ఆర్ద్రహృదయుడు
వానలో తడువనివారు. డా బాలకృష్ణయ్య గారి మంచితనం గురించి తెలియనివారు వనపర్తి ప్రాంతంలో ఎవరూ ఉండరు, రోగుల బాధలు బాపిన వైద్యునిగానే కాక, ఆర్తజనులను ఆదుకొన్న ఆపద్బాంధవునిగా అందరి అభిమానాన్ని చూరగొన్న ‘ప్రజల మనిషి’ ఆయన.
బాలకృష్ణయ్యగారు మా కుటుంబానికి చాలా సన్నిహితులు. మానాన్నగారు కీ.శే. సూగూరు వాసుదేవరావు ఆయనకు ఆప్తమిత్రులు. డాక్టరు గారు ఎప్పుడైనా వినోదార్థం వేటకు వెళ్లాలను కుంటే మా నాన్నగారి దగ్గరున్న తుపాకీని తీసుకొని వెళ్లేవారు. ఎన్నికల్లో పోటీచేసిన సందర్భాల్లో మా ఊరికి వచ్చి మా ఇంటినుంచే ప్రచారం ప్రారంభించేవారు.
డాక్టరుగా సరేసరి మా కుటుంబ సభ్యులందరికీ ఆయన సుపరిచితులు. నేను ఒకసారి అనారోగ్యంతో బాధపడినపుడు హైదరాబాదులో ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. మా నాన్నగారు వనపర్తిలో బాలకృష్ణయ్యగారి దగ్గరికి తీసుకు వెళ్లారు. ఆయన చికిత్సతో నా ఆరోగ్యం వెంటనే కుదుటపడింది. ఇది నేను ఎప్పటికీ గుర్తుంచుకొనే సంఘటన.
డాక్టరుగారి హస్తవాసి అటువంటిది. చుట్టు పక్కల గ్రామాల ప్రజలందరికీ ఆయన చికిత్స పట్ల ఎంతో గురి. అందుకే కమాను దగ్గర వైద్య శాలగానీ, హైస్కూలు పక్కన స్వగృహం కానీ ఎప్పుడూ రోగులతో కిటకిటలాడుతుండేవి. వారి వసతి సౌకర్యాల గురించీ, భోజన సదుపాయాల గురించీ డాక్టరుగారు ఎంతో ఉదారంగా సాయం చేసేవారు. వైద్యవృత్తిని సేవాధర్మంగా నిర్వహించిన పరోపకారశీలి ఆయన.
బాలకృష్ణగారి సేవలు వైద్యరంగానికే కాక, సామాజిక సాహిత్యరంగాలకు కూడా విస్తరించాయి. మునిసిపల్ చైర్మన్, శాసనసభ్యులుగా వనపర్తి ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషిచేశారు. కల్మషపూరితమైన రాజకీయరంగంలో ఆయన చిరకాలం రాణించలేకపోయినా, అనధికార శాసన సభ్యులుగా ప్రజల బాగోగుల కోసం ఎంతో పాటు పడ్డారు.
సాహిత్యమంటే కూడా ఆయనకు మంచి అభిరుచి, వనపర్తి కేంద్రంగా నేను స్థాపించిన “జ్యోతిర్మయి” సంస్థ సాహిత్యసభల్లో ఆయన ఆసక్తితో పాల్గొనేవారు. అభ్యుదయ కవితా యుగకర్త అయిన మహాకవి శ్రీశ్రీని వనపర్తికి
ఆహ్వానించి పాతికవేల నగదుతో సత్కరించి సభను వేడుకగా నిర్వహించిన ఘనత బాలకృష్ణ గారిది. డాక్టరుగారిది తామరతంపరగా వర్థిల్లిన కుటుంబం. ఆయన సంతతి కూడా విద్యాధికులై తండ్రి వారసత్వాన్ని అందుకొని వివిధ రంగాలకు సేవలు అందిస్తున్నారు. ఆయన అర్థాంగి శ్రీమతి అంజనమ్మ సాహిత్యాభిలాషగల సాధ్వి, నా సహా ధ్యాయుడు, ప్రియమిత్రుడు అయిన సి. మహాదేవ్ ద్వారా ఆమె సాహిత్యప్రీతి గురించి వింటూ ఉండేవాణ్ణి. శరతాబాబు నవలలు, పత్రికల్లోని సీరియల్ రచనలు పఠిస్తూ వాటిపై కుతూహలంతో చర్చలు సాగిస్తుండేది. నా మిత్రుని ద్వారా నా పుస్తకాలు కూడా ఆమెకు అందించేవాణ్ణి. తర్వాతికాలంలో కూడా హైదరాబాదులో మాఇంటికి దగ్గరగా ఉండటంవల్ల వారి కుటుంబ సభ్యులతో మా పరిచయం కొనసాగుతూనే ఉంది. నేనెరిగిన డా. బాలకృష్ణయ్యగారు బోళాశంకరుడు. ఎదుటివారి కష్టాలను చూడగానే కరిగిపోయే పసి మనసు ఆయనది. ఆర్ద్రతకు ప్రతిరూపమైన ఆయన సేవలు అందనివారు అరుదుగా ఉంటారు. అందుకే ప్రజాహృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మంచిమనీషి డాక్టర్ బాలకృష్ణయ్య.