పేదల పెన్నిధి డాక్టర్ బాలకృష్ణయ్య

డాక్టర్ బాలకృష్ణయ్యది బహుముఖ వ్యక్తిత్వం. నిజమైన ప్రజా డాక్టర్, ప్రజా నాయకుడిగా ఆయన చిరస్మరణీయమైన స్థానం పొందారు. అద్భుతమైన తన హస్తవాసితో ధనరాసుల్లో తులతూగే అవకాశం ఉన్నప్పటికీ ఆయన ఎప్పుడూ అందుకు ప్రయత్నం చేయలేదు. ఎందరికో ఆయన ప్రాణదానం చేశారు. ఇప్పటిలా ల్యాబ్ రేటరీ, రేడియాలజీ వంటి సౌకర్యాలు లేని కాలం లో ఆయన సులభంగా వ్యాధిని, దాని తీవ్రతను గుర్తించి చికిత్స చేసేవారు. ఖరీదైన మందులు రాయటం ఆయన నైజం కాదు. ఆయన ఆస్పత్రిలో ఆయనకు ఎవరూ ఫీజు ఇచ్చినట్లు నేను గమనించలేదు. ఎవరో కొందరు డబ్బు ఉన్నవారు తప్ప వనపర్తి పట్టణప్రజలు, పరిసర గ్రామాలకు చెందినవారు ఆయన నుండి ఉచితం గా వైద్యం పొందినవారే, ఆర్ధరాత్రి, ఆపరాత్రి అనకుండా ఆపద సమయంలో ఆయన ఆదుకొనే వారు. రోగుల ఇంటికి వెళ్లడం డాక్టర్లు నామోషీగా భావిస్తుంటారు. కాని ఆయన ఎలాంటి బేషజం లేకుండా అవసరాన్ని బట్టి రోగుల ఇళ్లకు వెళ్లి చికిత్స చేసేవారు. పట్టణంలోని అత్యధిక కుటుం బాలకు ఆయన ఫ్యామిలీ డాక్టర్. అదీ ఉచిత ఫ్యామిలీ డాక్టర్. ఇదంతా ఒక ఎత్తయితే వనపర్తి లోని చాలామంది ఆయనను తమ కుటుంబ పెద్దగా భావించేవారు. ఆయన ఇంట్లో కూడా ఏ గదికీ ప్రైవసీ లేదు. ఆయనతో పరిచయం ఉన్నవారు కుటుంబసభ్యుల్లాగా ఆయన ఇంట్లోని అన్ని గదుల్లోకి వెళ్లి రాగలిగేవారు. ఇది నిజంగా ఊహకందని విషయం.
ఒక బాలుడిగా, యువకుడిగా నేను ఆయనను దగ్గరిగా గమనించే అవకాశం కలిగింది. ఆయన పెద్ద అబ్బాయి ప్రస్తుతం ఇంజనీర్ వున్న రమేష్, చిన్నతనంలోనే మనకు దూరమైన రెండవ అబ్బాయి మహేశ్ నా క్లాస్ మేట్సే కాకుండా నా స్నేహితులు కూడా. అలా ఆ కుటుంబంతో సన్నిహితంగా ఉండే అవకాశం లభించింది. డాక్టర్ బాలకృష్ణయ్యను ఊర్లో చాలామంది అన్న అంటూ ఆప్యాయంగా సంబోధించేవారు. కొందరు ఆయనను డాక్టర్ సాబ్ అనేవారు. మా నాన్నగారు సదుర్ల గోపాల్ ఆయనను అన్న అని పిలిచేవారు పిల్లలం మేమంతా ఆయనను పెదనాన్నగా భావించేవాళ్లం. డాక్టర్గా రోగులకు సేవలందించడమే కాకుండా, ఆయన ఓపికగా ఆ జబ్బు రావడానికి గల కారణాలను వివరించే వారు. దానివల్ల వనపర్తి పట్టణంలో పెద్దగా చదువుకోని చాలామంది సాధారణ ప్రజలకు వివిధ జబ్బుల గురించి శాస్త్రీయమైన అవగాహన ఉండేది. జబ్బును అడ్డంపెట్టుకొని డబ్బు సంపాదించడం ఆయన ప్రవృత్తి కాదు కనుక ఇది సాధ్యపడింది. డాక్టర్ బాలకృష్ణయ్య గురించి నా చిన్ననాటి జ్ఞాపకాల్లో ఉన్న అనేక సంఘటనలను విశ్లేషించడానికి మరింత సమాచారంతో సమగ్ర పరచటానికి మా నాన్నగారు లేకపోవటం ఒక లోపంగా భావిస్తున్నాను.
