మా నాన్న
డా.భూపేష్ కుమార్
వేల సంవత్సరాల రాజరికపు వ్యవస్థకు, నియంతృత్వానికి ఒక సామాన్యుడిగా ఒంటరిగా ఎదురొడ్డి నిలిచి, ఒక్కడే వేల ప్రజల నేతగా ఎదిగి మా నాన్న చేసిన పోరాటం రాజుల నిరంకుశవిధానాలను తుత్తునియలు చేసింది. ఒక మనిషి బహుముఖ ప్రతిభావ్యుత్పత్తులతో తన తరాన్ని మాత్రమే కాదు, భావితరాలను సైతం ప్రభావితం చేసి అభ్యుదయ సమాజనిర్మాత అన్న మాటకు “కొండగుర్తు”గా నిలుస్తారనడానికి మా నాన్న జీవితం ఓ తిరుగులేని ఉదాహరణ.
వేల సంవత్సరాల రాజరికపు వ్యవస్థకు, నియంతృత్వానికి ఒక సామాన్యుడిగా ఒంటరిగా ఎదురొడ్డి నిలిచి, ఒక్కడే వేల ప్రజల నేతగా ఎదిగి మా నాన్న చేసిన పోరాటం రాజుల నిరంకుశవిధానాలను తుత్తునియలు చేసింది. ఒక మనిషి బహుముఖ ప్రతిభావ్యుత్పత్తులతో తన తరాన్ని మాత్రమే కాదు, భావితరాలను సైతం ప్రభావితం చేసి అభ్యుదయ సమాజనిర్మాత అన్న మాటకు “కొండగుర్తు”గా నిలుస్తారనడానికి మా నాన్న జీవితం ఓ తిరుగులేని ఉదాహరణ.
తనదైన విలక్షణమైన శైలితో, చెప్పకనే చెప్పే సందేశాలతో మా జీవిత విధానాలపై ప్రగాఢమైన ముద్రవేసిన మహోన్నతుడు మా నాన్న. ఆ జ్ఞాపకాల దొంతరలే నా ఈ వ్యాసం.
బహుశ నా వయస్సు 8 ఏళ్ళు అనుకుంటాను, నాన్నగారితో కలిసి తోట్ల దామోదర్ రెడ్డిగారి ఇంటికి వెళ్ళాను. నేను బయటే కారుదగ్గర ఉండి పోయాను. అక్కడ ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇద్దరు పనిపిల్లలు, మరి ఒకరు ఎవరో యజమాని కొడుకు, దాదాపు నా వయస్సే. అతను నా దగ్గరకు వచ్చి ఆ ఇద్దరు పిల్లలు అంటరానివాళ్ళు. వాళ్ళని ముట్టుకోవద్దు అని అన్నాడు. నేను, వెంబడే చేసిన పని – ఆ ఇద్దరు పిల్లల దగ్గరకు వెళ్ళి వాళ్ళ బుజాలపై చేతులు వేసి పలకరించడం. దీంతో యజమానిగారి అబ్బాయి తుర్రుమని ఇంట్లోకి వెళ్ళాడు. ఆ వయసులో అంటరానితనం, వాటి లోతుపాతులు నాకు బహుశా తెలియనేమో కాని ఇప్పుడు వెనుతిరిగి ఆలోచిస్తే నాన్న మాకు చెప్ప కుండానే మమ్మల్ని ఇలా తీర్చిదిద్దడం మా అదృష్టంగా భావిస్తాం.
సాధారణంగా నేటి సమాజంలో పిల్లల్ని, భయంలో పెట్టాలి లేకపోతే వారు మాట వినరు, చెడుత్రోవ పడతారు అని పెద్దలు చెబుతారు. కాని నాన్న మమ్మల్ని తిట్టడం గాని, కొట్టడంగాని దాదాపు ఎప్పుడూ చేయలేదు. మరి ఆయన 16 మంది పిల్లల్లోను మంచి గుణగణాలు, సంస్కారం వున్నాయి. అందుకే అంటాను He has mas tered the art of behavioral Sciences even before it was born.ఆయన పిల్లల వయసుకు దిగి వచ్చి వారికి అర్థమయ్యే రీతిలో, అవసరమైన విషయాలు చేతల ద్వారా తెలియజేసేవారు.
1972 అనుకుంటాను, గడియారం గుర్తుతో మున్సిపల్ ఎలక్షన్స్ లో, కనివిని ఎరగని మెజారిటీ తో నెగ్గారు. నాకు గుర్తున్నవరకు 14/15 కౌన్సిల్ మెంబర్స్ నాన్న ప్యానల్ లో గెలిచారు. తదుపరి జరిగిన ఆ విజయోత్సవ ర్యాలీ వనపర్తి పట్టణ చరిత్రలో నభూతో న భవిష్యతే. రాజరికపు స్వర్ణ యుగంలో రారాజులకు కూడా అంతటి ఆదరణ లభించి వుండదేమో!
