డాక్టర్ సాబ్‌కు నివాళి

doctor saab ku nivali

డాక్టర్ బాలకృష్ణయ్య గారంటే ఒక మానవీయ స్పర్శ. తల్చుకొంటే మనసు భావోద్వేగానికి గురౌతుంది. వారు ఉన్నతమైన మానవ విలువలకు నిజమైన ప్రతినిధి. మానవతావాది. హేతువాది. అన్నింటికి మించి వామపక్షదృక్పథాన్ని నిలువెల్లా నింపుకొన్న వ్యక్తి.
వైద్యం వ్యాపారమై, రోగి వినియోగదారుడైన ఈ వాణిజ్యప్రపంచంలో డాక్టర్ గారి జీవితమే ఈనాటి వైద్యులకు ఓ విలువైన పాఠ్యగ్రంథం. ఆయన ఓ సంచార వైద్యశాల. కారుకు చెయ్యి అడ్డంపెడితే చెయ్యి చూసి వైద్యం చేయటమే, అత్యవసరమైతే ఆ కారే ఓ అంబులెన్స్ అవుతుంది. ఎక్కడపడితే అక్కడ వైద్యం చేసినా ఎక్కడా దొరకని వైద్యపరిజ్ఞానం ఆయనది. బహుశా మనుషుల్ని ప్రేమించే ఆయన గుణమే దాని రహస్యం కావచ్చు.
విలువల వలువలూడుతున్న నేటి తరం కాంట్రాక్టర్ నాయకులకు క్షమించాలి… రాజకీయ నాయకులకి వారి జీవితం ఖచ్చితంగా ఓ పరిశీలనాంశం. ప్రజల సౌఖ్యాన్ని దొంగిలించి కరెన్సీ కట్టలుగా మార్చుకునే నాయకుల మధ్య బాలకృష్ణయ్య ప్రజల ప్రేమాభిమానాల్ని సంపాదించి ప్రజా నాయకుడిగా నిలిచాడు. రాచరికం, ప్రజాస్వామ్యం చెరోవైపు నిల్చున్నప్పుడు ప్రజల పక్షాన నిలబడి రాజరికాన్ని ఎదుర్కొన్నారు. ఎన్నికల రణరంగం లో పలుమార్లు ఓడినా పార్టీలు మార్చలేదు. నమ్మిన జనం వెంటే ఉన్నారు. తుదకు ఆ జనమే అధికారాన్ని అప్పచెప్పి అసెంబ్లీకి పంపిస్తే కూడా తామరాకుపై నీటిబిందువయ్యాడుగాని ఆ అధికారం జనాలకు దూరం చేయలేకపోయింది.
సాహితీప్రియుడిగా వారిని ఎన్నటికి మర్చి పోలేం. ‘సాహిత్యవేదిక’ లాంటి సంస్థలకు వెన్నుదన్నుగా నిలిచాడు. ప్రజాకవి వేమనపై అనర్గళంగా మాట్లాడేవారు. విప్లవకవులకు తానే వేదికై నిల్చి జ్వాలాముఖిలాంటి వారినెందరినో వనపర్తికి పరిచయం చేశారు. కష్టజీవులకు ఇరువైపులా నిలబడే కవులు తామే కష్టాల బారిన పడితే ప్రజలే మహరాజులై పోషిస్తారని నిరూపించారు.
వామపక్ష భావజాలానికి డాక్టర్ సాబ్ మన ప్రాంతంలో మంచి ప్రమోటర్ గా వ్యవహరించారు. కుల, మతాలకి అతీతంగా కుటుంబాలకు ఆపద్భాంధవుడిగా వ్యవహరించారు. సమావేశాలకు, చర్చాగోష్ఠులకు వారి ఇల్లు ఒక నిలయంగా ఉండేది.
వారి జీవితమొక ఆదర్శం అంటే అతిశయోక్తి కాదు, అది వాస్తనం. ఎవరి కుటుంబాన్ని వారు ప్రేమించటం గొప్ప కాదు. తనచుట్టూ ఉన్న మానవసమూహాన్ని కూడా ప్రేమించటం, దాన్ని ఆచరణలో చూపించటం గొప్ప విషయం. దాన్ని వారు సాధించారు.
నిన్న, నేడు, రేపు కాలం ఏదైనా సరే కాలానికి అతీతమైన వాస్తవం ఒక్కటే. వ్యక్తి తన జీవితకాలం లో సృష్టించుకున్న భౌతికమైన సంపదను జీవించి ఉన్నంతవరకే అనుభవించగలడు. మరణించాకకూడ అనుభవించగలిగేది శీలసంపద. అది మానవీయమైనది. వారు భౌతికంగా మరణించినా వారి స్ఫూర్తి మనల్ని ప్రేరేపిస్తూనే ఉంటుంది.
వైద్యం వ్యాపారమై, రాజకీయం రాక్షసత్వమై మనిషికి మనిషికి మధ్య ఉన్న బంధం మంచు తెరవలె పల్చనవుతూ ఉన్న ప్రస్తుత తరుణంలో డాక్టర్ బాలకృష్ణయ్య గారి గురించి మాట్లాడుకోవటమే కాదు వారి ఆదర్శాల్ని మన జీవితాల్లోకి కొంచెం నింపుకొందాం!