మమతల నెలవు మా నాన్న
డా.జయంతి
మానాన్న బహుముఖ ప్రజ్ఞాశాలి అని, ఆయన వ్యక్తిత్వానికి ఎన్నో కోణాలున్నాయి. ప్రతి కోణం పరిపూర్ణమైందే. వైద్యం ఆయన ముఖ్యవృత్తి, సాహిత్యాభిమానిగా, కళాభిమానిగా, సంఘసంస్కర్తగా, విప్లవాభిమానిగా రైతుగా, న్యాయమూర్తిగా, రాజకీయవేత్తగా మరెన్నో ప్రవృత్తులు ఆయనలో నిబిడీకృత మయ్యాయి. వ్యక్తిగా మృదుభాషి, సంస్కారి, స్నేహశీలి, కరుణ, దయ అన్నింటినీ మించి ”అందరూ నా వారే’ అని అనుకునే ఆత్మీయత, ఇవన్నీ ఆయన వ్యక్తిత్వ నిర్మాణంనుండి విడదీయరాని మణిపూసలు.
‘బాపూజీ’ పేరు వినగానే అందరికీ గుర్తుకు వచ్చేది మహాత్మాగాంధీజీ, బాపూజీనే కాస్తా బాజ్జి గా మార్చి పిలుచుకుంటే మా ముందు నిలిచేది “మాత్రం – సముద్రమంత సేవాతత్పరత, ఆకాశమంత నిబద్ధత, హిమాలయాలంత ఔన్నత్యం, అనంతమైన విజ్ఞానతృష్ణ, కల్మషంలేని స్నేహశీలత, అభాగ్య జనజీవితాలు బాగుచేయాలనే తపన, చైతన్యం ఇవన్నీ కలబోసిన ఒక స్ఫురద్రూపం… నా నాన్నగారు, అదే మాబాజ్జి కళ్లముందు నిస్తారు. నాకు తెలుసు లోకంలో ఎవ్వరికైనా వారి తల్లిదండ్రులే ఆదర్శప్రాయులుగా ఉంటారు ” నేనిక్కడ గర్వపడేది కేవలం తన పిల్లలకే గాక సమాజంలోని ఎందరికో ఆదర్శప్రాయుడు గా ఒక వైతాళికుడుగా నిలిచిన మహోన్నతవ్యక్తి మా నాన్న కావడం. ఇది నిజంగా అందరికీ దొరికే ఆదృష్టం కాదు. ఆ అదృష్టం మాది మాట్లాడుకున్నప్పుడు ప్రపంచాన్నే గెలిచినంత గర్వం.నిర్మొహమాటంగా మాట్లాడాలనుకున్నప్పుడు, ఆతండ్రి పిల్లలుగా మీరెక్కడ నిలిచారు. అని ఎవరైనా ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకు సమాధానమేనా = అంతర్మథనం.