ఈ ర్యాలిలో ప్రజలు నోట్ల దండలు, బంగారు ఆభరణాలు ఎన్నో సమర్పించినా అన్నీ తిరిగి, ఆ ప్రజలకే ఇచ్చేసారు. అప్పుడాయనకు వున్న ఆర్థిక ఇబ్బందులకు ఈ డబ్బు ఎంతో వుపయోగపడేది కాని ఆయనలో ఆ స్వార్థం చీమంతా కూడా లేదు.
కొద్ది నెలల తరువాత, సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో, అమ్మ, చిన్నాన్న మా ఇంటి ముందు కూర్చుని వున్నారు. నేను, ఆ ప్రక్కనే నా మిత్రులతో మాట్లాడుతున్నాను. అంతలో ఎవరో అరుస్తూ పరుగున మా ఇంటికి వచ్చారు.. “అన్నను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారని” ఏడుస్తూ చెప్పాడు. ఇంతలో ఇంటి ఆవరణలో ఒక లారీ ఆగింది, 1-2 నిమిషాలలో లారీ నిండా జనం కత్తులు, కొడవళ్ళు, గొడ్డళ్లతో అరుస్తూ ఎక్కారు. లారీ చిట్యాల (మా వ్యవసాయ క్షేత్రం గలవూరు) వైపు వెళ్ళింది. దారి పొడవునా ఎక్కడ చూసినా జనం. ఆ ఏడుపులు ఆర్తనాదాలు వింటూంటే ఏదో ప్రళయం వస్తే జనాలు ప్రాణరక్షణ కొరకు వెళ్తున్నట్టుగా వుంది. అయితే అందరి దారి చిట్యాల వైపే. మేము దాసరి శంకరయ్య బావి దగ్గరకు చేరేవరకు (ఇక్కడ రెండు కాలువలు వుండేవి. దుండగులు నాన్నగారిని ఇక్కడే హతమార్చాలని పథకం వేశారు) జనాలు, వాహనాలూ అన్నీ చిట్యాల పొలిమేరకు చేరాయి. బహుశ చిట్యాల వ్యవసాయ క్షేత్రం నుండి, జూనియర్ కాలేజీ ఎదురుగా మా ఇంటి వరకు జనం సముద్రంలా వ్యాపించారు. నాన్నగారికి ఈ కుట్ర విషయం తెలియదు. మామూలుగా ఆయన తిరుగు ప్రయాణంలో వున్నారు. ఇంకా ఒక రెండు నిమిషాల ఆలస్యం జరిగితే ఘోరం జరిగిపోయోదే నేమో కాని, ఆ భగవంతుడు కారణజన్ముడైన నాన్నకు అండగా నిలిచాడు. డా.బాలకృష్ణను ఎన్నికల్లో ఎలాగూ ఓడించలేము, ఈ రకంగా అంతమొందించాలని ఆనాటి రాజరికపు వ్యక్తులు ఈ కుట్రపన్నారు.
అయితే ఆరాత్రి జరిగిన సంఘటనకు వన పర్తి ప్రజలు ఎంతో ఆగ్రహావేశాలతో ఈ కుట్రకు కారణమైన వ్యక్తుల ఇండ్లను, ఆస్తులను ధ్వంసం చేయడానికి వెళ్తుంటే వారిని నాన్న వారించి “నాపై గౌరవం వుంటే అలాంటి పనులు చెయ్యొద్దని” వారికి నచ్చజెప్పారు. మరునాడు ఈ కుట్రలో భాగమైన ఒక వ్యక్తి భార్యకి గుండెపోటు వస్తే, తానే స్వయంగా వెళ్ళి చికిత్సచేసి ఆమెను ప్రాణా పాయం నుండి కాపాడారు. ఆమెకు వైద్యం చేయొద్దని ప్రజలు ఎంతచెప్పినా వినక తన వృత్తి ధర్మం నిర్వహించారు.
కౌన్సిల్ సమావేశాలు నాకు బాగా గుర్తున్నాయి. ఏ విషయం అయినా కౌన్సిల్లో చర్చకు పెట్టి అందరి ఆమోదం పొందేవారు. తనకు వున్న మెజారిటీని ఆయన ఎప్పుడు దుర్వినియోగం చేసేవారు కాదు. ఆయనకు ఎంత సన్నిహితుడైనా ఆక్రమణల విషయంలో చాలా కఠినంగా వ్యవహరించేవారు. ఒక్క విషయంలో మాత్రం ఏకపక్షంగా వ్యవహరించేవారు – “ఎవరైనా యువకులు ఆర్థికఇబ్బందుల్లో వున్నారంటే నియమాలకు విరుద్ధంగా నైనా వారికి మున్సిపాలిటిలో ఉద్యోగం ఇచ్చేవారు. ఈ రకంగా ఉద్యోగాల్లో చేరినవారు నాకు తెలిసినవారే 25-30 మంది దాకా వున్నారు. ఇప్పుడు వారంతా ఉన్నత స్థాయిలో వున్నారు.