వనపర్తి పట్టణంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణానికి ఆయన బీజం వేశారు. యువజన సంఘాన్ని స్థాపించారు. వివిధ కులాలకు చెందిన యువకులు కలిసి మెలిగే పద్ధతిని ఆయన ప్రవేశపెట్టారు. వనపర్తి యువకులు పిక్నిక్ కు వెళ్లేవారు, ఊరికి దూరంగా రెండు మూడు రోజులు అక్కడే గడిపేవారు. వారే వంటలు చేసుకొనేవారు. ఒక్కొక్కరు ఒక్కో పని చేసేవారు. 50 ఏళ్ల అప్పటికి ఇలా వివిధ కులాల వారు ఒకచోట కలిసిగడపటం, ఒక చోట భోంచేయడం. అందరూ వంటలో సహకరించడం, అప్పటికి అది చెప్పుకోదగిన అభ్యుదయమే. ఆవిధంగా వనపర్తి యువతజిల్లాలోని ఇతర పట్టణాల్లోని వారి కంటే భిన్నమైన ధోరణి కలిగి ఉండేదనిపించేది. ఆ ధోరణి అల వడటంలో డాక్టర్ బాలకృష్ణయ్య పాత్ర కీలకమైనది. నాకు జ్ఞాపకం ఉన్నంతవరకు ఆయన కమ్యూనిస్టు పార్టీ కమిటీల్లో, కీలక బాధ్యతల్లో లేనప్పటికీ ఆయనను మినహాయించి అక్కడి కమ్యూనిస్టు ఉద్యమాన్ని ఊహించటం అసాధ్యం. నా చిన్నతనంలో జరిగిన కమ్యూనిస్టు పార్టీ బహిరంగ సభల్లో ఆయన తప్పనిసరిగా కన్పించేవారు. పార్టీ కుటుంబాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరిచేవారు. సిపిఎం, సిపిఐగా పార్టీ చీలిన అనంతరం ఆయన సిపిఎంను సమర్థించారు. నక్సల్స్ చీలిక తరువాత ఆయన నక్సలైట్లను సమర్థించారు. అయినప్పటికీ సిపిఎం నాయకులను, ఆ కుటుంబాలను ఆయన ఎప్పుడూ శత్రువులుగా భావించలేదు. నిరాదరణ చూపలేదు. అదే ప్రేమానురాగాలను ప్రదర్శించే వారు. 1971-72 ప్రాంతాల్లో కామ్రేడ్ ఇ. ఆశీ ర్వాదం చొరవతో వనపర్తిలో సిపిఎం పునర్నిర్మా ణానికి ప్రయత్నాలు జరిగాయి. ఆయన దానికి కూడా సహకరించారు. రాజకీయ పాఠశాలను నిర్వహించుకోవడానికి ఆయన సిపిఎంకు తన ఇళ్లను నిరభ్యంతరంగా ఇచ్చేవారు. వనపర్తి హైస్కూల్ సమీపంలో ఉన్న ఆయన ఇంట్లో 1970-71 ప్రాంతంలో సిపిఎం ఒక రాజకీయ పాఠశాలను నిర్వహించింది. దానికి నండూరి ప్రసాదరావు వంటి నాయకులు హాజరయ్యారు. తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం 25వ వార్షికోత్సవ సభను సిపిఎం ఆయన ఇంట్లోనే నిర్వహించింది. అప్పటికే ఆయన నక్సలైట్ల అనుకూల రాజకీయాలను సమర్థించేవారు. అయినా తన ఇంటిని సిపిఎం ఆధ్వర్యంలో జరిగే సమావేశం కోసం ఇచ్చారు. ఆ సమావేశంలో ఆయన పాల్గొనలేదు కూడా. అలాగే 1972 ఆ ప్రాంతంలో ఎస్ఎఫ్ఐ జిల్లా రాజకీయ తరగతులను నిర్వహించుకోవడానికి ఆయన చిట్యాలలోని తన ఇంటిని ఇచ్చారు. ఆ రాజకీయ తరగతుల్లో టి.నరసింహయ్య, ఎన్.వి.భాస్కరరావు, పి.మధు క్లాసులు బోధించారు. ఎస్ఎఫ్ కార్యకర్తలకు ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు ఆయన దృష్టికి తీసుకువెళితే వాటిని పరిష్కరించటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండేవారు.
