వనపర్తి ప్రజల సత్కారం నోబెల్ మించిన పురస్కారం

తెలుగు భాషకు రావలసినంత గౌరవం దక్కలేదంటే అది మన లోపమే. మన గురించి మనం చెప్పుకోకపోవడం ఇందుకు కారణం. అత్యధిక సంఖ్యాకులు మాట్లాడే భాషగా ఉండి కూడా తెలుగుకు రెండవ స్థానం కూడా రాలేదు. హిందీ మైనారిటీ మైనారిటీ భాష అయినప్పటికీ రాజకీయ కారణాల వల్ల అది జాతీయ భాష అయింది. ఆ హిందీలో ఉర్దూ, పారశీకం వంటి ఇతర భాషలు కొన్ని కలిసి అది అత్యధిక సంఖ్యాకులు మాట్లాడే భాషగా చెలామణి అవుతున్నది. ప్రపంచంలో తెలుగువారికి ఒక జాతిగా అద్భుతమైన స్థానం ఉంది. భారతదేశంలోనే గాక ప్రపంచంలోని ఏ దేశస్తుల ముందు కూడా మన తెలుగువాళ్లం ఎవరికీ తీసిపోము. తెలుగువారు పూర్వం సముద్ర ప్రయాణం చేసి జావా, సుమత్ర వంటి దేశాలు తిరిగి వర్తకం చేశారు. కొచ్చిన్ వంటి ప్రాంతాలలో పాత నాణేలపై తెలుగుభాష లిపి కనిపిస్తుంది.

ఇంతవరకు నా జీవితకాలంలో నాకు ఎన్నో సన్మానాలు జరిగాయి కానీ ఇంత గొప్ప సన్మానం ఎప్పుడూ ఎక్కడా జరగలేదు. ఈ సన్మానాన్ని నేను జ్ఞానపీఠ బహుమతి కంటే, నోబెల్ బహుమతి కంటే గొప్పగా భావిస్తున్నాను. ఆ మాటకొస్తే అలనాడు అల్లసాని పెద్దనకు జరిగిన సన్మానం కంటే కూడా దీనిని గొప్ప సన్మానంగా భావిస్తున్నాను. జ్ఞానపీఠం ఒక ప్రభుత్వం ఇచ్చేది. నోబెల్ ఒక వ్యక్తి ఇచ్చేది. అల్లసానికి ఒక రాజు సన్మానం చేశాడు. కానీ నాకు నా ప్రజలు సన్మానం చేస్తున్నారు కనుక దీనిని అన్నింటికంటే గొప్పగా భావిస్తున్నాను.
“ఈ సన్మానాన్ని నేను జ్ఞానపీఠ బహుమతి కంటే, నోబెల్ బహుమతి కంటే గొప్పగా భావిస్తున్నాను.”
నోబెల్ వంటి బహుమతి ఇక కవిత్వాలు రాయడం చాలించు అని చెప్పడానికి ఇచ్చేవి. కానీ ఈ సన్మానం కవితా రచనలు ఇంకా కొనసాగించమని చెప్పేవి. ఈ స్ఫూర్తితో ముందు ముందు విప్లవ కవిత్వం కంటే ఇంకా గొప్పదైంది వస్తే దీనిని వదులుకొని ఆ మార్గాన్ని చేపడతాను. కానీ విప్లవ కవిత్వాన్ని వదిలి ఎప్పుడూ తిరోగమించను.

(వనపర్తి సన్మాన సభలో శ్రీశ్రీ ప్రసంగంలోని కొన్ని భాగాలు)