ఒక మున్సిపల్ చైర్మన్ గా, సర్పంచుగా పరిపాలనా వ్యవహారాల్లో పూర్తి అవగాహన, ఆధిపత్యం ఉండేది. ఉదయం నాలుగింటికి లేచి నీటి మట్టం గురించి, నీటి పంపిణీ గురించి సంబంధిత వ్యక్తులతో చర్చించి సరైన సూచనలు ఇచ్చేవారు. సిబ్బందితో సమర్థవంతంగా పనిచేయించ డమే కాకుండా వారితో ఎంతో స్నేహపూర్వకంగా మెలిగేవారు. ప్రతి స్వాతంత్య్రదినం సందర్భంగా వారికి కొత్త డ్రెస్‌లు కుట్టించేవారు. పెరుగుతున్న అవసరాల దృష్ట్యా ఆయన రామన్ పాడు వాటర్ పథకానికి ఆనాడే ప్రతిపాదించారు.
వల్లభ్ నగర్ మున్సిపల్ పార్క్, సంతబజార్, లింగిరెడ్డికుంట మరి ఇతర ప్రభుత్వ స్థలాలను కబ్జాదారుల బారినుండి కాపాడారు. నాకు బాగా గుర్తుంది లింగిరెడ్డికుంట గురించి దాదాపు 25 సంవత్సరాలు వకీలు బాల్ రెడ్డిగారితో కలిసి చట్టబద్దంగా పోరాటంచేసి అడ్వొకేట్ సుభాషిన్ రెడ్డి (ఇప్పుడు Justice of High Court) గారి ఆధ్వర్యంలో కేసు గెలిచారు. కేసు గెలిచిన తరువాత ఒక నుంచి టౌన్ హాల్‌కు రూపకల్పన చేసి ప్రభుత్వం నుండి నిధులు తెస్తే కాంట్రాక్టర్ కాలయాపన వలన ఆ నిధులు వెనక్కు మళ్లాయి.
ఇంతటి అభివృద్ధి చేసినా ఆయన అవినీతిని తన దరిదాపులకు రానివ్వలేదు. ఎవరైనా కొత్తగా వచ్చిన అధికార్లు ఇలాంటి ప్రతిపాదనలు తెస్తే వారికి చివాట్లు పెట్టడం నేను కళ్ళారా చూసాను.
వనపర్తిలో ఏదైనా సామూహిక ఆరోగ్య సమస్యలు వస్తే వెంటనే స్పందించి తగుచర్యలు తీసుకునేవారు. నాకు తేది సరిగ్గా గుర్తులేదుకాని ఒక సారి కలరా వచ్చినప్పుడు వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో వందల కొద్ది రోగులకు వైద్యం చేసారు. అదేవిధంగా వనపర్తి పాలిటెక్నిక్ విద్యార్థులు విషాహారం తిన్నప్పుడు విద్యార్థులకు వైద్య సేవలందించారు.
ఒక మున్సిపల్ ఛైర్మన్ గా ఆయన ప్రజల పరిపాలనా విషయాలే కాకుండా, వారి ఆరోగ్య, ఆర్థిక, సాంఘిక, మరియు వ్యక్తిగత సమస్యలు కూడా తీర్చేవారు. ప్రజలపట్ల ఇంత అంకితభావంతో ఉండే నాయకులు ఈరోజుల్లో ఎక్కడా అగుపించరు. అందుకే కాబోలు నాన్నగారు, వనపర్తి మున్సిపాలిటి, గ్రామ పంచాయతి బరిలో వున్న20 సంవత్సరాలు (1962-1982) ఎవరుకూడా అతనిని ఓడించలేకపోయారు. ఆవలి పక్షంలో రాజుకు సైతం అది సాధ్యపడలేదు. ఈ ఘన డు ఖ్యాతి ఎరిగేకాబోలు నాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీగారు, ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని తమసొంత దస్తూరితో లేఖ వ్రాసారు. ఈ ఉత్తరాన్ని నేను ఎన్నోసార్లు చదివాను. కాని, ఎన్నో అద్దె ఇళ్లు మార్చిన క్రమంలో ఆ ఉత్తరం ఎక్కడో కనుమరుగైంది. ఒకవేళ నాటి ప్రధాని ఇచ్చే ఆహ్వానాన్ని మన్నించి ఆయన కాంగ్రెస్‌లో చేరి వుంటే, రాష్ట్రంలో ఉన్నతస్థానాన్ని అధిగమించే వాడని కాగితాల రంగన్న చిచ్చ అనేవాడు. కాని ప్రజల కొరకు ఆయన తన సర్వస్వాన్ని ధార పోసారు. ఈ రోజుల్లో ఏవ్యక్తి అయినా ముందు తమ స్వార్థం కొరకు ఆలోచిస్తారు. కాని నాన్న ప్రతి గారిలో మాత్రం ఆ స్వార్థం చీమంతైనా కనిపించేది కాదు.
