You are currently viewing ప్రజల డాక్టరు బాలకృష్ణయ్య

ప్రజల డాక్టరు బాలకృష్ణయ్య

ప్రజల డాక్టరు బాలకృష్ణయ్య

జ్ఞాపకం వుంచుకోవాల్సిన మనిషి జ్ఞాపకం వుండిపోయే మనిషి డాక్టరు బాలకృష్ణయ్యగారు. జ్ఞాపకాలు రకరకాలుగా వుంటాయి. కొన్ని జ్ఞాపకాలు నిన్ను వెంటాడుతాయి. నిన్ను కదిలిస్తాయి. కదులుతాయి. నిన్నో ఆర్ద్రజీవిగా జనంమధ్య నిలుపుతాయి, నీ సర్వాంగాలను స్పృశించి నిన్నో మనిషిగ నిలబెడతాయి. డాక్టరు గారిని గురించిన జ్ఞాపకాలు అలాంటివి. ఒక ఫ్యూడల్ సంస్థానంలో ప్రజాస్వామిక విలువలకోసం పరితపించిన పరిశ్రమించిన ప్రజల మనిషి డాక్టరుగారు. డాక్టరు గారిని జ్ఞాపకం చేసుకోవడమంటే ఓ యాభయ్యేళ్ల కరువు పాలమూరును జ్ఞాపకం చేసుకోవడం. కన్నీళ్ళ పాలమూరును జ్ఞాపకం చేసుకోవడం, కన్నీళ్లను తుఫానుగా మార్చ నడుంకట్టిన శక్తులను జ్ఞాపకం చేసుకోవడం.

వెనక్కి వెళ్లి పాలమూరును జ్ఞాపకం చేసుకుంటే ముగ్గురు వ్యక్తులు నాకళ్లముందు కదులుతున్నారు. నాగర్ కర్నూల్ లో మహేంద్రనాథ్ గారు, పాలెంలో సుబ్బయ్యగారు వనపర్తిలో డాక్టరుగారు. ఆప్రాంతాల పేర్లు తడిమితే వీళ్ల జ్ఞాపకం వస్తారు. సీదాసాదా జీవితంతో జనాలకు అందుబాటులో వున్నవారు మహేంద్రనాథ్. తర్వాత్తర్వాత ఆయన రాజకీయాలేమైనాగాని, ఆతర్వాత సుబ్బయ్య గారు, పాలెం నాగర్ కర్నూల్ కి నాలుగైదు మైళ్ళ దూరం. బస్సుకూడా నిలబెట్టేవారోకాదో, విద్యాలయాలు స్థాపించి పేద మధ్యతరగతి జనాలకు విద్యాగంధాన్ని రాసింది సుబ్బయగారు.

లింగాలలో వుద్యోగం. ఆదివాసీ జనాల పరిచయాలు. ఆదివాసీ బిడ్డలకు పాఠాలు చెప్పే అనకాశాలు అడవీ చెంచులు అలాఅలా మార్క్సిజాన్ని అన్వయించుకొనే అవకాశాన్నిచ్చి నన్నో మనిషిగా ప్రజల మధ్య నిలిపింది లింగాల, నా విద్యార్థులు ఆదర్శ విద్యార్థులుగా వుంటూ తమని తాము మార్చుకుంటూ, పరిసరాలను మార్చు తున్న తరుణంలో రాడికల్ విద్యార్థులుగా ఓనమాలు దిద్దుకుంటున్న తరుణంలో మా సహాధ్యాపకులు నేను ‘తూరుపు’ పత్రిక తొలిసంచికను పురుడుపోస్తు భూమ్యాకాశాలను తేరిపార చూస్తున్నప్పుడు పాలమూరు మార్పు తద్వారా అలా అలా బాలకృష్ణయ్య గారి పరిచయం. వనపర్తి పరిచయం పౌరహక్కుల పరిచయం. విప్లవ రచయితల పరిచయం. పాలెం విశ్వనాథను పరిచయం చేస్తే వనపర్తి శ్రీశ్రీని పరిచయం చేసింది (కళ్లతో చూడటం). వనపర్తి అంటే డాక్టరుగారే. వేదికపైన శ్రీశ్రీ డాక్టరుగారిని చూస్తూనే చెప్పిన డాక్టరు కథ ఇప్పటికీ జ్ఞాపకమే. జ్వాలముఖి జ్వాలాగ్రముఖం కూడా జ్ఞప్తికి వస్తోంది.
