ఆయన్ని స్మరించుకుంటూ అంతర్మధనం చేసుకుంటున్నాను

అవి నేను హైదరాబాదులో గోషామహల్ పాఠశాలలో చదువుతున్న రోజులు. అప్పుడే గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగి డాక్టర్ సాబ్ సర్పంచ్ ఎన్నిక కాబడిన వార్త నాకు పోస్టుకార్డు ద్వారా వచ్చింది. ఇంగ్లీష్ భాషలో వారిని అభినందిస్తూ లేఖ వ్రాయడం జరిగింది. ఈ విధంగా నాకు ఊహ తెలిసిన పిదప డాక్టర్ సాబ్ తో నా అనుబంధానికి నాంది పడింది. అంతకుముందు మరీ చిన్నవాడిగా ఉన్నప్పుడు వారివద్ద వైద్యానికి వెళ్లిన విషయం నాకు గుర్తుంది. ఆ పిదప వనపర్తికి తిరిగి వచ్చి ఉన్నత పాఠశాలలో చదువు కొనసాగించడానికి వచ్చి ఉన్నప్పటికీ, వారివద్దకు వెళ్లాలంటే ఎంతో బిడియ పడేవాడిని. కానీ విధి విచిత్రం ఏమిటంటే, నేను వనపర్తి శ్రీ కృష్ణదేవరాయ పాలిటెక్నిక్ ఎల్.ఎం.ఇ. మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు, వార్షిక పరీక్షలకు ముందు అనారోగ్యానికి గురికావడం జరిగింది. ముందు టైఫాయిడ్ అనుకుంటూ, జబ్బు తగ్గకపోవటంతో డాక్టర్ నాబ్ నాకు వచ్చిన జబ్బుపై దాదాపు పరిశోధన చేసినంత పని చేశారు. ఆ జబ్బు “Tuberculous meningitis” కావచ్చునని నిర్ధారణకు రావడం జరిగి, ఖచ్చితంగా అదే జబ్బు అని నిర్ధారించిన తర్వాత, చికిత్స ప్రారంభించే ముందు వారు తమ గురువర్యులైన డా. ఎస్.ఏ. మన్నామ్గారి వద్దకు నన్ను తీసుకువెళ్లారు. వారి ఆధ్వర్యంలో నాకు “Lumbosacral puncture” నిర్వహించి, “Pathological Laboratory” లో విశ్లేషణ జరిపి, నా వ్యాధి “Tuberculous meningitis” అని డయాగ్నోసిస్ చేయడం జరిగింది. ఈ విధంగా డాక్టర్ నాబ్ అనుమానం నిజమైంది. ఇది వారి ప్రతిభకు మచ్చుతునక. ఆ తర్వాత వారు దాదాపు ప్రతిరోజు నన్ను పరీక్షించి, నా ఆరోగ్యం గురించి విచారించేవారు. ఈ సమయంలో వారిని అతి దగ్గరగా గమనించటం జరిగింది. వారితో మాట్లాడేటప్పుడు నేను నన్ను మరచిపోయేవాడిని. పసిపిల్లవాడిలాంటి మనస్తత్వం, బోళాతనం, సామాజిక స్పృహ, బీద మరియు బడుగువర్గాల సంక్షేమం పట్ల వారికిగల తపన నన్ను వారి అభిమానిగా మార్చటం జరిగింది. అదే సమయం వనపర్తిలో పెనుతుఫాను సంభవించి, జనజీవనం అతలాకుతలం కాగా, ఆ సమయంలో పట్టణంలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకై వారు చేసిన సేవ అనితర సాధ్యము, వారి నాయకత్వ ప్రతిభ స్ఫూర్తిదాయకం.

నా ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత అనుకోకుండా రెవెన్యూ శాఖలో ఉద్యోగం రావడం, వనపర్తి తహశీల్దార్ కార్యాలయంలో పోస్టింగ్ రావడం జరిగింది. ఈ కార్యాలయంలోనే దాదాపు రెండు దశాబ్దాలు పనిచేయడం జరిగింది. ఈ ఇరవై సంవత్సరాల కాలంలో వారికి అతిచేరువై, సన్నిహితుడుగా మెలగడం నా అదృష్టం. దాదాపు ఈ సమయంలో విరసం, ఆవిరాభవం, జ్వాలాముఖి, విఖిలేశ్వర్, చెరబండరాజు మొదలగు వారితో కవితా గోష్టులు నిర్వహించటం జరిగింది. డాక్టర్ సాబ్ హైదరాబాద్ వెళ్లిన ప్రతిసారీ నవయుగ బుక్ హౌస్, విశాలాంధ్ర ప్రచురణలు, స్టాల్స్‌ను సందర్శించి విపరీతంగా పుస్తకాలు కొనేవారు. ఈ కాలంలోనే వారి ఆధ్వర్యంలో మహాకవి శ్రీశ్రీగారికి ఘనసన్మానం జరిపి 25 వేల నగదు సహాయనిధి ఇవ్వడం, శ్రీశ్రీగారి నోటనే వారు “భూమికోసం” సినిమాకై వ్రాసిన “ఎవరో వస్తారని, ఏదో చేస్తారని” విన్నాము. భారత్-చైనా మిత్రమండలి సభ్యుడిగా వారి చైనా పర్యటన అనుభవాలు వారికి మరపురాని మధురస్మృతులు. 1983 తర్వాత ఉద్యోగరీత్యా నేను వనపర్తి వదిలి వెళ్లిన తర్వాత వారిని చాలా కొద్దిసార్లు మాత్రమే కలవటం జరిగింది. చివరిసారిగా స్టేట్ మైనారిటీ కమీషన్ రాక సందర్భంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉన్నప్పుడు వారు ఇక లేరన్న పిడుగులాంటి వార్త తెలిసి వెంటనే వారి అంతిమ దర్శనానికై హుటాహుటిన చిట్యాల వెళ్లి, చివరిసారిగా పాదాభివందనం చేయడం జరిగింది.