ప్రజల నాడి తెల్సిన డాక్టర్ బాలకృష్ణయ్య
మూడునాలుగు సంవత్సరాల వయస్సు ఉండవచ్చు. డాక్టర్ బాలకృష్ణయ్య అదే కాలంలో వనపర్తిలో వైద్య వృత్తిని చేపట్టారు. వనపర్తిలో మొట్టమొదటి ఎం.బి.బి.ఎస్ డాక్టర్. చిన్నతనంలో మట్టి తినడం వల్ల నేను అనారోగ్యానికి గురయ్యాను. మా ఊరు అచ్యుతాపురం నుండి వనపర్తికి ఐదు కిలోమీటర్ల దూరం. ప్రతిరోజూ నన్ను మా అమ్మ, నానమ్మ, లేదా మేనత్తలు భుజంపై ఎక్కించుకుని వనపర్తికి కాలి నడకన పది కిలోమీటర్లు పోయి వచ్చేవారు.
డాక్టర్ దాదాపు 1 సంవత్సర కాలం రోజూ ఒక ఇంజెక్షన్ ఇచ్చేవారు. అంత శ్రమ పడకుంటే బాల్యంలో నేను బతికేవాడిని కాదు. అలా డాక్టర్ బాల్యంలో నా ప్రాణదాత అయ్యారు.
తర్వాత నేను వనపర్తిలో ఇంటర్మీడియట్ చదువుతున్న కాలంలో, అప్పటికే కవిత్వం రాయడం, పుస్తకాలు చదవడం హాబీగా ఉండేది. ఒక సామాజిక ప్రయోజనం కోసమే సాహిత్యం అనే అభిప్రాయం నాకు వచ్చేది. వనపర్తిలో ఉన్న రాజకీయ, సామాజిక చైతన్యమే అందుకు కారణం. అందుకు డాక్టర్ వామపక్ష భావాలు, ప్రజా వైద్యుడిగా చేసిన సేవలు ప్రధానమయ్యాయి.
వనపర్తిలో డాక్టర్ ఆధ్వర్యంలో జరిగిన విప్లవ రచయితల సభ, కొల్లాపూర్‌లో భారత-చైనా మిత్రమండలి సభలు, శ్రీశ్రీని సన్మానించడం లాంటి సంఘటనలు నన్ను, నా వంటి యువకులను విప్లవ రాజకీయాల వైపు మొగ్గడానికి దోహదం చేశాయి. ఆ తర్వాత రాడికల్ విద్యార్థి సంఘంలో, ఎం.ఎల్.ఏ రాజకీయాల్లో చురుకుగా పాల్గొనడానికి దోహదం చేశాయి.
వనపర్తిలో రాడికల్స్ సభలు, పౌరహక్కుల సభలు డాక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించాం. జిల్లాలో ఆ తర్వాత ప్రజా ఉద్యమాలకు ఈ సభలు ఎంతో ఉపకరించాయి.
ఆ తర్వాత నేను డిగ్రీ ఫైనల్ చదువుతున్న రోజుల్లో, నా పెళ్లికి డాక్టర్ నైతికంగా ఎంతో సహకరించారు. ఇంటా బయటా ఎన్నో విమర్శలకు గురయ్యారు. డాక్టర్ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నా, చివరకు అసెంబ్లీకి ఎం.ఎల్.ఏగా ఎన్నికయ్యారు. అంతకు ముందు రెండుసార్లు ఓటమికి గురయ్యారు.
ఎన్నికల్లో ఆయనకు ఓటు వేయని వారు, ఆయన దగ్గరకు వైద్యం కోసం రావడానికి మొహమాట పడేవారు. అలాంటి వారు కలిసినప్పుడు, “ఓటు వేయకపోయినా కనీసం వైద్యం చేయించుకోకూడదా?” అని అడిగేవారు.
ఆస్తులు, డబ్బు సంపాదించడంలో ఆయన వృత్తిని తాకట్టు పెట్టలేదు. ఎన్ని ఆర్థిక సంక్షోభాలు వచ్చినా నిబ్బరంగా ఉండేవారు. డాక్టర్ స్ఫూర్తి వల్లనే, నా వంటి వారు జీవితంలో వచ్చిన ఒడుదుడుకులను ఎదుర్కొని నిలబడగలిగారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.