చిన్ననాడు మహేంద్రనాథ్ గారిని చూసి ఏ అనుభూతుల్ని పోగుచేసుకున్నానో డాక్టరు గారిని చూసికూడా అనే అనుభూతులు పోగు చేసుకున్నాను. తెలంగాణ ముఖ్యంగా పాలమూరి అమాయకత్వం, పసితనం, సాదాసీదాతనం, తల్లితనం డాక్టరుగారిలో చూశాను. టక్కుటమారి విద్యలంటే నాకిప్పుడూ భయమే. సంకోచమే! అవేమీలేక పోవటం వల్లనేమో డాక్టరుగారు నచ్చటం.
డాక్టరుగారు ప్రజల మనిషి, పేదసాదల పట్ల ఆయన స్పందన అరుదైనది. ఆయన సోషలిజాన్ని ఇష్టపడ్డారు. వేమన అంటే ఎంత యిష్టమో శ్రీశ్రీ అంటే అంతే యిష్టం. వేమన కవిత్వం మీద సమావేశాలు ఏర్పాటు చేసినట్టు జ్ఞాపకం. ఒక్క మాటలో చెప్పాలంటే నిజమైన డాక్టరు, శాస్త్రీయ దృష్టి వున్న డాక్టరు. డబ్బుకి, డాబుకీ అందనంత దూరంలో జీవించిన మనిషి, ప్రజల పేరు మీద టెలిఫోను బూతులు వైద్యశాలలూ వచ్చి ప్రజా శబ్దాన్ని పలుచన చేశాయి. ఆ పేర్లేవీ లేకుండానే ఓ పాత ఇల్లే ఆసుపత్రిగా ఆయన ప్రజలకు వైద్యం చేయడం చూస్తే ఎందుకోగాని నార్మన్ బెతూనే జ్ఞాపకం వస్తారు. ప్రజావైద్యశాలలని పేరు పెట్టుకున్నంత మాత్రాన ప్రజల వైద్యశాలలు కావాలని ఏమిలేదు. మనమధ్య ఇపుడున్న చాలా మంది ప్రజావైద్యులకి ప్రజల డబ్బుపైన ధ్యాసెక్కువ. ప్రజల డాక్టరనే పేరు బాలకృష్ణయ్యగారికి సార్థకమైంది. ప్రజలకు వైద్యం చేసి ఆదుకోవడమే కాదు ప్రజలకవి శ్రీశ్రీ యింటిని (వేలంవేసిన ఇంటిని) నిలిపిన మహానుభావుడూ డాక్టరుగారే. భారత చైనా మిత్రమండలి తరఫున డాక్టరుగారు చైనా వెళ్లిరావటాన్ని తన జీవితంలో గొప్ప ఘటన గా గుర్తు చేసుకునేవారు. దగ్గర్లోనే వున్న మదనాపురంలో తెలుగుపండితునిగా పుద్యోగంలో వున్నపుడు హెడ్మాష్టరు మహదేవయ్యగారు వాళ్ల స్కౌటు సావనీరుకు నాచేత వ్యాసం రాయించారు. లేఖా రూపంలో బాధ్యతా భవిష్యత్తుల్ని గూర్చి చెబుతూ (స్కౌటుకి) ఓ వ్యాసం రాశాను. ఆ సందర్భంగా ఓమిత్రునితో డాక్టరుగారు పోషలిస్టు దేశాల్లో స్కౌటు వుంటుందా! అనడిగారట. డాక్టరుగారి ప్రశ్నా, పరిశీలనా అలా వుంటాయనటానికే ఈ వుదాహరణ.
