పేదల వైద్యుడు - పేదల నాయకుడు

ఆ రోజులను ఆదర్శవాదం కాలం అనవచ్చునేమో. నన్నింకా నెహ్రూ సోషలిస్టు తరహా ఉదారవాదం వదలని రోజులు. తొలి ఉద్యోగం ఢిల్లీలోసమాచారశాఖలో భాగమైన డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్వర్టయిజింగ్ అండ్ విజువల్ పబ్లిసిటీలో సబ్ ఎడిటర్ (తెలుగు)గా. వయస్సు ఇంకా పైలాపచ్చీసులో ప్రవేశించలేదు. ప్రేమవివాహం చేసుకున్న కొత్త రోజులు. చైనా యుద్ధం – పాకిస్తాన్ యుద్ధం (రెండూ ఇండియా రెచ్చగొట్టినవే) మధ్య రోజులు. 65 జనవరి నుంచి ఆగస్టు దాకా ఢిల్లీలో ఉన్నాను. చలం, శ్రీశ్రీలు నా సాహిత్య ప్రపంచాన్ని ఆవహించిన రోజులు. ‘ప్రేమలేఖలు’ రోజులు, నేనక్కడ ఉండగానే 1965 మేలో ‘దిగంబరకవులు’ మొదటి. సంపుటి వెలువడిన ఆహ్వానం అందింది కానీ పుస్తకం ఢిల్లీలో ఉండగా చూడలేదు గనుక అప్పటి కది సెన్సేషనల్ సాహిత్య చర్యగానే భావించాను. ఎందుకంటే వీళ్లకన్నా ముందే కాళోజీ ప్రెస్ కార్మికునితో తన పుస్తకాలు ఆవిష్కరణ చేయించాడు. ఆ మాటే వాళ్లు పంపిన ఆహ్వానానికి జవాబుగా రాశాను. ఉన్న ఏడు నెలల్లో మూడు నెలల్లో కొత్త ‣ఢిల్లీలో కొత్తకాపురం చేసిన హేమను, అమ్మను తిరిగి ఇంటికి పంపించాక (ఏముందని ఈ ఢిల్లీలో నీళ్లా, నిప్పులా – ఏమున్నది చూడడానికి, గోరీలు, సమాధులు తప్ప, మనం జ్వరం వస్తే రొట్టె తింటాం, వీళ్లు రొట్టెతిని ఎట్లా బతుకుతారు, ఇది మన భాషనా, మన దేశమా… ఇవీ మా అమ్మ తీవ్రనిరసనలు – ఆమె బలవంతమూ ఒక కారణం నేను ఢిల్లీ ఇంక వదలక తప్పదని నిర్ణయించుకోవడానికి) ఏర్పడిన విరహ విరామ కాలం లో దొరికాడు ఒక పాలమూరు జిల్లా మిత్రుడు. నేను ఉస్మానియా క్యాంపస్ లో ఉన్న రోజుల్లోనే మిత్రుడు ఎస్వీ రామారావు జ్యోతిర్మయి సంస్థ ఏర్పాటుచేసి తెచ్చిన కవితాసంకలనంలో హర గోపాల్తో పాటు కనిగా కనిపించిన ఆయన అప్పటి సన్నిహిత మిత్రుడు నరహరి ఇప్పుడయితే ఎన్. దేవరాజ్ అడ్వొకేట్ అనుకుంటాను. హరగోపాల్ ఎం.ఏ. విద్యార్థిగా శ్రీపతి రూంకి వచ్చి ”జ్యోతిర్మయి’ సంకలనంలోని తన కవిత వినిపించడం నాకింకా జ్ఞాపకం, అప్పటికి నాకు ఆ జిల్లానుంచి ఎక్కువ తెలిసిన ఆత్మీయుడు ఎస్వీ రామారావు ఒక్కడే. పైగా 1962 జులైనుంచి సెప్టెంబర్ దాకా ఆయన, నవీన్ (ఆపంశయ్య) కలిసి ఉన్న ఎ హాస్టల్ రూంలో జయపాల్ రెడ్డితో పాటు నేనూ ఒక అన్ ఆథరైజ్డ్ గెస్టు. నేను రీసెర్చ్ లో చేరడానికి, ఆయన ఎంఎలో చేరడానికి ప్రయత్నిస్తున్న రోజులు.