నేను ఇక్కడ వున్నప్పుడు మరియు హైద్రాబాద్ వెళ్ళిన తరువాత కూడా, సెలవు దినాల్లో ఇక్కడకు వచ్చేవాడ్ని. ప్రతిరోజూ హాస్పిటల్ కు వెళ్ళి నాన్నగారితో ఉండేవాణ్ణి. ఉదయం 10-11 నుండి మధ్యాహ్నం 3-4 వరకు దాదాపు 200-300 మంది రెడ్డి పేషెంట్స్ ని చూసేవారు. ఇదేకాక మధ్యలో ఎముర్జెన్సీ కేస్లు, కాన్పులు. ఆ మందిని ఛేదించుకుని కన్సల్టింగ్రూంకి వెళ్ళడానికి 10-15 నిమిషాలు పట్టేది. ఎంత బిజీగా వున్నా ఆయనలో చిరునవ్వు మాత్రం కరువయ్యేది కాదు. ఎవరిని కసురు కోవడం చూడలేదు. కొందరికి ఎంతచెప్పినా మళ్ళీ ధర్మసందేహాలు వచ్చేవి. ఈ మాత్రలు నీళ్ళతో వేసుకోవాలా? పాలల్లో వేసుకోవాలా? చల్ల నీళ్ళా? తెస్తే వేడినీళ్ళా? పాలతో వేసుకుంటే ఏమికాదా? అసలు ఎలా వేసుకోవాలి? కొద్దిగా లోలోనే నవ్వుకుని “నోటి ద్వారానే” అని చెప్పేవారు. ఎన్ని ప్రశ్నలైనా ఓపికతో సమాధానం చెప్పేవారు. డాక్టరు సరిగ్గా చూడలేదు అని తృప్తి చెందని కొందరు హైదరాబాద్ కో, కర్నూల్ కి వెళ్ళి వేలకొద్ది డబ్బు వెచ్చించి అక్కడి స్పెషలిస్ట్ లచే మందులు వ్రాయించుకుంటే చివరికి అవి నాన్నగారు వ్రాసిన మందులే ఉండేవి. ఒక రోగిని అత్యంత తక్కువ వ్యవధిలో పరీక్షించి ఏ పరీక్షలు లేకుండా, రోగనిర్ధారణ చేయగల వైద్యులు నా యెరుకలో ఇంకొకరు ఉండరేమో అంటే అతిశయోక్తి కాదు.
ఒకరోజు అందరు పేషెంట్లని చూశాక సాయంత్రం ఇంటికి బయల్దేరే సమయంలో ఒక బక్క చిక్కిన వ్యక్తి అస్తిపంజరం మాదిరిగా ఉన్నాడు. వచ్చి అమాంతం నాన్నగారి కాళ్ళమీద పడ్డాడు. అతన్ని చూసిన వెంటనే నాన్నగారికి ఆతని రోగంలేసి ఏమీ భయంలేదు. నేను నీకు నయం చేస్తాను అని చెప్పి (అసలు ఆ వ్యక్తి నాడికూడా పట్టలేదు) ఈ మందులు కొనమని చీటి వ్రాసారు. ఆ వ్యక్తి మళ్ళీ కాళ్ళపై బడ్డాడు. ఏంటీ అంటే ‘దొరా నాతో డబ్బులు లేవు. నీవే లేవు. నీవే నన్ను కాపాడాలి’ అని అన్నాడు. ఒక్క క్షణం ఆగి రాములు చిచ్చని పిలిచి ఫలనా మందుల షాపులో ఈతనికి మందులిప్పించి నా ఖాతాలో వ్రాయమని చెప్పారు. ఆ వ్యక్తి ఇంకా ఏడుపు ఆపలేదు ఏంటి అని అడిగితే రోగం నయం చేస్తానన్నావు. మందులిప్పించావు కాని నాతో తినడానికి కూడా డబ్బుల్లేవు అని అన్నాడు. అతనిని వెంటనే కారులో ఎక్కించుకుని ఇంటికి తీసుకుని వచ్చి తనతో పాటు భోజనం ఏర్పాటు చేసారు. అంతేకాదు ఈయనకు మూడుపూటలు భోజనం ఏర్పాటు చేయాలని అమ్మతో చెప్పారు. అతి కొద్దిరోజుల్లోనే ఆ వ్యక్తి ప్రాణాపాయస్థితి నుండి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తన స్వస్థలానికి వెళ్ళాడు. ఆ పిమ్మట కాంగ్రెస్ ఓ ముఖ్య కార్యకర్త అయి అసెంబ్లీ ఎన్నికల్లో నాన్న ఓటమికి ప్రధాన కారకుడయ్యాడు. అయితే మళ్ళీ రెండు పర్యాలు అతను ప్రాణాపాయస్థితిలో వుంటే నాన్నే కాపాడారు. అయినా ఆ వ్యక్తికి నాన్న త్యాగం పట్ల అసలు కృతజ్ఞత లేకుండేది మరి నాన్నగారికేమో ఈతని పట్ల ద్వేషం కాని, కోపం కాని ఉండేది. కాదు. అలా శత్రువుకు కూడా ప్రాణదానం చేసి ప్రేమించే గొప్పమనసు ఈ లోకంలో ఎంత మందికి వుంటుందో మన మాలోచించాల్సిన విషయం.