మాకు తెలుసు మానాన్న బహుముఖ ప్రజ్ఞాశాలి అని, ఆయన వ్యక్తిత్వానికి ఎన్నో కోణాలున్నాయి. ప్రతి కోణం పరిపూర్ణమైందే. వైద్యం ఆయన ముఖ్యవృత్తి, సాహిత్యాభిమానిగా, కళాభిమానిగా, సంఘసంస్కర్తగా, విప్లవాభిమానిగా రైతుగా, న్యాయమూర్తిగా, రాజకీయవేత్తగా మరెన్నో ప్రవృత్తులు ఆయనలో నిబిడీకృత మయ్యాయి. వ్యక్తిగా మృదుభాషి, సంస్కారి, స్నేహశీలి, కరుణ, దయ అన్నింటినీ మించి ”అందరూ నా వారే’ అని అనుకునే ఆత్మీయత, ఇవన్నీ ఆయన వ్యక్తిత్వ నిర్మాణంనుండి విడదీయరాని మణిపూసలు. మీ నాన్న మీకేమిచ్చి పోయాడన్న ప్రశ్న మాకు వర్తించదు కాని మీ నాన్ననుండి మీరేమి పొందారన్న ప్రశ్నకు సమాధానం చెప్పవలసిన బాధ్యత మాకుంది. లోకంలో ఎందరో గొప్పవారున్నారు. ‘తండ్రిని మించినవారు’ అన్న సూత్రం అమలయితే ఈ లోకంలో అందరూ గొప్పవారే ఉండేవారు. కాని తరాల అంతరాలు చూస్తున్నాం. తరానికి తరానికి పడిపోతున్న విలువలకు సాక్షీభూతులవుతున్నాం. అందుకేనేమో పండిత పుత్రః పరమశుంఠ అని అన్నారు. ప్రతి తండ్రీ కోరుకునేది. తన పిల్లలు తనకంటే గొప్పవారు కావాలని. మా నాన్న కూడా ఎప్పుడూ అనేవారు నా పిల్లలంతాకనీసం గ్రాడ్యు యేట్సు అయితే చాలని. ఆ తరువాత తరువాత గర్వంగా చెప్పుకునేవారు నా పిల్లలందరూ గ్రాడ్యుయేట్స్, నా అల్లుళ్లందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అని ఆయన తనకున్న విద్యాతృష్ణను మాలో చూసుకొని తృప్తిపడాలనుకునేవారు. విజ్ఞానార్జనకు వయసు, సమయం పరిమితులు కావన్నది ఆయనతో మేము నేర్చుకున్న ఒక పాఠం. నాకిప్పటికి బాగా గుర్తు పరీక్షల సమయంలో తెల్లవారుజామున లేచి చదువుకోవాలంటే మహా బద్ధకం. కాని అలా చదువుకోవాలన్నది మా నాన్ననుండి మేము నేర్చుకున్నాం. నాన్న వృత్తి రీత్యా వైద్యుడైనప్పటికీ వేదాలు చదివి అందులోని శాస్త్రీయతను బయటకు తేవాలన్నది ఆయన ఆకాంక్ష. అందుకే స్వయంగా సంస్కృతం నేర్చుకోవడం మొదలుపెట్టారు. దీనికోసం తెల్లవారుజామున 3 గం.లకు లేచి చదువుకునేవారు. అంతేకాదు వైద్యుడన్నవాడు నిరంతర పఠనంలో ఉండాలన్నది ఆయన దృఢవిశ్వాసం. ముందు నాన్న తెల్లవారుజామున చదువుకునేటప్పుడు నిండా ముసుగుపెట్టి గుండె గుబులుతో నిద్ర నటించేవాళ్లమే. తరువాత మేమూ ఆయనతో బాటు లేచి చదవడం అలవాటు చేసుకున్నాము.
