మంచిమనిషి - మానవతామూర్తి

మానవ సంబంధాలు, మానవతా విలువలు దిగజారిపోయిన యాంత్రిక సమాజంలో డాక్టర్ బాలకృష్ణయ్యని స్మరించుకోవడం మళ్లీ మంచి సమాజం కోసం ఆశలను చిగురింపజేసుకొనడమే. మంచి మనుషులు గతించినా వాళ్ళ జ్ఞాపకాలు, రూపురేఖలు, ఆచరణ వారినెరిగిన వారిని శాశ్వతంగా వెంటాడుతూనే ఉంటాయి. నా బాల్యం నుండి, పెద్దయ్యాక సామాజిక, సాంస్కృతిక సంస్థలలో క్రియాశీలకంగా పనిచేస్తున్న క్రమంలో బాగా ఎరిగిన డాక్టర్ బాలకృష్ణయ్యను నేను జ్ఞాపకం చేసుకోని క్షణం ఉండదు.
ప్రతి ఊరుకు, ప్రతి చిన్నా పెద్ద పట్టణానికి ఏదో స్థానిక చరిత్ర విధిగా ఉంటుంది. ఆ చరిత్ర వివిధ దశలలో ఆ ప్రాంతపు కొందరు వ్యక్తుల పేరిట ప్రజలు మౌఖికంగా మాట్లాడుకుంటూ, వారి తర్వాత కాలంలో జ్ఞాపకాలుగా మననం చేసుకొంటుంటారు. ఆ జ్ఞాపకాలలో చెడును వదిలేసి మంచినే బాగా చర్చించుకోవడం మౌఖికంగా చరిత్రను లిఖించే ప్రజల విశిష్ట స్వభావం. నైజాం చక్రవర్తికి కప్పం కడుతూ, సంపూర్ణ స్వతంత్రతను కల్గిన సంస్థానంగా, అద్భుతమైన రాజ భవనం, స్వాతంత్య్రం తర్వాత పాలిటెక్నిక్ కళా శాలకు ప్రభుత్వపరం చేయడం, నాటి భారత ప్రధానమంత్రి జనహర్ లాల్ నెహ్రూ వనపర్తి సందర్శన, వినోబాబావే, విజయలక్ష్మి పండిత్ లు మాధవరావు పల్లెలో భూదానోద్యమం వనపర్తి
పట్టణ ప్రజలకు గొప్ప జ్ఞాపకాలు. అప్పటికి నేను 5వ తరగతి విద్యార్థిని. దాదాపు నాలుగు దశాబ్దాలు వనపర్తి పట్టణం అంటే యితరులకు గుర్తుకొచ్చేది యిరువురు వ్యక్తులే రాజారామేశ్వరరావు, ఆయన పాలక రాజకీయాలు. తర్వాత ప్రజాపక్షపాతి, పేదల, మధ్యతరగతి ప్రజల్లో ఆరాధ్యదైవంగా భాసించిన డాక్టర్ బాలకృష్ణయ్య. వెనుకబడిన వర్గాల్లో పుట్టి, కష్టాల బ్రతుకులను తెల్పిన డాక్టర్ నిజాం వ్యతిరేక ఉద్యమంలో విద్యార్థిగా పాల్గొంటూనే విద్యాభ్యాసం పూర్తి చేసినా, ఆనాటికి ప్రభుత్వ రంగంలో వైద్యవృత్తికి వెళ్లకుండా, వనపర్తిలో ప్రయివేటు డాక్టరుగా ప్రాక్టీసును ఎంచుకుని, ప్రజావైద్యునిగా, ప్రజల మిత్రునిగా, ప్రజా రాజకీయ సామాజిక సంస్థలకు పెద్దదిక్కుగా మున్సిపల్ చైర్మన్ గా, శాసనసభ్యునిగా వనపర్తి ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నాడు. రామేశ్వరరావు రాజకీయ విధానాలకు, భూస్వామ్య విధానాలను ఎదుర్కొన కలిగిన సత్తా ఆ రోజుల్లో ఆయనకే సాధ్యమైంది. వామపక్ష పార్టీల మద్దతుతో, స్వతంత్రంగా రాజకీయాల్లో వుండి, ఎమర్జెన్సీ తర్వాత జనతాపార్టీ ఆ తరువాత తెలుగుదేశంలో చేరి శాసనసభ్యునిగా ఎన్నికైనప్పటికీ వైయక్తికంగా ఆయన వామపక్ష, విప్లవ రాజకీయ భావాలను విడనాడలేదు. ఆయన పునాది విశాల ప్రజారాసుల్లో వుండడం పేదరికాన్ని, నిరక్షరాస్యతను, మత ఛాందస వాదాన్ని వ్యతిరేకించడం, ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని, మానవ హక్కులను, సామ్యవాదాన్ని ఆయన ప్రేమించడమే. డాక్టర్ గారి రాజకీయాలపై, పార్టీలు మార డంపై కొంతమందికి, వామపక్ష రాజకీయ పార్టీలకు వ్యతిరేకత ఉండేది. అయినా చేయగలిగింది, చేయవలసింది తన మిత్రులతో మాట్లాడి, తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించాడు. కాని