1969లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంబలంగా ముందుకు వచ్చిన దశలో ఆయన సమైక్యతావాదిగా గట్టిగా నిలబడ్డారు. విద్యార్థులు, ఉద్యోగులు మధ్యతరగతి మేధావులు ప్రత్యేక రాష్ట్ర ఆందోళనలో కొట్టుకుపోయిన ఆ తరుణం లో ఆయన సమైక్యరాష్ట్రం కోసం గట్టిగా నిలబడటం మామూలు విషయం కాదు. సమైక్యతను బలపరుస్తూ అప్పట్లో ఎన్.టి. రామారావు నిర్మించిన ఒక చిత్రాన్ని ఆయన సినిమా థియేటర్ కు వచ్చి చూడటం గురించి ఊళ్లో చెప్పుకునేవారు. 1971 పార్లమెంటు ఎన్నికల్లో ఆయన తెలంగాణా ప్రజాసమితి అభ్యర్థి రాజారామేశ్వరరావుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ అభ్యర్థి డి.కె.సత్యారెడ్డిని సమర్థించారు. అప్పటిదాకా కాంగ్రెస్ ఎంపీగా ఉంటూ వచ్చిన రామేశ్వరరావు ఎన్నికలు ప్రకటించాక చివరిక్షణంలో తెలంగాణా ప్రజాసమితిలోకి పరకాయ ప్రవేశం చేశారు. మర్రి చెన్నారెడ్డి ఆయనకు టికెట్ ఇచ్చేశారు. కాగా మొదటినుండి కాంగ్రెస్ ను గట్టిగా వ్యతిరేకించే డాక్టర్ బాలకృష్ణయ్య కాంగ్రెస్ అభ్యర్థిని సమర్థించడం ఆనాడు చాలామందికి విడ్డూరంగా కనిపించింది. కాని రాష్ట్ర సమైక్యతను ఆయన గట్టిగా కోరేవారు కనుక ఆనాటి రాజకీయ స్థితిని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ అభ్యర్థిని బలపరిచారు. కాంగ్రెస్ ను ఆయన బలపరచటం బహుశా అదే మొదటిసారి, అదే చివరిసారి కావచ్చు. ఆయన సూచన ప్రకారం ఎస్ఎఫ్ విద్యార్థులుగా ఉన్న మేము మరికొందరు సిపిఎం కార్యకర్తలు కాంగ్రెస్ అభ్యర్థి డి.కె.సత్యారెడ్డి కోసం గ్రామాల్లో తిరిగి ప్రచారం చేశాం. తోటి విద్యార్థులు మమ్మల్ని తెలంగాణా విద్రోహులుగా ఎగతాళి చేసేవారు. కాంగ్రెస్ ఎన్నికల గుర్తు ‘ఆవుదూడకు’ ఓటు వేయమని నినాదాలు ఇవ్వటం, గోడలపై రాయడం విద్యార్థులమైన మాకే చాలా కష్టంగా ఉండేది. కాంగ్రెస్ ను ఆమూలాగ్రం వ్యతిరేకించే డాక్టర్ బాలకృష్ణయ్యకు ఆ స్థితి ఎలా ఉండి ఉంటుందో ఊహించుకోవచ్చు.