ఒక వైద్యుడుగా నాన్న సమాజంలోని మూఢ నమ్మకాలకు బలైపోయిన నిర్భాగ్యులనెందరినో చూశారు. అశాస్త్రీయమైన విధానాలను ఎండగట్టాలనుకునేవారు. దీనికి ఆలంబనగా వేమన పద్యాలను ఎన్నుకున్నారు. కొన్నివేల పద్యాలను నేర్చుకున్నారు. నిజంగా చెప్పాలంటే ఒక పిహెచ్.డి. చేయడానికి తగినంత విషయం ఆయన దగ్గర ఉండేది. తన దగ్గరికి వచ్చిన రోగుల దగ్గరినుండి, స్నేహితులు, బంధువులు, మెడికల్ రిప్రజెంటేటివ్స్ వరకు అందరికి సందర్భం లేకపోయినా సరే వివరించి చెప్పేవారు. వేమనను వెలికి తెచ్చిన సర్. సి.పి. బ్రౌన్ అన్నా నాన్నకి అభిమానమే. ఈ రకమైన వాతావరణం మాలోని వివేచనను మేల్కొలిపింది. తద్వారా మనిషి ఏదైనా సాధించాలంటే ఎలా కష్టపడాలి? అన్నది నేర్చు కున్నాం. నేర్చుకున్న ప్రతి విషయాన్ని శాస్త్రీయంగా ఎలా ఆలోచించాలో దాన్ని జీవితానికి ఎలా అన్వయించుకోవాలో నేర్చుకున్నాం. ఇది మా బాజ్జి మాకిచ్చిన పెద్ద ఆస్తి. నేనెప్పుడు ఒక్క విషయంలో బాధపడుతుంటాను. సాహిత్యం మీద ఉన్న అభిరుచితో బాజ్జి నన్ను తెలుగు సాహిత్యం చదవడానికి ప్రోత్సహించారు. ఆయన ఎప్పుడూ ఒకమాట అనేవారు. “ఆ డాక్టరువు కాకుంటే కాకపోయావు తల్లీ! ఈ డాక్టరేటు అయిన తీసుకో అని, నాన్న కోరిక ప్రకారం డాక్టరేట్ పట్టా తీసుకున్నప్పటికీ అది ఆయన జీవితకాలంలో చేయలేదన్నది నేను మరచిపోలేని బాధ, వేదాల శాస్త్రీయ అధ్యయనం నేను చేయగలిగితే మా బాజ్జి కోరికను నేను కొంత నెరవేర్చగలిగినదాననవుతాను.
వృత్తిపట్ల బాజ్జికున్న నిబద్ధతచాలా గొప్పది. ఇతరత్రా ఎన్ని వ్యాపకాలున్నా, ఎన్ని సరదాలున్నా ‘ముందు నేను డాక్టరుని’ అన్న విషయం ఆయన జీవితకాలంలో ఎప్పుడూ మరిచిపోలేదు. ఆయనను అందరూ మొబైల్ డాక్టర్’ అని అనేవారు. ఇక్కడ, అక్కడ అనేది లేకుండా ఎక్కడ నిలబడితే అక్కడే వైద్యం చేసేవారు. చివరికి స్నానానికి బాత్రూమ్ కెళితే బయట ఒక గుంపు ఉండేది. పడుకునే సమయం తప్ప మిగిలిన సమయమంతా వైద్యంతోనే గడచిపోయేది. అదీ ఎక్కువభాగం నిలబడే. దవాఖానా (ఆసుపత్రిని మేమప్పుడలా పిలుచుకునేది)కు బాజ్జి దగ్గరికి వెళితే ఆయన దగ్గరికి వెళ్లడానికి జనాన్ని తోసుకుంటూ వాళ్ల మధ్యనుండి బలవంతంగా దారిచేసుకొని దూరిపోవలసి వచ్చేది. ఆయనకందరూ ఆత్మీయులే. అందుకే అందరూ మేము ముందంటే మేము ముందన్నట్లుండేవారు. ఆత్మీయతలున్న చోట క్రమశిక్షణలు పాటించడం కష్టం కదా! ఆయన వృత్తి నిబద్ధత ఎంతగొప్పదంటే తనకు జ్వరమొచ్చిన సమయంలో కూడా ఇతరులకు వైద్యం చేయడం మానలేదు. ఇలాంటి సంఘటనలు ఒకటి రెండు నాకు బాగా గుర్తు.