అప్పుడు నరహరిగా పిలుచుకున్న ఇప్పటి దేవరాజ్ అప్పుడు డిఫెన్స్ లో ఎయిర్ఫోర్స్ లో సప్లైలతో పనిచేసేవాడనుకుంటాను. ఏమైతేనేం నా ఒంటరితనంలో మాట్లాడి, మాట్లాడించడానికి ఒక మనిషి దొరికాడు. పైగా సాహిత్యం, రాజకీయాలు సమపాళ్లలో నా వలెనే ఆసక్తి, అభిరుచి ఉన్నాయి.
ఆయన నోట విన్నాను మొదటిసారి డాక్టర్ బాలకృష్ణయ్య పేరు. పైన చెప్పాను కదా అవి ఆదర్శవాదపు రోజులని. అన్నింట్లో ఆదర్శాలు, విలువలగురించి చాలా ఎక్కువగా చర్చించుకునే వాళ్లం. అందుకే లాల్ బహదూర్ శాస్త్రి అంటే ఆయన రాజకీయ దృక్పథం కన్నా ఆదర్శం, విలువలు, వ్యక్తిగత నిజాయితీపట్ల ఎంతో గౌరవం ఏర్పరచుకున్నాం. అన్నిటికన్నా ఆదర్శం తో, విలువలు ఆచరిస్తూ గొప్ప మానవసేవ చేయగల రంగం వైద్యవృత్తి అనే చర్చ మామధ్య వచ్చినపుడు – “This time the first ever chance we get to go to AP, I will take you to Wanaparthy to show you a వైద్యో నారాయణో హరి అయనే డాక్టర్ బాలకృష్ణయ్య” – అని ఉరకలు పెట్టే ఉత్సాహంతో పరిచయం చేశాడు గనుక ఇంగ్లీషులో వచ్చిందా మాటల ప్రవాహం. వాళ్ల ఊరు బుద్దారం, బహుశా గోన బుద్ధారెడ్డి కాకతీయుల సైన్యాధికారి కోట నిర్మించి ఆ తర్వాత స్వతంత్రం ప్రకటించుకున్న రాజధాని.
అట్లే సాహిత్య చర్చలు వచ్చి మేం క్యాంపస్లో
సినిమాహాల్ ముందో, కల్లుదుకాణం ముందో, పోలింగ్ బూత్ ముందో ఉన్నంత తొడతొక్కిడిగా ఉన్నారు జనం – డాక్టర్ బాలకృష్ణయ్య ఉచితవైద్యశాల ముందు.
ప్రారంభించిన ‘నవత’ కవిత్వ పత్రికకు నేను భౌగోళికంగా కూడ దూరమైనా ఒక సాహిత్య పత్రిక స్వప్నాలు కంటున్నందువల్ల You are destined to go to AP to run a Telugu lit- erary general కూడ అని కూడ అంటుండేవారు. జడ్చర్ల కాలేజ్ ఇంటర్వ్యూ వచ్చినపుడు ఢిల్లీలో రాజీనామా చేసిగానీ (జడ్చర్లలో ఉద్యోగం రాకున్నా తిరిగి ఢిల్లీకి రాకుండా ఉండడానికి) వెళ్లాదని మళ్లా అదేమాట అంటూ ట్రెయిన్ ఎక్కించాడు. ఒకరి ద్దరు, ముగ్గురు వ్యక్తులతో ప్రారంభమైన నా పాలమూరు అనుబంధం – నాకు జడ్చర్లను ప్రేమనగర్ వరంగల్ కన్నా ముందు తొలి ప్రేమానుబంధం చేసింది. జడ్చర్ల కేంద్రంగా పాలెం, గద్వాల, మహబూబ్ nagar, వనపర్తి తీర్థయాత్రా స్థలాలయ్యాయి. అనుకున్నట్లుగానే ఢిల్లీనుంచి మొదటి అవకాశమే తీసుకొని నరహరి జడ్చర్లకు వచ్చి నన్ను వనపర్తి మీదుగా తమ ఊరికి తీసుకుపోయాడు.