ఒకరోజు హాస్పిటల్ చాలా బిజీగా ఉన్న సమయంలో ఏదో పల్లెనుండి ఒక స్త్రీని ఎడ్లబండిలో తీసుకొని వచ్చారు. ఆమె శరీరం అంతా పచ్చగా ఉంది. ఆమె తీవ్ర పచ్చకామెర్ల వ్యాధితో అవసాన దశలో వుండింది. అప్పటికే ఆమె కౌరంపేట, కేశంపేట ఎక్కడెక్కడో తిరిగి వచ్చింది. ఆమె ఎట్టి పరిస్థితుల్లోను బ్రతకదని అక్కడ వైద్యులు చెప్పారట. నాన్నగారు ఆమెను పరీక్షచేసి వాళ్ళ మనుషు లతో ఏమీ భయం అఖ్కర్లేదు. ఒక వారం రోజుల్లో ఈమె తిరిగి మామూలుగా అవుతుందని చెప్పి, మందులు వ్రాసారు. ఆ సమయంలో ఆమె బ్రతుకుతుందని ఏమీ ఆశలు లేకున్నా కుటుంబ సభ్యులు నాన్నగారు వ్రాసిన మందులు తెచ్చారు. అయితే నాన్న చెప్పిన విధంగా సరిగా వారం రోజుల్లో ఆమె రోగం నయమైపోయింది. నాన్నకు అన్ని వ్యాధుల పట్ల, వాటి తీవ్రతపట్లసంపూర్ణ అవగాహన ఉండేది. నేను లండన్ వెళ్ళిన తరువాత కూడా ఎన్నోమార్లు ఆలోచించాను. ఈ లండన్ నగరంలో ఏ వ్యాధినైనా కనుగొనడానికి ఇన్ని పరీక్షలు చేస్తారు. మరి ఏ పరీక్షలు లేకుండా అంత ఖచ్చితంగా చెప్పడంలో నాన్నగారికి వున్న పరిజ్ఞానం గురించి గర్వపడేవాడ్ని. ఆయన ఫరవాలేదు. ఏమి కాదంటే ఎంత సీరియస్ గా వున్న పేషంట్కైనా ఏమీ కాదన్నది మా అనుభవం. మొదటినుండి నాన్నతో సన్నిహితంగా మెలగడం వల్లనేమో ఆయన వైద్యం తీరు నాకు అబ్బిందని అప్పుడప్పుడు నన్ను నేనే అభినందించుకుంటాను. ఆయననుంచి వచ్చిన ఈ నైపుణ్యాన్ని వనపర్తి, పాలమూరు ప్రజల సేవ కొరకు ఉపయోగిస్తున్నం దుకు ఎంతో తృప్తిగా ఉంది. ఇంగ్లండ్ లో లక్షలు సంపాదించినాగాని ఈ సంతోషం కలగలేదు
మరొక సంఘటన. అది ఎలక్షన్ టైమ్ మా పెద్దక్కయ్య డా. సుచరిత, బావగారు డా.యం.పి. జగన్ మోహన్ నాన్నగారి హాస్పిటల్లో పనిచేస్తున్న ఆ సమయంలో రామచందర్ చిచ్చ కాలికి తెగిన నరంతో (బండనిరిగి కాలు కాలువలో ఇరికి కాలికి వెనకభాగంలో ఉన్న పెద్ద నరం Achillies Ten- don తెగిపోయి) హాస్పిటల్ కు వచ్చాడు. అతనిని పరీక్షించి బావగారు దీనికి Operation చేయడానికి ఇక్కడ పరికరాలు లేవు. వెంటనే Hyderabad తీసుకొని వెళ్ళకపోతే కాలు తీసివేయాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే వెంటనే హైద్రాబాద్ తీసుకెళ్ళు అని చెప్పారు. అయితే రామచందర్ చిచ్చ మా అన్న (డా.