్రామాలకు కూడా ఆయన వెళ్ళి, ప్రజల జీవన పరిస్థితులను దగ్గరగా తెలుసుకున్నారు. ఆయనతో కలిసి పాత్రికేయునిగా ఈ అనుభవాన్ని పొందడం నా అదృష్టంగా భావిస్తున్నాను.

డాక్టర్ బాలకృష్ణయ్య జీవితం తెరిచిన పుస్తకంలాంటిది. రోగులు ఏ సమయంలో వచ్చినా, ఇంట్లోకే చొచ్చుకువచ్చి వైద్య సహాయం పొందేవారు. పేద రోగులకు ఆయన దగ్గర ఉన్న మందుల శాంపిల్స్ ఏరోజు వచ్చినా ఆరోజే పంచేవారు. అత్యవసర పరిస్థితుల్లో తన కార్లోనే రోగులను ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రాణాలు కాపాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన డాక్టర్లు, వనపర్తిలో ప్రజలు డాక్టర్ బాలకృష్ణయ్యకు చూపే అనుబంధాన్ని, చనువును చూసి ఆశ్చర్యపోయేవారు. రోగుల పట్ల ఆయన అంకితభావం వారిని కూడా ఆకర్షించింది.

డాక్టర్ బాలకృష్ణయ్యగారు 30 ఏళ్ల పాటు ప్రజా ప్రతినిధిగా కొనసాగారు. 1970లో వనపర్తి ప్రజల త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన ఘనత ఆయనదే. ఈ పథకం తదనంతరం ఎన్నికైన ప్రజాప్రతినిధులకు మార్గదర్శకమైంది.

శాసనసభ్యుడిగా గ్రామాల్లో త్రాగునీటి సౌకర్యాలు, రోడ్లు, పాఠశాలలు, హాస్టల్స్ కోసం కృషి చేశారు. బాలికల విద్య కోసం ప్రత్యేకంగా జూనియర్ కళాశాల ఏర్పాటు చేసి, ప్రతి మండలానికో జూనియర్ కళాశాలను మంజూరు చేయించారు. వనపర్తి ప్రైవేటు డిగ్రీ కళాశాలను ప్రభుత్వానికి అప్పగించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

డాక్టర్ బాలకృష్ణయ్య గారి బోళాతనం, చిరునవ్వుతో శత్రువులతో కూడా చర్చించడం ఆయన వ్యక్తిత్వం లోని మరో విశేషం. నేనెప్పుడో రాసిన వార్తల ఆధారంగా, మా స్వగ్రామం జగత్పల్లి వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టి, తొలిసారిగా ఆర్టీసీ బస్సు ప్రారంభించడం ఒక చిరస్మరణీయ ఘట్టం.

 

డాక్టర్ భూపేష్ కుమార్ విదేశాల్లో ఉన్న తన ఆదాయాన్ని వదులుకొని, తండ్రి మార్గాన్ని అనుసరించడం అద్భుతం. ప్రజలకు వైద్యసేవలు అందించడంపై ఆయన సంకల్పం అభినందనీయమైంది. తన తండ్రి సేవలను భావితరాలకు స్ఫూర్తిగా నిలిపేందుకు పుస్తక రూపంలో అందించాలనే ప్రయత్నం ప్రశంసనీయం.