తన ప్రత్యర్థులకు కూడా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మానవతావాదిగా, స్వేచ్ఛాప్రియునిగా వాళ్లకు ఎలాంటి వివక్షత చూపకుండా సహాయ సహకారాన్ని అందించాడు. ఏ రాజకీయ పార్టీ కార్యకర్తలపై అధికారవర్గం నుండి దాడులు సంభవించినా వెంటనే ప్రతిస్పందించేవారు. సభలకు, సమావేశాలకు నిర్వహణ ఇబ్బందులు ఏర్పడినప్పుడు వాళ్ళకు పెద్ద దిక్కుగా ఉంటే అవసరమైన సహాయం అందించాడు. అందుకే ఆయన విమర్శకులు సైతం ఆయన్ను గౌరవించేవారు. అలసి పోయి అర్ధరాత్రి నిద్రించే సమయంలో కూడా ఇంటి తలుపును తట్టితే, అలాగే స్టెతస్కోప్ మెడలో వేసుకుని వనపర్తిలో ఏ ఇంటికైనా వెళ్లి ప్రాణభిక్ష పెట్టిన ఆయన వైద్యవృత్తికే వన్నె తెచ్చాడు. చావుబ్రతుకుల్లో మందులు కొనలేని వారిని సైతం తన కారులో హైదరాబాద్ కు తెచ్చి ఉస్మానియా ఆసుపత్రిలో చేర్చిన వైనాలు ఎన్నో. చిన్న చిన్న చేతివృత్తుల వాళ్లు గాయాలై, ప్రమాదం అంచున ఉన్నప్పుడు తన దగ్గర వైద్యం చేసిన ఘటనలు “రక్తాశ్రువులు” నవల చదువుతుంటే మననంలోకి వస్తాయి. డాక్టర్ కోట్నీస్. జీవితం అంటే ఆయనకెంతో యిష్టం. ఆయన ఆసుపత్రి లో పనిచేసిన కంపౌండర్లు రాములు, శ్యాంలకు కూడా అదే శిక్షణ. వైద్యం కోసం వచ్చి, చికిత్స పొందుతూ తమ ఇళ్లలో భర్తలు, అత్తలు, మామలు, పెట్టే ఇబ్బందులను డాక్టర్తో మాట్లాడి, వాళ్లకొకసారి చెప్పమని కోరిన హిందూ, ముస్లిం మహిళలు గొప్ప ఆప్తుడుగా భావించేవారు. నేను ప్రత్యక్షంగా ఆసుపత్రిలో యిలాంటి సంఘటనలను చూశాను. కార్పొరేట్ వైద్య పద్దతులు విస్తృతమై, వైద్యచికిత్స పేద, మధ్యతరగతి ప్రజలకు అందని గగనకుసుమాలైన రోజుల్లో డాక్టర్ బాలకృష్ణ లాంటి వైద్యుల అవసరాన్ని సమాజం ఎప్పుడైనా గుర్తిస్తుంది. ఎన్నికలలో పోటీచేసి, ప్రచారానికి వెళ్లిన సందర్భాలలోనూ గ్రామాల్లో జనంతో మాట్లాడుతూనే, జేబులో నుండి చీటీ తీసి మందులు వ్రాసేవాడు. రోగ వీడిత జనాన్ని ఆదుకోవడంలో ఆయన హృదయం నిరంతరం పరితపించేది. ప్రజా సమస్యలూ, రాజకీయాలు, వైద్యం యిన్ని పనుల్లో మా పుస్తకాలు చదివేవాడు. వేమన పద్యాలు మరీ మక్కువ. మహాకవి శ్రీశ్రీ అంటే ఎనలేని అభిమానం. వనపర్తి పురపాలక సంఘం అధ్యక్షునిగా ఉండిన కాలంలో గ్రామసభకు మహాకవి శ్రీశ్రీతో సహా ఆనాటి కవులందరూ కవిసమ్మేళనంలో పాల్గొన్నారు. వరవరరావు, చెరబండరాజు, నిఖిలేశ్వర్, జ్వాలాముఖి, శివారెడ్డి తదితరులంతా విచ్చేసిన నాటి సాయంత్రం కవిసమ్మేళన సభ మహబూబ్ నగర్ జిల్లాలో ప్రగతిశీల శక్తుల ఉనికిని, పరిచయాలను కల్గజేసింది. పట్టణ ప్రాంతాల్లో విప్లవ విద్యార్థి ఉద్యమాలు, విప్లవ ప్రగతిశీల సాంస్కృతికోద్యమాలు ఉధృతమౌతున్న ఆ దశకంలో మహాకవి శ్రీశ్రీ పౌరహక్కుల సంఘానికి, భారత చైనా మిత్రమండలికి అధ్యక్షుని గా ఉండేవారు. డాక్టర్ గారు భారత్ చైనా మిత్ర మండలి ఉపాధ్యక్షులుగా వుండిన కాలంలోనే చైనా చిత్రాలను, 1979లో జిల్లాలో ప్రదర్శించడం జరిగింది. అనేక సాహిత్య, సామాజిక సంస్థలు పాలమూరు జిల్లాలో ప్రగతిశీల సాంస్కృతికోద్యమానికి శ్రీశ్రీ సభలు గొప్ప ప్రేరణనిచ్చాయి.