ఒకసారి వేసవి సెలవుల్లో మేము పిల్లలమంతా మేడపైన పడుకున్నాము. బాజ్జి క్రింద ఇంట్లో జ్వరంతో పడుకున్నారు. మధ్యరాత్రి తలుపులు బాదిన చప్పుడయ్యింది. పైనుండే క్రిందున్న వాళ్లను ఎవరని పిలిచాను. విపరీతమైన గాలి, వాళ్లేం చెబుతున్నారో నాకు వినబడలేదు. నేనేం చెబుతున్నానో వాళ్లకూ వినబడలేదు. వాళ్లు వైద్యానికే వచ్చారన్న విషయం నాకు అర్థమయ్యింది. వాళ్లు బాజ్జిని లేపమని అడుగుతున్నారు. కాని అంతగాలిలో, వానలో జ్వరంతో పడుకున్న బాజ్జీని లేపడం ఇష్టంలేక వాళ్లను కసిరి పంపివేశాను. మరుసటి రోజు మధ్యాహ్నం నేను అన్నం తింటుంటే బాజ్జిఅడిగారు. “అమ్మా రాత్రి నా కోసం ఎవరైనా వచ్చారా తల్లీ!” అని. “అవును బాజ్జి” అని చెప్పాను. “మరి వాళ్లనెందుకు పంపేశావురా” అని ఆడిగారు. దానికి నేనేం సమాధానం చెబుతానో నాన్నకి తెలుసు. నేను కూడా “మీకు జ్వరంగా ఉందని మిమ్మల్ని లేపలేదని” చెబితే సంతోషపడతాడనుకున్నా. కానీ బాబ్లి నా సమాధానం పూర్తిగా వినకుండానే ఒక్కమాటన్నారు. “అమ్మా! నేను డాక్టరుని, నాకు జ్వరం వచ్చిందని పడుకుంటే ఈ సమాజానికి నేనేం చేయగలను? అయినా ఆ వచ్చిందెవరో తెలుసా? నీ క్లాస్మేట్ బాలచంద్రమ్మ. నేను కొంచెం ఆలస్యం అయి ఉంటే ఆ అమ్మాయి డెలివరీ చాలా కష్టమయ్యుండేది తెలుసా?” అని. ఈ మాటలు నాకు జీవితంలో రెండు విషయాలను నేర్పాయి. ఒకటి వ్యక్తికి వృత్తిలో ఉండాల్సిన నిబద్ధత. రెండు స్నేహం పట్ల చూపాల్సిన బాధ్యత. ఈ రోజు ఒక మంచి అధ్యాపకురాలిగా ఇటు విద్యార్థుల్లోను, అటు తున్నానంటే అది మా నాన్న నాకిచ్చిన గొప్ప ఆస్తిగా భావిస్తాను.
నాన్నకి కొన్ని సరదాలుండేవి. అందులో రేడియో వినడం ఒకటి. టి.వి.ల ప్రభంజన కాలంలో కూడా మా పిల్లలందరికీ ఆయనలాగ రేడియో వినడమే ఇష్టం. పాపం! బాజ్జిఎన్నిసార్లు రేడియో వినాలని కొనుక్కొచ్చుకున్నా ఎవరో ఒకరు అడిగి తీసుకుపోయేవారు. ఇది నాకు కావాలి ఇవ్వమని ఎవరైనా అడిగితే “లేదు కాదు వద్దు” అనే సమాధానాలు ఆయన నోటినుండి వచ్చేవి కాదు. ఎంత విలువగలదైనా సరే లేదనకుండా ఇచ్చేసేవారు. పురాణాల్లో కర్ణుడి గురించి చెబుతారు. కుడిచేయికి తెలియకుండా ఎడమ చేయితో దానం చేసేవాడని. మేము కర్ణుడిని, శిబిని చూడలేదు. మానాన్నని చూశామంతే!