డాక్టర్గా ఎంతో ప్రసిద్ధుడైన ఆయనకు సాహిత్యం పట్ల కూడా ఎంతో అభిరుచి ఉండేది. విస్తృతంగా చదివేవారు. ఇతరులను చర్చల్లోకి దించేవారు. అప్పట్లో దిగంబరకవులు, విప్లవకవుల పేర వచ్చే రచనలను ఆయన బాగా చదివేవారు. వాటిలో నుండి ఆయన కొన్ని గేయాలను కోట్ చేస్తూంటే మాకు ఆశ్చర్యం వేసేది. వృత్తిలో ఎప్పుడూ బిజీగా ఉండే ఆయన ఎలా జ్ఞాపకం పెట్టుకుంటారు. ఇవన్నీ అని అనిపించేది. మేము ఎస్ఎఫ్ఎలో పనిచేస్తున్నామని ఆయనకు బాగా తెలుసు. అయినా “ఇది విన్నావారా?” అంటూ నక్సల్స్ సాహిత్యంలోని కొన్ని గేయాలను చదివి నిన్పించేవారు. అప్పటికి సిపిఎం, నక్సల్స్ మధ్య పెద్ద సైద్ధాంతిక యుద్ధం జరుగుతున్నా ఆయన మమ్మల్ని తన పిల్లల్లాగే భావించేవారు తప్ప ఎగతాళి చేయడం, ఆటపట్టించడం వంటివి చేసేవారు కాదు. “వీరా” అని ఆప్యాయంగా సంబోధించడం ఆయనకు అలవాటు. ఆయన చొరవతోనే వనపర్తి పట్టణ ప్రజలకు శ్రీశ్రీ కవిత్వం నేరుగా ఆయన నోటినుండి వినే అవకాశం కలిగింది. అప్పట్లో శ్రీశ్రీ విప్లవ రచయితల సంఘం నాయకుల్లో ఒకరు. ఆర్థికంగా బాగా చితికిపోయి ఉన్నారు. డాక్టర్ బాలకృష్ణయ్య చొరవవల్ల వనపర్తిలో సభ జరిగింది. శ్రీశ్రీతోపాటు అప్పటికే ప్రఖ్యాతుడైన మోతుకూరి నరహరి, జ్వాలాముఖి తదితర కవులు ఆ సభలో పాల్గొన్నారు.
వనపర్తి పట్టణానికి ఆయన మున్సిపల్ చైర్మన్ గా పనిచేశారు. అప్పటిదాకా రాజా రామేశ్వర రావు మద్దతుతో ఎ.బాలయ్య మున్సిపల్ చైర్మన్ గా ఉండేవారు. చాలాకాలం మున్సిపాలిటీ ఎన్నికలు జరుగకపోయినా ఆయనను ఊర్లోవాళ్లందరూ చైర్మన్ బాలయ్య అంటూ పిలిచేవారు. 1961లో ఎన్నికలు జరిగాయి. నేరుగా కమ్యూనిస్టుపార్టీ పేర కాకుండా కమ్యూనిస్టుపార్టీ నాయకులు, అభిమానులు కలిసి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేశారు. అటువైపు నుండి కాంగ్రెస్ పార్టీ వారు పోటీ చేశారు. డాక్టర్ బాలకృష్ణయ్య నాయకత్వంలో పోటీ చేసినవారు అత్యధిక వార్డులకు మంచి మెజారిటీతో ఎన్నికయ్యారు. అలా ఎన్నికైన వారిలో మా నాన్నగారు ఒకరు. ఆయన నాయకత్వంలో ఎన్నికైన వారిలో దాదాపు అందరూ బలహీన వర్గాలకు చెందినవారే కావటం విశేషం. డాక్టర్ బాలకృష్ణయ్య అధ్యక్షతన మొదటిసారి జరిగిన మున్సిపాలిటి సమావేశంలో పారిశుద్ధ్య కార్మికులను అగౌరవంగా సంబోధించే అలవాటుకు మంగళం పలికారు. అప్పటిదాకా పారిశుద్ధ్య కార్మి కుల పేరు చివరన ‘గాడు’ అని చేర్చి హాజరు పట్టీలో రాసేవారు. ‘పోచయ్య’ అన్నది పేరైతే ‘పోసిగాడు’ అని, ‘నర్సయ్య’ అనేది ‘పేరైతే ‘నర్సి ‘గాడు’ అని రాసేవారు. అలాంటి రాతలు తొలగించాలని తొలి సమావేశంలోనే నిర్ణయించారు. దళితులను హీనంగా సంబోధించే దురాచారానికి తిలోదకాలిస్తూ చేసిన ఆ నిర్ణయాన్ని పట్టణంలో విశేషంగా చెప్పుకునేవారు. ఆదాయం తక్కువగా ఉందని చెప్పి వనపర్తి మున్సిపాలిటీని కొంతకాలం తరువాత మేజర్ పంచాయతీగా మార్చారు. 1968లో వనపర్తి మేజర్ పంచాయతీకి మళ్లి ఎన్నికలు జరిగాయి. “పట్టణ అభివృద్ధి సమితి” పేరుతో కమ్యూనిస్టు అభిమానులు పోటీ చేశారు. తిరిగి మంచి మెజారిటీతో ఎన్నికయ్యారు. డాక్టర్ బాలకృష్ణయ్యను సర్పంచ్ గా ఎన్నుకొన్నారు. 1983 లో తెలుగుదేశం తరపున శాసనసభకు ఎన్నిక కావడానికి ముందు ఆయన ఇండిపెండెంట్ గా సైకిల్ గుర్తుపై శాసనసభకు పోటీ చేశారు
ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అయ్యప్ప గెలిచారు. డాక్టర్ బాలకృష్ణయ్య ఓడిపోయారు. ఓట్ల లెక్కింపు వెలువడిన అనంతరం పట్టణంలో విషాధ చాయలు ఏర్పడ్డాయి. చాలామంది ఏడ్చేశారు. ఆ రోజు రాత్రి చాలామంది ఇంట్లో పొయ్యి వెలగలేదు. పట్టణ ప్రజలకు ‘డాక్టర్ సాబ్’ అంటే అంత అభిమానం.