1965 ఆగస్టు తర్వాత రోజులు. సరిగ్గా ఆయన ఢిల్లీలో ఎంతో వివరణాత్మకంగా వర్ణించి నట్లుగానే ఉంది దృశ్యం. గుడిముందో, సినిమా హాల్ ముందో, కల్లుదుకాణం ముందో, పోలింగ్ బూత్ ముందో ఉన్నంత తొడతొక్కిడిగా ఉన్నారు. జనం – డాక్టర్ బాలకృష్ణయ్య ఉచితవైద్యశాల ముందు. అందరికందరూ నిరుపేదలు, కరువు జిల్లా పాలమూరులో నిరుపేదల రూపురేఖలు నేను వర్ణించనక్కర్లేదు కదా! వాళ్లందరినీ దాటుకొని లోపలికి తీసుకువెళ్లి డాక్టరుగారికి పరిచయం చేశాడు. నల్లటి స్థూలకాయం మొహం మీద అమ్మోరి మచ్చలు, టకప్ చేసుకున్నాడు. కాని ఎంతో ఆత్మీయుతతో చిరకాల పరిచయం ఉన్నట్లుగా పలకరించాడు. అంతే ఇంక మా పరస్పర పరిచయానికి నరహరి నిమిత్తమాత్రుడే. ఆ తర్వాత మా మధ్య కొనసాగిందంతా సాహిత్య, రాజకీయ ఏకాభిప్రాయ అభిరుచి స్నేహం.
ఒక ఆదర్శవాద డాక్టరుగా చూడాలనుకున్నా డాక్టరు ప్రగతిశీల భావజాలానికి కూడా చెందిన వాడు కావడంతో మాకు స్నేహం పెరిగింది. అయితే 1968లో నేను జడ్చర్ల వదిలేనాటికి కూడ నాకే స్పష్టంగా విప్లవ రాజకీయాలు అబ్బలేదు గనుక అప్పటికి మా కలయికలూ తక్కువే. మా అనుబంధమల్లా 1966 లోనే ‘సాహితీమిత్రులు’ ప్రారంభించిన సృజనకు 67 ఫిబ్రవరి నుంచి జడ్చర్ల కేంద్రమైంది. డాక్టర్ బాలకృష్ణయ్యతోనే కాక తెలుగు సాహిత్యాభిమానులందరితోనూ నా సంభాషణ సృజనద్వారానే, ఆ జిల్లానుంచి వచ్చినందువల్లనో, ఆ జిల్లాలో కూడ 1966లో అంతర్జా తీయంగా చైనా శ్రామికవర్గ సాంస్కృతిక విప్లవం, దేశంలో 67లో తొమ్మిది రాష్ట్రాల్లో తొలిసారిగా కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పడడం, 67లో నక్సల్బరీ, కొంచెం ముందుగా 66లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఉద్యమం అన్నింట్లో ప్రతిఫలించిన మిలిటెన్సీ, దీనికి అద్దం పట్టిన సృజనతో ఈ ‘రక్తచలనసంగీతశ్రుతి’ వినిపించడం జిల్లాలో యువతరం మీద, మార్పు కోరే వాళ్లమీద సృజన ప్రభావం చాలా ఉండేది.
అయితే డాక్టర్ బాలకృష్ణయ్యగారితో నేను నిర్మాణపరమైన సంబంధాల్లోకి రావడం 70లో విరసంలో ఏర్పడినాకనే. అప్పటికే నేను వరంగల్ కు మారిపోయాను. ఆయన విరసం అభిమానిగా హైదరాబాదులో కలుస్తుండేవాడు. ఆయన అసుపత్రిలో పనిచేసే కిట్టు విరసం సభ్యుడయ్యాడు. ఇంకెందరో ఆయన చుట్టూ ఉండే యువకులు, విద్యార్థులు విరసం సభ్యులకన్నా ఎక్కువగా విరసం అనుయాయులుగా ఉండేవాళ్లు.