డాక్టరుగారు లౌకికవాది. మానవతావాది అని చెప్పాల్సిన అవసరమేలేదు. ప్రజల మీద ఆయనకున్న ప్రేమే ఆ విషయాన్ని తెలుపుతుంది. డాక్టరు గారు మూఢవిశ్వాసాలని నమ్మేవారు కాదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పక్క వూరు (కేతేపల్లి) అమ్మాయో, తెలిసిన వాళ్లమ్యాయోగాని ఆ అమ్మాయి చిత్రంగా ప్రవర్తించేది. తెల్లారేవరకు ఆ అమ్మాయి బట్టలన్నీ బ్లేడుతో కోసినట్టు అయ్యేవి. ఇంట్లో వాళ్ళని కూడా. అలాంటి అమ్మా యిని తనింట్లో వుంచుకొని అలాటివి ఆ అమ్మాయే చేస్తుందని కనిపెట్టి అవి మానసిక జబ్బుని ఆయన తేల్చిన ఘటన ఒకటి నాకు జ్ఞాపకం వస్తోంది.
తెలుగుదేశంలో చేరినా ఆయనను ఆ రాజకీయాలు నడిపించినాయని చెప్పలేం. అవి వస్త్ర సదృశాల్లోనే వున్నాయి. వనపర్తి పాలమూరు ఆయనను యంఎల్ఏగా కంటె డాక్టరుగానే ఎక్కువ గుర్తుంచుకుంటుంది.
ఆర్.యస్.యూ, ఆర్వైయల్ సభలు ఆయన ఇంటి పక్కన్నే ఆయనింటిముందున్న కాలేజీ గ్రౌండులోనే జరిగేవి. భోజనాలు ఆయనింట్లోనే, వరవరరావు సారూ, నేను, ఆరెస్యూ మిత్రులందరం డాక్టరు గారితో కలిసి భోజనాలు చేసే సందర్భంలో- అప్పటికాయన డయాబెటీస్ పేషంటేమో చైనీస్ ఫుడ్ సేమ్యాల గురించి ఎన్నో విషయాలు మాతో మాట్లాడారు. ఆయన సీసీ, తరిమెలల్ని ఇష్టపడేవారు. మాదంతా చారుమజుందారీ అయినా ఆయన మాతో మంచిగానే వుండేవారు. స్నేహం విషయంలో ఆయనకేవీ అడ్డురాలేదు. ఇంటలెక్చువల్ ఫోజులేని ఇంటలెక్చువల్ డాక్టరు గారు. ఆయన పాలమూరి మాండలికం ఇప్పటికి చెవుల్లో మార్మోగుతున్నట్టే వుంది. ఆయనకు వూతపదాలైన ‘సుమారు’, కుడుకలు చాలాసార్లు తంటాలు తెచ్చేవి. మేం నవ్వుతూ అర్థం చేసుకునే వాళ్లం. ఆ మాటల్ని జ్ఞప్తికి తెస్తూ అంపయ్య బాగా నవ్వించేవాడు.
మాయింట్లో వాళ్ళకి గానీ, నాకుగానీ డాక్టరు గారిని మరిచిపోలేని వ్యక్తిగత సందర్భం ఒకటుంది. మదనాపురంలో నేనున్నప్పుడు – 82 ప్రాంతాల్లో మా పెద్దమ్మాయికి ఏడెనిమిదేళ్లు, ఒకటే జ్వరం, మందులు అక్కడే అప్పుడప్పుడే ప్రాక్టీసు పెట్టిన యువడాక్టర్ కృష్ణకుమార్ గారి వైద్యం నెలరోజులైనా జబ్బు నయం కాలేదు. అమ్మాయి చిక్కిశల్యమైంది. కృష్ణకుమార్ గారికి అంతుపట్టలే. అప్పుడాయన బాలకృష్ణయ్యగారిని సంప్రదించమన్నారు. అమ్మాయిని తీసుకొని వెళ్లాను. చూడంగానే అమ్మాయి వీపుతట్టి తమ్ముడూ! బేబీకి ప్రైమరీ కాంప్లెక్సు తిండి పెట్టక చంపిండ్రా! అన్నాడు. ఎక్స్రే కావాల్నా అంటే అంటే ఒద్దన్నాడు. సాయంత్రం ఆసుపత్రికి రమ్మన్నాడు. నేనే ఎక్స్రే తీయించి తీసుకెళ్ళా. కలసి ఇస్తే నామాట నమ్మకం లేదుగదా! ఏముంది ఎక్స్రే లో నేనన్నదే కనిపిస్తున్నది గదా! అని మందులు రాసిచ్చారు. మంత్రం వేసినట్టు అమ్మాయిలో మార్పు. కృష్ణ కుమార్ గారికి కూడా డాక్టరు గారిమీద గురిభావం. త్వరలోనే అమ్మాయి కోలుకొన్నది మంచి డాక్టరు ను పరిచయం చేసిన కృష్ణకుమార్ గారిమీద నాకు గౌరవభావం పెరిగింది. ప్రాణలపై ఆశ వదులుకున్న వాళ్లెందరో ఆయన అమృతహస్తస్పర్శతో పునర్జీవితులయ్యారు. ఆయన అమృత హస్తస్పర్శ ని గూర్చి ఎన్నోకథలు చెబుతారు.