ఒకసారి నాన్న గ్రామ్ ఫోన్ రికార్డర్ కొన్నారు. దాన్ని వెంబడే ఒక స్నేహితుడు తీసుకెళ్లిపోయాడు. అటు డబ్బివ్వడు. ఇటు వస్తువివ్వడు. అడగొచ్చు కదా బాజ్జి అంటే “మనమేం అడుగుతాం నాయనా. ఇవ్వాలన్న ధ్యాస వాళ్లకుండాలి గాని’ అని అన్నారు. ఈనాడు ఆయన పిల్లలుగా మాలో అంత దాతృత్వగుణం లేకపోయినా, విలువైన సంపదలు మాకు లేవనో, లేకుంటే పోగొట్టుకు పోయాయనో అన్న బాధలు, గందరగోళాలు మాకు లేవు. పోతే పోయిందిలే, లేకుంటే లేకపోయిందిలే అన్న వితరణశక్తి మా బాజ్జి మాకిచ్చిన గొప్ప ఆస్తి. ఎదుటివ్యక్తిని అతడి డబ్బుతోనో, హోదాతోనో, అవసరంతోనో కొలిచే ఈనాటి సమాజంలో ఇంకా వాటికంటే మానవ సంబంధాలు గొప్పవి, అనుబంధాలు అంతకంటే విలువైనవి అన్న ఫిలాసఫీ కూడా మానాన్న మాకిచ్చిన మరో గొప్ప ఆస్తి. ఆయన తన జీవితాంతం ఈ ఫిలాసఫీనే పాటించారు.
‘Blood is thicker than water’ అంటారు. కాని నాన్న విషయంలో, మా విషయంలో ఇది తప్పని రుజువయ్యింది. కారణం బాజ్జివనపర్తికే అన్న రక్తసంబంధాలు పలుచనై, ఆత్మీయతానుబంధాలు చిక్కబారిన దృశ్యమది. చంద్రయ్య మామయ్య, రంగన్న చిచ్చ. ఖాజా చిచ్చ, బాలామన్న, బాషా తాతయ్య, గోవిందు తాత… ఇలా ఎందరో మామయ్యలు, అత్తమ్మలు, చిచ్చాలు, చిన్నమ్మలు, తాతయ్యలు, అన్నలు. వీళ్ళందరితో మాకున్నది రక్తసంబంధానికి మించిన ఆత్మీయతానుబంధం. వీళ్లనెవ్వరిని మా కుటుంబసభ్యులు కారు అని అనుకునే సాహసం మేము ఎప్పుడూ చేయలేము. ఇలా ఎందరో ఆత్మీయుల్ని మావాళ్లు అనుకునేవాళ్లని మా బాజ్జి మాకిచ్చి వెళ్లారు. మీకోసం మేమున్నామని నిండుగా పలికే ఆత్మీయులకంటే పెద్ద ఆస్తులేముంటాయి?
నాకిప్పటికీ మానాన్నలో అర్థంకాని విషయం ఆయన పెంపకం. ఆయనే రోజుకూడా మమ్మల్ని పల్లెత్తి ఒక్క మాటా అనలేదు. తమాషా ఏమి టంటే మా 16 మందికి కూడా బాబ్లీకి “నేంటేనే చాలా ఇష్టం” అన్న భావం ఉంది. కనబడని శాసనం, కనిపించే స్నేహం, ప్రేమ. వీటితోనే ఆయన మమ్మల్ని నడిపించారు. ఈరోజు ‘డాక్టర్ సాబ్’ పిల్లలంతా బాగా స్థిరపడ్డారు అని జనం అనుకుంటున్నారంటే అది మా బాబ్లి పెంపకం లోని గొప్పదనమే. మా బాడ్జిలో ఉన్న మరో సుగుణమేమంటే ఏ వయసు వారితోనైనా కలసి పోయేవారు. చిన్నపిల్లల దగ్గరినుండి ముసలివాళ్ల వరకు ఏ అరమరికలు లేకుండా బాబ్లీతో కలిసిపోయేవారు. దీపావళి, సంక్రాంతి పండుగలు వచ్చాయంటే వయసు మరచిపోయి మాతో ఆడుకునేవారు. అన్నయ్యలతో కలిసి పతంగులు ఎగురవేసేవారు. ఇక దీపావళి టపాకాయలంటే నాన్నకెంత సరదానో చెప్పలేము. వాటిని చూసి మాకంటే ఎక్కువ సంబరపడేవారు. మాతోపాటు కాల్చేవారు కూడా. ఈ టపాకాయలకెప్పుడు నేను, మా సురేషన్నయ్య కాపలాదార్లం. కొన్నిసార్లు పంపకందార్లం కూడా. ఆ బంగారు రోజులు తిరిగి రావుకదా అని తలుచుకుంటే గుండెల్లో ఒక కమ్మటి బాధ.
