పేద ప్రజల పెన్నిది

మనుషుల మధ్య ఆర్థిక అసమానతలు అనాదిగా ఉన్నవే.
సంపన్నులు, నిరుపేదలు ప్రక్క ప్రక్కనే సహజీవనం సాగిస్తూ వస్తున్నారు. కానీ, పేద ప్రజలలో ధనిక వర్గంపై ఈనాడు ఉన్న ఈర్ష్యా ద్వేషాలు ఇంత మోతాదులో మునుపటి కాలంలో ఉండేవి కావు. అందుకు ముఖ్య కారణం మానవతావాదులైన సుహనీయులు డాక్టర్ బాలకృష్ణయ్య గారివంటి ఉదాత్త వ్యక్తులు ఆనాడు ఉండేవారు.

ఆస్తిపరులకు, అనాథలకు మునుపటి రోజుల్లో జీవన విధానం (lifestyle)లో పెద్దగా తేడాలు ఉండేవి కాదు. నిరాడంబర జీవితం (simple living) అందరూ అనుసరించేవాళ్లు. ధనికులలో ఉదారబుద్ధి ఉండేది. ఆపన్నులైన అనాధలను ఆదుకోవడం, దానధర్మకార్యాలు చేస్తూ త్యాగాలతో లబ్ధప్రతిష్ఠులు కావాలని కాంక్షించడం సంపన్న వర్గాలలో సర్వసాధారణంగా నెలకొని ఉండేది. కనుక అసూయా ద్వేషాలకు అంతగా ఆస్కారం ఆ రోజుల్లో ఉండేది కాదు.

ప్రస్తుతం స్వార్థం సర్వత్రా రాజ్యమేలుతోంది. మనుషులలో ధనదాహం మితిమీరిపోతోంది. ప్రక్కనున్న వారి పరిస్థితులతో ప్రమేయం లేకుండా, డబ్బును స్వంత సుఖాలకు, వ్యసనాలకు, విలాసాలకు విచ్చలవిడిగా, దురహంకారంతో ఖర్చు చేయడం ధనవంతులలో నానాటికీ హద్దులు దాటుతోంది. జీవనశైలిలో సంపన్నులకు, పేదలకు మధ్య అంతరం అమాంతం పెరిగిపోయింది. దీనివల్ల బీద ప్రజల గుండె మంటలు మరింతగా ప్రజ్వరిల్లడానికి ఆస్కారం ఏర్పడింది.

ఈ నేపథ్యంలో సమాజ సుస్థిరతను ఆకాంక్షించే ప్రతి ఒక్కరూ డాక్టర్ బాలకృష్ణయ్య గారి జీవితాన్ని ఆదర్శవంతంగా తీసుకోవడం ఈనాడు ఎంతైనా అవసరం.

నేను వనపర్తి పట్టణంలో 1959 నుంచి 1971 వరకు పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పని చేసిన పుష్కరకాలం పాటు డాక్టర్ బాలకృష్ణయ్య గారితో నాకు మంచి స్నేహ సంబంధాలు ఉండేవి.

ఒక ప్రతిభావంతుడైన డాక్టరుగానే కాకుండా, పేద ప్రజల పక్షపాతిగా అతనిలో ఉన్న ఔదార్యాన్ని, దయాగుణాన్ని, త్యాగబుద్ధిని నేను ఒక సన్నిహితునిగా గమనించాను. ఆ రోజుల్లో వనపర్తి చుట్టుప్రక్కల పల్లెసీమల్లో బీదరికం ఎక్కువగా ఉండేది. అన్నానికి గడవడమే కష్టంగా ఉండే పరిస్థితుల్లో, వాళ్ల ఆరోగ్యంపై ఖర్చు పెట్టే పరిస్థితులు ఉండేవి కావు.

అలాంటి దుర్భర జీవితం గడుపుతున్న వేలాది మంది నిరుపేదలకు డాక్టర్ బాలకృష్ణయ్య గారి దవాఖాన ఒక వరప్రసాదంగా ఆదుకునేది. డాక్టరు గారు ఎందరికో బీదలకు పైసా కూడా తీసుకోకుండా ఉచితంగా వైద్యం చేయడం నేను చూశాను. మళ్లీ తమ పల్లెలకు వెళ్లేందుకు పైసలు లేని పేద రోగులకు తానే బస్సు ఛార్జీలు ఇచ్చి పంపేవారు. ఆపదలో ఉన్నవాళ్లు కాకితో కబురంపితే చాలు, తన సైకిల్ త్రొక్కుకుంటూ దూరాల్లో ఉన్న గ్రామాలకు కూడా వెళ్లి వైద్యం చేసి వచ్చేవారు.

ఆ రోజుల్లో డాక్టర్ బాలకృష్ణయ్య గారికున్న ప్రాక్టీస్ ఎవరికీ ఉండేది కాదు. డబ్బే ప్రధానమని అనుకొని ఉంటే, అతడు రెండుచేతులా సంపాదించి, వనపర్తి పట్టణంలో సగం ప్రాపర్టీలు కొనేసి ఉండేవాడు. కానీ, ఆయన డబ్బు మనిషి కాదు. ఆయన మనసున్న మహామనీషి, ప్రజల మనిషి, బక్కచిక్కిన బడుగుజీవుల పక్షపాతి, మార్గదర్శకుడైన మహనీయుడు.

డాక్టర్ బాలకృష్ణయ్య గారు కోపంతో ఉండడం నేను ఎప్పుడూ చూడలేదు. చామనచాయ ముఖంలో మల్లెమొగ్గలలాంటి ఆయన పలువరస ధవళ కాంతులు చిందే దరహాసాన్ని ఒక సమ్మోహనాస్త్రంలా నిత్యమూ ప్రస్ఫుటింపజేస్తూ ఉండేది.

ఉన్నతమైన భావాలు, ఉత్తమ నాయకత్వ లక్షణాలు, ఉదారబుద్ధి, మానవీయ విలువలు, స్నేహశీలత పుష్కలంగా తన వ్యక్తిత్వంలో అంతర్భాగం చేసుకున్న గొప్ప వ్యక్తి డాక్టర్ బాలకృష్ణయ్య గారు నాకు చిరస్మరణీయులు. ఇప్పటి తరానికి మార్గదర్శకుడైన మహోన్నతుడు.