డాక్టర్ బాలకృష్ణయ్యను స్మరించుకోవడంలో నాలుగు దశాబ్దాల వనపర్తి పట్టణ రాజకీయ, సామాజిక పరిస్థితులను, ఉద్యమాలను, సంఘటనలను స్మరించుకోవడమే. తనకెన్ని సమస్యలు, సంకటాలున్నా కలిసిన మనిషిని ప్రేమతో మాట్లా డటం, గౌరవించడం, తోచిన సహాయం చేయడం ఆయన జీవనశైలి. అనేక సందర్భాలలో ఆయన నిర్ణయాలు రాజీ పడినట్లుండినా, ఆత్మీయంంగా ఆయన మార్పువైపు దృష్టిని సారించేవాడు. వ్యవస్థతో రాజీపడుతూ, సంఘర్షించడం ఒక ఆచరణగా మార్చుకున్నాడు. ఈ క్రమంలో పాత అభిమానులు, మిత్రులు వదిలివేస్తే, కొత్త మిత్రులు, అభిమానులతో ముందుకే సాగాడు. తనకున్న పేరు ప్రతిష్ఠలను వ్యక్తిగత ప్రయోజనాల కోసం లేకుండా, ప్రజలకు వీలైనంత సహాయం చేసేందుకుపయోగించుకున్నాడు. అత్యవసర పరిస్థితి కాలంలో తనను ఆశ్రయించిన వనపర్తిలో, జిల్లాల్లో అనేకచోట్ల తమ కార్యక్రమాలు చేపట్టినవి.
కమెండో ఎడిటర్ తన పత్రికలో ఒక సవాల్ విసిరాడు. ఇల్లు కుదువపెట్టబడి, అప్పులపాలైన మహాకవి శ్రీశ్రీని ప్రజలు ఆదుకోలేరా అని? ఈ వార్తకు స్పందించిన సాహితీ మిత్రులు వనపర్తిలో డాక్టర్ బాలకృష్ణగారితో చెవిలో వేసిందే తడవుగా “శ్రీశ్రీ సన్మాన కమిటీ” డాక్టర్ గారి అధ్యక్షతన ఏర్పడింది. పత్రికా ప్రకటన చేసింది. నెలరోజుల లోపలనే డబ్బు వసూలు చేయబడింది. వనపర్తిలో మహాకవి శ్రీశ్రీకి ఘనంగా సన్మానం జరిగి, ఫర్స్ ఇవ్వబడింది. అల్లసాని పెద్దనకు రాయలు గండపెండేరం తొడిగి చేసిన సన్మానం కంటే, వనపర్తి ప్రజలు నన్ను సన్మానించిన పద్ధతి గొప్పదని శ్రీశ్రీ అన్నాడు. మిరియాల రామకృష్ణ, జ్వాలాముఖి, చేకూరి రామారావు పాల్గొన్న ఆ సభ నిర్వహణకై డాక్టర్ గారు ఎంతో కృషి చేశారు. నేటికి ఆ సభ ప్రజల జ్ఞాపకాలతో సజీవంగా వుండిపోయింది. వనపర్తి పట్టణంలో,రాజకీయ నాయకులకు ఆశ్రయం ఇచ్చాడు.
నిస్సహాయ స్థితిలో ఆయన దగ్గరికెళ్లిన వారికి, గొప్ప ధైర్యం వచ్చేది. సాధారణ స్థాయిలో ఎవరిదీ పరిపూర్ణ జీవనం కాదు. తాను నమ్మిన విశ్వాసాలకై జీవించడం కత్తిమీద సాములాంటిదే. బహుముఖ బాధ్యతలు గల వ్యక్తి అన్నింటిలో సమతుల్యతను సాధిస్తూ ప్రజల హృదయాలలో తన స్థానాన్ని పదిలపరచుకోవడం అనితర సాధ్యమైన విషయమే. సంస్థానాధీశుల పేరుతో తన ఉనికిని చాటుకున్న వనపర్తి పట్టణానికి ఒక ప్రజావైద్యుడు, ప్రజా రాజకీయవాది, ప్రగతిశీల మానవతావాది తన పేరును ఉనికిగా మార్చడం లోనే ఆయన జీవనం సాఫల్యత చెందింది. నిర్మలమైన ఆకాశంలో చంద్రుడి వలె, పైరు పచ్చని పంటల్లోకి సాగిపోయే పంటకాల్వ వలె, ఎగిరే పక్షుల గుంపువలె, కేరింతలతో ఆటాడే పసిపాపల నవ్వులవలె ఆయన వ్యక్తిత్వం మరువరానిది. మరచిపోలేనట్టిది. ఆ మానవతామూర్తికి, మంచి మనిషికి ఈ అక్షర నీరాజనాలు.