మైనారిటీలకు ఆత్మబంధువు

మా నాన్నగారికి కంట్రోలు బట్టల షాపు ఉండేది. ప్రత్యేకంగా షేర్వాణి, సూట్లు కుట్టేవారు. అందరూ బాషుమియ్య అని పిలిచేవారు. అసలు పేరు మహబూబ్ ఖాన్. డాక్టర్ సాబ్ సర్పంచ్ గా ఉండి మా నాన్న కౌన్సిలర్ గా ఉన్నారు.

డాక్టర్ సాబ్ దవాఖాన పాతభవనంలో ఉండేది పంకాలేని కన్సల్టేషన్ రూం. ఎప్పుడూ రోగులతో నిండి ఉండేది. మెడికల్ రిప్రజెంటేటివ్ లు ఇచ్చే మందులు ఎప్పటికప్పుడు రోగులకే పంచేవారు.

ఎవ్వరైనా దయతలచి ఇచ్చే ఫీజుతో జీవితం గడిచేది. ఇలా జీవితం సాగడంలోని కష్టం అనుభవిస్తే తెలుస్తుంది. ఈ వనపర్తి వాడెవ్వడైనా బ్రతికారంటే డాక్టర్ సాబ్ చేతి చలవతోనే అనటం నిజం.

మందులెన్ని మార్చి రాసినా మానని రోగాలు ఇప్పుడున్నవి. శాంపుల్ మందుల్ని అమ్మి, కన్సల్టేషను కమీషన్లు ఖరారు చేసుకుంటున్నారు. దేన్నుంచైనా డబ్బులు పిండటమే తప్ప మరొహటి లేని కాలం మనది.

డాక్టర్ సాబ్ దగ్గర మొదటి కంపౌండర్ జవాబ్ సత్తార్ సాహెబ్. రోజువారీ అవసరాలకు ఆదుకునే కాంపౌండర్లు రాము మరియు శ్యాం. ఎల్లవేళలా దేవుని గుడిదగ్గర భక్తుల మాదిరి పనిచేసేవాళ్లు. చేయి పట్టుకుని నాడి చూసి మొహంమీద రంగుల్ని గమనించి వైద్యం చేసేవారు. తన గురువు గారైన డాక్టర్ మన్నన్ ముందు అతను నిలబడే ఆతీరు ఇప్పటికీ జ్ఞాపకం వస్తుంది. నిజంగా ఇతను వనపర్తి డాక్టర్ సాబేయేనా అనిపించేది. ఎంత వినయం? చేతులు కట్టుకుని నిల్చొని సంభాషించే బీమారిలెన్ని ఉన్నా, ఎవ్వరి విషయంలోనైనా ఒకటే శ్రద్ధ. ప్రజల్ని వాళ్ల కష్టాల్లో అదుకోవటం గొప్ప అనుకునేవారు.

మనిషికి రోగం నయం చేయటానికి ఏ మందు గుణం చేస్తుందో తెలిసి వైద్యం చేసేవారు. అల్సరుక్కూడా సాధారణమైన మందుల్తో వైద్యం నడిచేది. రోగికి ధైర్యం చెప్పి నేనున్నాను అనే భరోసా ఇచ్చేవారు.

నిజంగా మన కుటుంబాల్లోని అన్నలెవ్వరూ ఇవ్వని ఆదరణ ఆయననుంచి లభించేది. ఈ ఊళ్లో కష్టాల్లో ఉన్నవాళ్లందరికీ, రోగాల్తో వచ్చే వాళ్లకు అన్న డాక్టర్ సాబ్ తనకంటే వయసులో పెద్దవాళ్లక్కూడా తానే రక్షకుడు.

ఎవ్వరి సంగతో ఎందుకు? మా ఇంటి విషయం చెప్తాను. మా తమ్మునికి ఉస్మానియా మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది. ఆ విషయం చెప్పడానికి ఇంటికి వెళ్లాం. ఆనందంతో తాను ఉబ్బి, తబ్బిబ్బైపోవడం కాక, అప్పటికప్పుడు మాకు ‘ఖీర్’ పాయసం తినిపించి మీ ఇంట్లో ఎన్ని ఇబ్బందులున్నా మీ తమ్ముని తప్పక చదివించమన్నారు. ఎవ్వరి ఇంటి విషయమైనా తన ఇంటి విషయంగా భావించేవారు.