బాలకృష్ణయ్య) చూసిం తరువాతే నేను వెళ్తాను అని చెప్పాడు. నాన్నగారు మరునాడు వచ్చి చూసి మామూలు సిల్క్ దారం స్టెరిలైజ్ చేసి సూదితో ఆ నరాన్ని కలిపి కుట్టేసి, దానిపై ప్లాస్టర్ వేసి 6 వారాలు కాలు కదపకు అని చెప్పారు. మా బావగారికి మాత్రం పాపం రాంచందర్ కాలు పోయే ప్రమాదం వుంది అని బాధగా వుండింది. 4 వారాలకే రాంచందర్ చిచ్చ నడవడం ప్రారంభించాడు. అతని కాలు మామూలుగా అతికి ఇప్పటికీ ఏ సమస్యలేదు. బావమాత్రం వనపర్తికి వచ్చిన ప్రతిసారి రాంచందర్ చిచ్చని పిలిపించి ప్రత్యేకంగా పరీక్షించే వాడు. అంతా మామూలుగా అతికిన కాలుని చూసి ఆశ్చర్యపడి రాంచందర్ చిచ్ఛతో, నీవు మా నీలోఫర్ హాస్పటల్ కు వస్తే అక్కడి స్పెషలిస్టులకు నీ స్టోరీ చెబుదాం అన్నాడు.. అదేవిధంగా రాంచందర్ చిచ్చ నీలోఫర్ వెళ్ళి తన కథ అంతా చెబితే వాళ్ళు పరీక్ష చేసి “What a wonder, Unbelievable” (, శక్యంగా లేదు) అని అన్నారట. మరి నాన్న అమృతహస్తవాసి అంటే ఇదేనేమో! నేను మెడిసిన్ చదువుతున్న కాలంలో ఆలోచించేవాడిని ముఖ్యంగా గైనాబ్ ప్రాబ్లమ్స్. అప్పుడు ఇక్కడ కడుపులో పాప అడ్డంగా వుందని, తల పైకి వుందని ఏవో కారణాలు చెప్పి సిజేరియన్ ఆపరేషన్లు చేస్తున్నారు. మరి నాన్న ఈ కేసులన్నీ, వనపర్తిలో ఏ వసతులు లేకుండా, ఏ ఆపరేషన్లు లేకుండా సమర్థవంతంగా ఎలా చేయగలిగేవారో నని ఆశ్చర్యం వేసేది. మరి నాకు గుర్తున్నంత వరకు ఏ స్కాన్ లేకుండానే ఆయన ఈ విష యాలు కచ్చితంగా నిర్థారించేవారు. అతికొద్ది మందిని నూటికి ఇద్దరు లేక ముగ్గురిని మాత్రమే హైదరాబాద్ కు రిఫర్ చేసేవారు.
నేను లండన్‌లో ట్రైనింగ్ పూర్తి చేసిన తరువాత గత సంవత్సరం ఇండియాకు వచ్చి నవంబర్ 15న వనపర్తి బ్రాహ్మణవీధిలో హాస్పిటల్ మళ్ళీ ప్రారంభించాను. అనుకోకుండా మండల స్థాయి మెగామెడికల్ క్యాంపులు నిర్వహించడం జరిగింది. తదనంతరం ఎం.ఎల్.ఎగా పోటీ కొరకు రాజకీయ ప్రచారం కూడా చేయడం జరిగింది. ఈ పరంపర లో నేను, ఏ ఊరు వెళ్ళినా ప్రజలు మా దేవుని కొడుకు వచ్చాడని ఎంతో ఆదరించారు. అంతే కాదు మీనాన్న మా కొడుకు ప్రాణం కాపాడాడు, మా తల్లి ప్రాణం కాపాడాడు. అని ఇలా వందల కొద్ది జనాలు నాన్నగారిని కొనియాడడం నాకు ఎంతో గొప్పగా, గర్వకారణంగా అనిపించింది.
నేను, నాన్నగారి మార్గంలో నడవడానికి తిరిగి నేను రావడం, అదే పద్ధతిలో వైద్యసేవలు అందించ గలగడం నిజంగా నా అదృష్టంగా భావిస్తాను.