ఆయన తెలుగుదేశంలో చేరే ముందు పిలిపించి తెలుగు దేశంలో చేరాలనుకుంటున్నాను మీ అభిప్రాయం చెప్పండీ అన్నాడు. ఆయనప్పటికే నిర్ణయించు కొనివున్నాడు. డాక్టరును మాత్రం ప్రజలకు లేకుండా చేయకండి అని చెప్పివచ్చాను. డాక్టరెప్పటికీ వుంటాడని ఆయన హామీ. అంతే, మిత్రులు చాలామంది అభిప్రాయాలను అడిగి నట్లు ఆ తర్వాత అన్నారు యం.యల్.ఎగా సులభంగానే గెలిచారు. గెలిచిన సందర్భంగా మదనాపురంలో సన్మానసభ ఏర్పాటు చేశారు. చూద్దామని వెళ్లి అలా దూరంగా నిలబడ్డాం.మా అమ్మాయి డాక్టరు గారిని గుర్తుపట్టింది. అందరూ దండలు వేస్తోంటే చూసి నేను వేస్తానని మారాం చేసింది. నేను పట్టించుకోలే. మిత్రులే బలవంతాన తీసుకెళ్లి దండ వేయించారు. డాక్టరుగారు గుర్తు పట్టి అమ్మాయిని దగ్గర కూర్చోబెట్టుకొని ‘నాన్న వాళ్లు బాగున్నారా! నీ జబ్బు నయమైందికదూ’ అంటూ పలకరించారట. మా అమ్మాయికి ఇప్పటికీ మరుపురాని మంచిడాక్టరు ఆయన.
ఆయన సత్తెకాలపు మనిషి. ఆయన సత్తె కాలపు డాక్టరు. వనపర్తికి ఇపుడు మంచి రాజకీయ నాయకుడి సంగతేమోగాని మంచి డాక్టరు ప్రజల డాక్టరు కావాల్సిన రావాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఆయన లేని లోటును తీర్చేవారసులకోసం వనపర్తి ఎదురు చూస్తూవుంది. ఎదురు చూపులు ఫలిస్తాయో! ఫలిస్తాయనే ఆశిద్దాం.
ప్రపంచ బ్యాంకులు సరళీకరణలు ప్రైవేటీ కరణలు విశ్వకిరణాల హోరులో విద్యా, వైద్యం, సకల మానవ విలువలూ విధ్వంసమైపోతున్న వేళ ‘డాక్టరు’ గారిలా శాస్త్రీయదృష్టి, ప్రజలమీద ప్రేమా, వ్యక్తిమీద గౌరవం వున్న డాక్టర్లు అవసరం మరింత మరింత వుంది.
బాలకృష్ణయ్యగారి మార్గంలో సాగి వరంగల్లులా మన పాలమూరు ఓ రామనాధంగారినీ, నారాయణగారిని అందించే రోజుకోసం కలలుగందాం

Leave a Reply