మహామనిషి
ప్రజల కష్టాలను, కన్నీళ్లను అర్థం చేసుకుని వారికి నిస్వార్థంగా సేవ చేయాలని ప్రభుత్వ ఉద్యోగం చేసే అవకాశం వచ్చినా దాన్ని కాలదన్నారు. పొద్దస్తమానం రోగులకు సేవ చేసి ఇంటికి ఖాళీ జేబులతో వెళ్లడం ఆయన రోజూవారీ కార్యక్రమం. ఏ సంపాదన లేకుంటే కుటుంబం ఎలా గడుస్తుందనే స్పృహ కూడా ఆయనకుండేది కాదు. పేదలను, పేషెంట్లను ప్రేమించి ఆదుకోవడంలోనే ఆయనకు ఆనందం ఉండేది.
1950 నుండి వనపర్తి ప్రాంతంలో డాక్టర్ బాలకృష్ణయ్యగారి ప్రభావానికి గురికాని వారెవ్వరూ ఉండరు. నా విద్యార్థి దశలో ఆయన నాకు ఐడియల్ పర్సన్. మా నాన్న ఆయనకు పితృసమానులు. ఒక ఉన్నత విద్యావంతుడైన డాక్టర్ అభ్యుదయ దృక్పథంతో పేదలకు ఉచితంగా సేవలు చేయాలని ముందుకు రావడం ఆ కాలంలో ఎవరికి సాధ్యంకాని గొప్ప నిర్ణయం.
స్వతహాగా కష్టపడి ఎదిగినవారాయన, సామాజిక సేవలో వైద్యం ద్వారా భాగస్వామి అయ్యారు. మరోవైపు 1950ల నాటికే విద్య యొక్క ప్రాధాన్యతను గుర్తించారు. ప్రజల కష్టాలను, కన్నీళ్లను అర్థం చేసుకుని వారికి నిస్వార్థంగా సేవ చేయాలని ప్రభుత్వ ఉద్యోగం చేసే అవకాశం వచ్చినా దాన్ని కాలదన్నారు. పొద్దస్తమానం రోగులకు సేవ చేసి ఇంటికి ఖాళీ జేబులతో వెళ్లడం ఆయన రోజూవారీ కార్యక్రమం. ఏ సంపాదన లేకుంటే కుటుంబం ఎలా గడుస్తుందనే స్పృహ కూడా ఆయనకుండేది కాదు. పేదలను, పేషెంట్లను ప్రేమించి ఆదుకోవడంలోనే ఆయనకు ఆనందం ఉండేది.
స్వాతంత్ర్యోద్యమం, ప్రజా పోరాటాల్లో తనదైన పాత్రను పోషించిన గొప్ప డాక్టర్ కావడం వల్లనే అంతకన్నా గొప్ప ప్రజానాయకుడయ్యారు. పేదల పక్షం వహించి రాజరికంపై చేసిన పోరాటం చాలా సందర్భాల్లో రాజా రామేశ్వరరావును భయపెట్టింది.
నేటికీ వనపర్తిలో ‘డాక్టర్ సాబ్’ అన్నమాట ఒక్క బాలకృష్ణయ్యగారికే అన్వయించబడుతుంది. ఆయన ప్రాక్టీస్ చేసినంతకాలం ప్రజలు ఇతర డాక్టర్లకు కన్సల్టింగ్ ఫీజు ఇచ్చే అలవాటు లేకుండానే గడిపారు. అంటే వైద్యం అనేది ఉచితంగా లభించేదనే భావన నెలకొని ఉండింది. వామపంథా భావాలను అభిమానించడంవల్ల ఆయన సాహిత్యాన్ని, కళలను పోషించి సామాజిక సేవలో తన జీవితాన్ని పండించుకున్న మహామనీషి డాక్టర్ బాలకృష్ణయ్య.