నాన్న అమెరికా వెళ్లినప్పుడు అనారోగ్య కారణంగా అక్కడి ఆస్పత్రికి తీసుకెళ్లటం జరిగింది. అక్కడి డాక్టర్లు అలవాటు ప్రకారం ఏవేనో వైద్య పరీక్షలు జరిపే ప్రయత్నంలో ఉండగా నాన్న “నా ఆరోగ్యపరిస్థితికి ఈ పరీక్షలన్నీ చేయనవసరం లేదు. మీరెందుకిలా చేస్తున్నా”రని వాళ్లని నిలదీశారు. వారి మాట వినకపోవడంతో చివరికి అక్కడి చీఫ్ మెడికల్ ఆఫీసర్ వచ్చి మా అన్నయ్య సురేష్ కుమార్ ద్వారా పలువిధాలుగా అంగీకరింపజేస్తే గాని నాన్న పరీక్షలకు ఒప్పుకోలేదు. అలాంటి అనారోగ్యస్థితిలో కూడా వైద్యం పట్ల ఆయనకున్న సాధికారతను ఈ సందర్భం రుజువుపరుస్తుంది. నాన్నగారి వైద్యం గురించి చెప్పినప్పుడు, ఆయనతో పనిచేసిన వారిగురించి తెలపడం కూడా అవసరం కంపౌండర్ రాములు చిచ్చ, చిన్న నాటినుండి నాన్నతో వుండి కంపౌండరీ నేర్చుకున్నాడు. ఎంతో ఓర్పు, నేర్పు, సహనం ఎంత పని వత్తిడిలో వున్నా నవ్వుతూ అందరిని సమాధానపరిచేవాడు. నాన్నలేని సమయంలో ఆయన ఆలో సమర్థవంతంగా పేషంట్స్ కి ట్రీట్మెంట్ ఇచ్చేవాడు. నాన్న హాస్పిటల్ సాయంత్రం 3-4 దని, అయ్యేది. రాములు చిచ్చ ఆ తరువాత పేషంట్స్ ఇండ్లకు వెళ్ళి ఇంజెక్షన్స్ ఇచ్చేవాడు. ఏ రాత్రి లేపినా , ఒక్కనాడు కూడా విసుక్కునేవాడు కాదు. ఆయన అకాలమరణం నాన్నను క్షోభకు గురిచేసింది. కంపౌండర్ శ్యామ్ చిచ్చ మితభాషి, సౌమ్యుడు. రాములు చిచ్చ పట్టణంలో ఒకవైపు వెళ్తే, శ్యామ్ చిచ్చ వేరేవైపు వెళ్ళి ఇంజక్షన్లు ఇచ్చేవాడు. సుందరమ్మ, నాన్నగారితోనే ఉద్యోగం మొదలు పెట్టి ఆయన తదనంతరం కూడా హాస్పిటల్ కు వచ్చేది. కాన్పులు చేయడంలో సిద్ధహస్తురాలు. సత్తార్ సాహబ్ కథల్లో చదివినట్టు హకీంసాబ్ లా ఉండేవాడు. తెల్లటి కుర్తా, సైజమా, మెరూన్ కలర్ నవం మళ్ళీ కుచ్చుటోపి ప్రత్యేక వ్యక్తిగా అగుపించేవాడు. నాన్నగారు ఇంట్లో వున్నప్పుడు పేషంట్స్ కి అడ్డంకులు వుండేవి కావు, మాకు ప్రైవసీ ఉండేది కాదు. ఆయన ఎక్కడవుంటే అక్కడ గుమికూడేవారు.
మరియు ఇతరత్రా సాంఘిక అంతే సంక్షేమ పరిపాలనా వ్యవహారాలతో బిజీగా ఉండే నాన్నగారు విశ్రాంతి కొరకు షికారుకు వెళ్లేవారు. మాకు షికారు అంటే మహా ఇష్టంగా ఉండేది. పేరుకు షికారేకాని సౌదలు, కోళ్లు, గుడ్లు వగైరా ఇక్కడి నుండే తీసుకుని శ్రీశైలం అడవులకు 2-3 రోజులు వెళ్ళేవారు. అయితే పోయిన ప్రతిసారి ఆయన ముఖ్య సహచరులైన బలరాం, నారా యణ, ఘని, గౌసు, ఖాజా, ఉస్మాన్, బాలయ్య, బాబర్, చాంద్, బాబు కాంట్రాక్టర్, లచ్చి, రాముడు, వెంకట్రాములు, గోపాల్ పేట రాముడు. సత్యనారాయణరెడ్డి, వెంకటరెడ్డి, జీవన్ ఆయ నతోపాటు ఉండేవారు. కారు వనపర్తి పొలిమేర దాటినప్పటి నుండి తిరిగి వచ్చేవరకు ఎడతెరపి లేకుండా నవ్వులే ఉండేవి. ముఖ్యంగా రంగన్న చిచ్చ జోకులు, సూక్తులు, పద్యాలు, పాటలు అందరిని ఎంతో అలరించేవి. ఆయన దైనందిన జీవితంలో భాగమైన సేవాకార్యక్రమాలలో భాగం గా అడవిలో చెంచులకు బట్టల పంపిణి, అక్షరాభ్యాస ప్రయత్నం, మెడికల్ క్యాంప్, ఉచిత మంద ల పంపిణీ చేసేవారు. ఇక్కడ వున్నట్టే పేషంట్లు అడవిలో కూడా ఉండేవారు. వారిలో సాంఘిక అవగాహన, వేషభాషల్లో తగిన మార్పులు, విద్యాభ్యాసం, వారి కనీస అవసరాల అభ్యున్నతి విషయా లలో ఎంతో కృషి చేశారు. అక్కడ వాళ్ళ పిల్లలకు స్కూల్ ఏర్పాటుచేసి, ఇక్కడి నుండే ఒక టీచర్‌ను ఏర్పాటుచేసి, వారి విద్యను పెంపొందించారు. నీటి వసతి కల్పనకు ఎంతో కృషి చేశారు. నాన్న కారు చూస్తూనే వారికి ఎంతో ఆనందం కలిగేది. వారికి అన్నం అంటే మహా ప్రాణం. పట్టెడు మెతుకుల కొరకు ఏదైనా చేసేటట్టు అనిపించేవారు. ఆయనకు వనపర్తిలో వైద్యమే మరి ఇక్కడకు వచ్చినా అదే పోకడ. మరి విశ్రాంతి ఎప్పుడు దొరికేదో అర్థం అయ్యేది కాదు. బహుశ తన ఆశయాలు పంచుకునే మిత్రులతో నాన్నకి కాస్త శారీరక, మానసిక ఉపశమనం కలిగేదేమో మరి.