ఆఫీసుల్లోనే కాదు, ఊర్లో మరెక్కడైనా డాక్టర్ సాబ్ మనుషులకు ఉండే గౌరవం, మర్యాద, భయంతో కూడినవి కావు, ప్రేమతో నిండినవి.

డాక్టర్ సాబ్ కంపౌండర్ రాములన్న అంతిమ యాత్ర చూసి ఆశ్చర్యపోయినవాళ్లున్నారు. ఒక డాక్టర్ దగ్గర పనిచేసే కంపౌండర్ పట్ల ప్రజలు చూపిన అభిమానం మరువలేనిది. ఎంత ధనం

ఉన్నా, మరెంత అధికారం ఉన్నా ఈనాడు అంతటి ఆదరణ సాధ్యమా అని ఎవరికివాళ్లు ప్రశ్నించుకోవాలి.

ధనం ఉన్నవాళ్లకన్నా, అధికారం ఉండేవాళ్లకన్నా కష్టపడి పనిచేసేవాళ్లను డాక్టర్ సాబ్ గౌరవించేవారు. తాను సర్పంచ్ గా ఉన్న 20 ఏళ్ల కాలంలో అన్ని వృత్తులవాళ్లకీ కౌన్సిల్లో సమాన ప్రాతినిధ్యం వహించేలా అవకాశం కల్పించారు.

రంజాన్, బక్రీద్లకు ప్రార్థనలకు వెళ్లిన ముసల్మాను సోదరులు, ఈద్గానుండి వచ్చేదారిలో ఉన్న డాక్టర్ గారిని ఇంటిదగ్గరే కలిసి తమ ఆనందాన్ని పంచుకునేవారు. ఎంత పేద ముసల్మాను ఇంట్లో పెళ్లికైనా డాక్టర్ సాబ్ తప్పక వచ్చేవారు. ఆయన కారే పెళ్లివాళ్లకు ఉపయోగపడేది.

వనపర్తి పట్టణంలో లౌకిక భావనకు ఆయన ఒక ప్రతీక! మైనారిటీలను, అల్పసంఖ్యాకులను చులకనగా చూడటం డాక్టర్ సాబ్ కాలంలో లేదు. ప్రజల మధ్య ఐక్యతయే వాళ్లకు రక్ష అనుకున్నారు. ఇక్కడ నెలకొన్న శాంతియుత సహజీవనానికి ప్రజా జీవితంలో డాక్టర్ సాబ్ ఎంపిక చేసిన వ్యక్తులే కారణం. వాళ్లు శాంతిసంఘం సభ్యులు కారు. పట్టణంలో శాంతిని కాపాడిన సైనికులు వీళ్లే! ప్రేమగా పలకరించుకోవటం, ఆప్యాయతగా ఉండటం, కలసి బ్రతకటంలోనే సుఖసంతోషాలు ఉన్నాయన్న సత్యం సజీవంగా ఉండటానికి డాక్టర్ సాబ్ పరోక్షంగా కారణం.

కులం, మతం ఈనాడు రాజకీయాలకు పెట్టుబడి. ఆనాడు ప్రజల బాగోగులు మరీ ముఖ్యంగా మనుషులనే భావనయే ఉండేది. ఇక్కడి ముసల్మాను సోదరులు, బలహీన వర్గాలవారు ఒక్కరే మిటి అన్ని వర్గాల ప్రజలు డాక్టర్ సాబ్ వెంట నడిచారు.

ఉర్దూ భాషాభివృద్ధికి డా. బాలకృష్ణయ్య చాలా స్పష్టమైన అవగాహనతో తెలుగువాడ పాఠశాలలో తరగతులు ప్రారంభించారు. ఆనాడు. తెలుగువాడ పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా కె. కృష్ణయ్యగారు ఉండేవారు. నాడు ప్రారంభించిన అంజుమన్ తరఖీ సంస్థకు డా. బాలకృష్ణయ్యగారే అధ్యక్షులు.

చిన్న మొలకగా ప్రారంభమైన ఉర్దూ విద్యాభివృద్ది ఈనాడు జూనియర్ కళాశాల వరకు ఎదగడానికి కారణం అయ్యింది.

ఉర్దూభాష మైనారిటీలదో, మరో మతస్తులదో కాదని దాన్ని లష్కరీ భాషగా భావించేవారు. లష్కరీ అంటే సిపాయిల భాష ప్రజల జీవితంలో భాగమైన భాష ఏనాటికి మరణించదు