1983లో ఆయన శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పటికీ అధికారపక్ష సభ్యుడు కావటం వల్ల శాసనసభలో ఆయనకు తగిన సమయం లభించేది కాదు. మొదటినుండి ఆయన ప్రతిపక్ష రాజకీయాలలోనే ఉన్నారు. అలాంటి వ్యక్తి మొదటిసారి శాసనసభకు ఎన్నికైనప్పుడు ఆయనకు టికెట్ ఇచ్చిన తెలుగుదేశం పార్టీయే అధికారపార్టీగా ఎన్నిక కావటం వల్ల ఆయనకు నష్టమే జరిగింది. అప్పటికే నేను హైదరాబాద్ లో విలేకరిగా శాసనసభ సమావేశాలను కవర్ చేస్తుండే వాడిని. ఆయన ప్రతిపక్ష సభ్యుడిగా ఉండి వుంటే సభలో రాణించే అవకాశం బాగా ఉండేదని, 200 మంది అధికార పక్ష సభ్యుల్లో ఆయన ఒకరు కావటం వల్ల సభలో ప్రసంగించే అవకాశం సహజంగానే తక్కువగా లభించేది. అయినప్పటికీ తనకు అవకాశం లభించినప్పుడల్లా ఆయన నియోజకవర్గ సమస్యలను సమర్ధవంతంగా సభా దృష్టికి, తద్వారా ప్రభుత్వ దృష్టికి తెచ్చేవారు వనపర్తి పట్టణంలోని కృష్ణదేవరాయ పాలిటెక్నిక్ ను, లక్ష్మీదేవి డిగ్రీ కళాశాలను ప్రభుత్వం చేత టేకోవర్ చేయించడంలో ఆయన ప్రధానపాత్ర వహించారు. దానివల్ల పేద విద్యార్థులకు కూడా స్వస్థలంలో విద్యాభ్యాసం చేసే అవకాశం కలిగింది. సరిపోయిన సంపాదన లేక డాక్టర్ బాలకృష్ణయ్య కుటుంబం సాధారణ జీవితం గడిపింది. కొన్నిసార్లు డబ్బుల్లేక చాలా ఇబ్బందులు పడేవారు. ఇంట్లో ఉందో లేదో చూసుకోకుండానే ఆయన ఇంటికి వచ్చిన వారికి కూడా తనతోపాటు వడ్డించమని ఆదేశాలు జారీ చేసేవారు. అయినా ఆయన సంతానం, కుటుంబం ఆర్థిక ఇబ్బందులను మౌనంగా భరించారు. తాము ఎంతో పేరున్న డాక్టర్ పిల్లలమన్న అహంభావం ఆయన సంతానంలో ఉండేదికాదు. ఆయన తన ఆదర్శాలతో తన పిల్లలను కూడా ప్రభావితం చేశారు. వనపర్తి పట్టణానికి ఆయనలాంటి ప్రజా డాక్టర్ మరొకరు లేరు, ఇక రారు. ఆయన మరణించిన రోజు వనపర్తికి అత్యంత విషాదకరమైన రోజు. ఆయన అంత్యక్రియలకు వేలాదిమంది చుట్టుప్రక్కల గ్రామాలనుండి కూడా తరలివచ్చారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఎవరి అంత్యక్రియలకు అంత మంది వచ్చి ఉండరు. ఆయన మరణంతో వనపర్తి పట్టణంలో ఒక శకం ముగిసింది. ఆయన ధన్యజీవి. చిరంజీవి.