పాలమూరు మానవతా మట్టి శిఖరం

75శాతం నిరక్షరాస్యుల మీద
25శాతం అక్షరాస్యులు, 90శాతం
దరిద్రుల మీద 10శాతం
ధనవంతులు పరిపాలన సాగిస్తున్న
వ్యవస్థ మనది. ఇదే ప్రజాస్వామ్యం
అనుకోవడమంత సిగ్గుచేటు
ఇంకోటి ఉండదు. ఈ వ్యవస్థను
మార్చాలని ఉద్ఘోషించడంకన్నా
ఇంకో ఉత్కృష్టధర్మం ఏ
సాహిత్యకారుడికైనా ఎలా
ఉంటుందో నేనూహించలేను. మరి
ఈ వ్యవస్థకి రకరకాలుగా కొమ్ము కాచే రాతగాళ్లంతా
నా దృష్టిలో ప్రజాద్రోహులే.

శ్రీశ్రీ

అవును ప్రజాద్రోహుల నుంచే ప్రజా రాజ కీయం సాహిత్య వైద్య రత్నాకరులను చరిత్ర పొడుగునా వారి పాదముద్రల్లో వెతుక్కోవాలి. తల్లి పాలమూరు మానవతా మట్టి శిఖరం మీద, పీడిత జన యుద్ధశిబిరం మీద, అగ్ని సముద్రం ఒక్కటై నడిచిన రెండు పాదముద్రల స్పర్శ నా మనోనేత్రాల్ని విచ్చుకునేట్టు చేసింది. ఆ పాదధూళి స్పర్శసాక్షిగా మరోసారి మననం చేసుకుంటూ… స్మరించుకుంటూ…. ఎందరో జన్మిస్తారు… మరెందరో మరణిస్తారు. మరణానంతరం కొందరే జీవిస్తారు. వారే మహనీయులు మహాత్ములు… చిరస్మరణీయులు. ప్రజల కడగండ్లు తీర్చడానికి, బడుగు ప్రజ లకు ఏదో చేయాలన్న దృఢసంకల్పానికి, మేధో యజ్ఞాన్ని తలపెట్టిన ధన్యజీవి.

పరాయిపాలనలో వనపర్తి పట్టణంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన స్వాతంత్ర్య యుద్ధభేరి మ్రోగించిన వీరుడు డా॥ బాలకృష్ణయ్య. ఏకలవ్యుడిలా మొక్కవోని వజ్రసంకల్పంతో,ఆహోరాత్రులు శ్రమించి గమ్యాన్ని చేరుకోవాలనే లక్ష్యంతో, వైద్య విద్య నభ్యసిస్తున్న కాలంలోనే, ప్రజాసేవ ప్రారంభించిన ప్రజా డాక్టర్ ఆయన. యువతీ యువకులకొక లక్ష్యం, ఆదర్శం ఉండాలన్న తలంపుతో ఆ రోజుల్లోనే వయోజన రాత్రి పాఠశాలకు ప్రాణం పోశాడు.

ఆనాటి రాజుల సంస్కృతికి, దొరల అహంకార రాజకీయానికి ఎదురొడ్డి నిలిచిన తిరుగులేని మనిషి ప్రజల రాజకీయాలకు ప్రాణప్రతిష్ఠ చేసి, మూడు దశాబ్దాలు పట్టణ ప్రథమపౌరుడిగా నూతన విలువల్ని భావితరాలకు అందించిన గాడ్పాదర్.

రాజకీయాలేకాదు సాహిత్య కళారూపాలు ఏవైనా ప్రజల పక్షం ఉండాలన్న సాహిత్య పిపాసి, వనపర్తిలో సాహితీసమితి, సాహిత్యవేదికకు మణి దీపంలా వెలుగుల్ని వెదజల్లుతూ, ఎందరో కళా కారులను కవులను సన్మానాలతో సత్కరించి సాహిత్య చరిత్రలో నిలిచాడు. ఆర్థిక పద్మవ్యూహం లో చిక్కిన మహాకవి శ్రీశ్రీ ఇల్లు వేలం అన్న వార్తకు తల్లడిల్లి తాను స్వయంగా జోలె పట్టుకొని, పాతికవేలు పోగుచేసి ప్రజాకవిని ఆదుకుని ప్రజాసాహిత్య చరిత్రలో చెరగని సంతకం చేశాడు.

వనపర్తి నియోజకవర్గంలోని మండలాల్లో జానియర్ కళాశాలలు, గ్రామగ్రామానా పాఠశాలలు, వైద్యం, మంచినీరు కల్పించినవాడు.

పల్లె తన గుండె అంటూ, “ఆకలికి మాత్ర విప్లవం. దారిద్ర్యానికి టానిక్ తిరుగుబాటు. ఈ రెండు తెలుసుకుంటేనే ఈ వ్యవస్థకు వైద్యుడు “లేదా రోగగ్రస్తుడు” అన్న సత్యాన్ని ఆచరించిన మహాశయుడు డాక్టర్ బాలకృష్ణయ్య.

నాలుగు దశాబ్దాల జిల్లా రాజకీయాల్లో ముడి వడి ఉన్నదే ఆయన జీవితం.

ప్రజలే తన శ్వాసగా భావించి, మంచితనం మానవత్వం ఈ భూమ్మీద స్థిరంగా ఉండాలని ఆశించిన ఆశాజీవి డాక్టర్ బాలకృష్ణయ్య.