1972 ఏప్రిల్ 17న జార్జ్ రెడ్డిహత్య, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం గుంటూరులో ఏర్పడడంతో ఇద్దరమూ ఆ నిర్మాణంలోకి కూడ వచ్చాము. 73లో అనుకుంటాను ఒంగోలులో భారత చైనా మిత్రమండలి ఏర్పడింది. దానికి కెవిఆర్ ప్రధాన కార్యదర్శి, కాశీపతి సహ కార్యదర్శి. కార్యవర్గంలో నేనూ, డాక్టర్ బాలకృష్ణయ్య కూడ ఉన్నాము (ఇతరులతో పాటు), అయితే 74 మేలోనే కెవిఆర్ తో పాటు విప్లవ రచయితలం ఆరుగురం సికిందరాబాదు కుట్ర కేసులో అరెస్టుకావడం, అందులో బెయిలు వచ్చిన నెలరోజులకే నేను మళ్లీ ఎమర్జెన్సీలో అరెస్టు కావడంతో భారత్ చైనా మిత్రమండలి కార్యకలాపాల్లో మేం కలిసి పాల్గొనే అవకాశాలు చాల తక్కువ వచ్చాయి. 1973లో శ్రామికవర్గ సాంస్కృతిక విప్లవం కుడి పెడధోరణికి మళ్లీ జెంగ్ ప్రాబల్యం పెరిగి 76 సెప్టెంబర్ 9న మావో మరణంతో నాకు చైనాపట్ల ఆసక్తిపోయింది. ఎమర్జెన్సీ ఎత్తివేసి జెయిలునుంచి బయటికి వచ్చాక 77 మార్చ్ నుంచి నేనింక భారత చైనా మిత్రమండలి కార్యకలాపాల్లో పాల్గొనలేదు. డాక్టరుగారు బహుశా అందులోనే కేంద్రీకరించారనుకుంటాను. గంజి రామారావుగారితో పాటు ఆయన కూడ చైనాకు వెళ్లి వచ్చినట్లు విన్నాను, గంజి రామారావుగారు ఏప్రిల్లో ఇంద్రవెల్లి విషాదం తర్వాత అక్కడ అమరులైన ఆదివాసుల స్మృతిలో స్థూపం నిర్మించడానికి ఇంద్రవెల్లిలో తన పేర స్థలం కొని తీన్మీన్ స్క్వేర్లో స్మారకం వంటివి కట్టాలనే సంకల్పంతో చైనా వెళ్లారు. 83లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టాక డాక్టరు బాలకృష్ణయ్యగారు అందులో చేరారని విన్నాను. ఆ తర్వాత కలిసింది తక్కువే..
డాక్టర్ బాలకృష్ణయ్య అనుబంధంలో రెండు సందర్భాలు చాల జ్ఞాపకం పెట్టుకోదగినవి. ఆయన బహుశా వనపర్తిలో పంచాయితీ బోర్డు. ఉన్నంతకాలం దాని అధ్యక్షుడు, అది మునిసిపాలిటీగా మారాక దాని చైర్మన్ అనుకుంటాను. అయితే గ్రామ పంచాయితీ అధ్యక్షుడుగా ఆయన ఏటా ఒకసారి గ్రామసభ నిర్వహించేవారు. విరసం ఏర్పడినాక, బహుశా ఎమర్జెన్సీ కన్నా ముందు అటువంటి ఒక గ్రామసభలో నేను పాల్గొన్నాను. 15.4.74 అనుకుంటాను. శ్రీశ్రీ, జ్వాల, నిఖల్, చెర, కాశీపతి కూడ వచ్చారు. దినమంతా కార్యక్రమాలే. సాయంత్రం బహిరంగసభ. కవిసభ. వేలాదిమంది వచ్చారు. ఆ సభలో చౌడూరి గోపాలరావు అనే కవి (ఆ తర్వాత విశ్వహిందూ పరిషత్ క్రియాశీల కార్యకర్త అయ్యాడు) విరసం మీద ఒక తిట్లదండకం చదివాడు. ఆ తర్వాత కాలంలో అది ‘భారతి’లో కూడ అచ్చయింది. మంచి ఆజానుబాహుడు, స్ఫురద్రూపి, గంభీరమైన కంఠం. ఆయనకు దీటు జ్వాలాముఖి మాత్రమే. ఆ కవితాపఠనం కాగానే జ్వాలాముఖి ప్రసంగం. ఇప్పటికీ అది నా చెవుల్లో మార్మోగుతున్నది. చౌడూరి గోపాలరావు ప్రతి చరణానికే కాదు, ప్రతి శబ్దానికి ఎంతో హేతుబద్ధమైన, గతితార్కికమైన సమాధానం సభ ఆయన మేఘగర్జనవంటి ప్రసంగంతో వేలాది చప్పట్ల వడగళ్లవానవలె ముగిసింది. చౌడూరి గోపాలరావు కోసం మైకులో ప్రకటించినా ఆ రాత్రి విందుభోజనానికి కరువయ్యాడు. ఆ సభకు అధ్యక్షుడు డాక్టరు బాలకృష్ణయ్య. ఆయనకు చౌడూరి పట్ల ఎటువంటి వైమనస్యమూ లేదు. ఉంటే వేదికమీదికి ఆహ్వానించేవాడే కాదు. లేశ మాత్రం ఆయన దృక్పథంతో అంగీకారమూ లేదు. జ్వాలాముఖి ప్రసంగానికి ఆయన పరవశుడ య్యాడు.