మా బాల్యంలో మరచిపోలేని మధురస్మృతులంటే చిట్యాలవాగులో చేపలు పట్టడం, శ్రీశైలం అడవుల్లో షికారుకెళ్లడం, సలేశ్వరం కొండలెక్కి దిగడం… ఇలా అన్ని అనుభవాలను, సాహసా లను కూడా మా నాన్న మాకు నేర్పించారు. జీవితానికుండే కష్టం, సుఖం అనే రెండు పార్శ్వాలను ఆయన మాకు చూపించారు. కష్టపడటానికే కాదు సుఖపడటానికి కూడ పెద్ద గుండె ఉండాలన్నది మా నాన్న నుండి మేము నేర్చుకున్న ఒక జీవితసత్యం.
మా నాన్నలో నాకెక్కువగా నచ్చిన గుణం ఆయనలోని కొంటెతనం, చిలిపిచేష్టలు. ఎప్పుడు కొందర్ని ‘టార్గెట్’గా పెట్టుకునేవారు. వాళ్లకు ‘నిక్ నేమ్స్’ తగిలించి ఆటపట్టిస్తూ ఉండేవారు. ఎంత బాధలో ఉన్నా అలాంటి వాళ్లెవరైనా ఎదురైతే ఏదో ఒక జోక్ వేసి అందర్నీ నవ్వించేవారు. తనూ తేలికపడేవారు.
ఇక చివరగా రాజకీయాలు. వనపర్తి గ్రామ సర్పంచ్, మున్సిపల్ చైర్మన్ గా దాదాపు 20 ఏళ్ల సుదీర్ఘకాలం ఉన్నారు. వైద్యం, పదవి రెండు చేతుల్తో అలవోకగా నిర్వహించారు. ప్రజల మన్ననలను పొందారు.కాని ఎమ్.ఎల్.ఏ.గా ఎనిమిది ఏళ్ల కాలం ఆయన అంత సంతోషంగా గడపలే దన్నది నా భావన. ఎన్నో అభ్యుదయకరమైన పనులు నియోజకవర్గానికి చేశారు. కాని రాజకీయాల్లో ఉండే కుళ్లు కల్మషాలను జీర్ణించుకోలేక పోయారు. డాక్టరుగా అంతవరకు ఆయనను ఆరాధించినవారే ఎం. ఎల్.ఏ.గా హక్కులు చూపించటం మొదలుపెట్టారు. తనకు ప్రీతిపాత్రులైన వారిలోనూ వచ్చిన ఈ మార్పును మా నాన్న జీర్ణించుకోలేకపోయారు. అంతకంటే ముందు తన సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఇలా పదవిలోకి వచ్చానా అనే సంఘర్షణ ఆయనలో ఎక్కువగా కనబడేది. సున్నితమైన ఆయన హృదయం రాజకీయాల్లోని కాఠిన్యాన్ని తట్టుకోలేకపోయింది. ఆయన జీవితకాలంలో ఆయన ఆరోగ్యంపై ఈ ప్రభావం బాగా పనిచేసింది. మారిన కాలంలో మారిపోయిన మనుషుల విలువలను ఒక మహర్షిలా చూస్తూ మౌనంగా నిష్క్రమించారు మా బాజ్జి.
దేవుడంటే ఎవరో ఎరుగము కానీ దైవత్వం అంటే ఏమిటో తెలుసు. అది రూపుదిద్దుకున్న మా నాన్న రూపమని బాపూజీ అని మేము పిలిచినా మహాత్ముడన్నది ప్రజవాక్కు. అతను చూపిన దారే మాకు వేదవాక్కు.