1979లో అనుకుంటాను శ్రీశ్రీ ‘ఖడ్గసృష్టి’ కవితాసంకలనానికి కేంద్రసాహిత్య అకాడమీ బహుమతి ప్రకటించింది. అప్పుడు దాని విలువ పదివేలే. శ్రీశ్రీ ఆ అవార్డు తీసుకోవద్దన్నది విరసం నిర్ణయం. ఆకాంక్ష, కాని ఆ సమయానికి మద్రాసులో శ్రీశ్రీ ఇల్లు మార్వాడీకి కుదువపడి వేలానికి వచ్చింది. 35వేల రూపాయలు కడితేగానీ తాకట్టు నుంచి విముక్తి కాదు. ఈ విషయాలు పత్రికల్లో చదువుకున్న డాక్టరు బాలకృష్ణయ్య పత్తిపాటిని కదిలించి నిధి పోగుచేసి కృష్ణదేవరాయాంధ్ర భాషానిలయంలో సభ నిర్వహించి శ్రీశ్రీకి 10వేలు, వనపర్తి సభలో పాతికవేల పర్సు బహూకరించారు. శ్రీశ్రీ అన్నా, ఆ మార్గమన్నా ఆయనకంత అభిమానం,
1980ల తొలి సంవత్సరాల్లో ఒకప్పుడు PDSU కొంచెం పట్టుగా ఉన్న వనపర్తిలో రాడికల్ విద్యార్థి సంఘం జిల్లా సభ జరిగింది. అప్పటికే గద్వాల కేంద్రంగా అమరులు సుదర్శనరెడ్డి, సుగుణ మొదలైనవారు క్రియాశీలకంగా విప్లవ రాజకీయాల్లో పనిచేస్తున్నారు. డాక్టర్ బాలకృష్ణయ్య గారి ఇంటి ఆవరణలోనే సాయంత్రం బహిరంగ సభ జరిగింది. ఉదయమంతా దగ్గర్లోనే ప్రతినిధుల సభ జరిగింది. ఆ రోజంతా వనపర్తిలో ఉండి అక్కడినుంచి కొల్లాపూర్ వెళ్లాను. నాకు జ్ఞాపకమున్నంతవరకు వనపర్తికి వెళ్లడమైనా, డాక్టరు బాలకృష్ణయ్యగారిని కలవడమైనా అదే ఆఖరు.
ఆ తర్వాత 1983లో ఆయన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో చేరాడని, ఎం.ఎల్.ఏగా అయ్యాడని విన్నాను. ఎప్పుడైనా ఆయన గురించి వినడమో, ఇద్దరమూ తెలిసిన వారిముందు ప్రస్తావన రావడమో తప్ప ఆయన మరణించిన వార్త కూడ వార్తగానే విన్నాను.
అందుకనే నా మనసులో 1965లో తొలిసారి చూసిన డాక్టరు బాలకృష్ణయ్యగారు, మళ్లీ గ్రామ సభలో చూసిన డాక్టర్ బాలకృష్ణయ్యగారు, ప్రజల వైద్యుడుగా, ప్రజల నాయకుడుగా చిరునవ్వు నవ్వుతూ నిలిచిపోయాడు.