నాన్నగారు ఒక సాయంత్రం వయోజన విద్య కార్యక్రమానికి వెళ్ళేవారు. ఎందరో యువకులని ప్రోత్సహించేవారు. మరురాత్రి హరిజన వాడలో బడి ప్రారంభం. ఇంకొక రోజు కూరగాయల మార్కెటును స్కూల్ మార్చిన కార్యక్రమం. ఆ తరువాత దినం తెలుగువాడ స్కూల్ ప్రారంభం ఆ మరుసటి దినం కడుకుంట్లలో ఉన్నత విద్యాలయం. చిట్యాలలో స్కూల్ ప్రారంభం. ఇలా అహర్నిశలు విద్యాభివృద్ధికి కృషి కృషి చేసారు. మన దుర్భర ఆర్థిక పరిస్థితికి, రాజకీయ, సాంఘిక వెనుకబాటుతనానికి విద్యలేమి మూలం అని ఆయన గ్రహించారు. అందుకే విద్యాభివృద్ధికి ఎడతెరపి లేకుండా కృషి చేసారు. ఆయన కృషి వల్లనే నేడు వనపర్తి ఒక సరస్వతీ కేంద్రంగా మారింది. ఎందరో వున్నత విద్యలు చదివి ఇవ్వాళ గొప్ప స్థానాలకు ఎదిగారు. సర్పంచ్ గా ఉన్నప్పుడు, తరువాత ఎం.ఎల్.ఎ అయిన తరువాత కూడ విద్యాలయాల స్థాపనకు ఎనలేని కృషి చేసారు.. నాన్న నిరంతర అధ్యయనశీలి. తన 36వ ఏట సంస్కృత పఠనం మొదలు పెట్టి అయిదు, ఆరునెలల్లోనే దానిపై మంచి పట్టు సంపాదించారు. దీనితోపాటు సాహిత్యాధ్యయనం కూడా మొదలు పెట్టారు. కార్ల్ మార్క్స్, మావో, లెనిన్‌కు సంబంధిం చిన ఎన్నో పుస్తకాలు చదివేవారు. మాక్సిమ్ గోర్కి అమ్మ, వోల్గా సే గంగా పుస్తకాలు మరియు ‘సృజన’ రెగ్యులర్ గా చదివేవారు. తాను చదవడమే కాకుండ తన పిల్లలను, మరియు విద్యార్థులను ఎంతో ప్రోత్సహించేవారు.
సుదీర్ఘ మునిసిపల్ పరిపాలన తరువాత తెలుగుదేశం ఆవిర్భావంతో 1982లో రాజకీయా లలో మార్పు వచ్చింది. ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన తొలిరోజుల్లో అమ్మ నాన్నగారితో అంది ‘మీరు తెలుగుదేశంలో చేరితే బాగుంటుంది’ అని. ఆ మాటకు నాన్నగారికి చాలా కోపం వచ్చింది. ఒక బూర్జువా పార్టీలో నన్ను చేరమంటావా అని అడి గారు. కానీ ఆ తరువాత రామారావుగారి ప్రవర్తనా శైలి, నిరాడంబరత, కార్మిక, కర్షక, బడుగు, బలహీన, మైనారిటీవర్గాల పట్ల ప్రదర్శించిన వైఖరి, నక్సలిజం అనేది ఒక సాంఘిక సమస్యగా గుర్తించి నక్సలైట్లను దేశభక్తులుగా చిత్రీకరించడం వంటి విషయాలు సహజంగానే రామారావుగారి పట్ల నాన్నకి గౌరవభావాన్ని పెంచాయి. ఇవన్నీ ఉన్నా తన సిద్ధాంతాలకే విలువనిచ్చి ఆ కొత్తపార్టీలో చేరలేదు. అయితే సన్నిహితమిత్రులు, సలహాదారులు, ముఖ్యంగా డా. విజయమోహన్ రెడ్డి గారు, నాన్నతో ఒక విషయం చెప్పారు. ‘నీవు ప్రజల మనిషిని. ప్రజాసేవయే నీకు పరమార్థం మరి నీకు నీ బలాన్ని రెట్టింపు చేసే అవకాశం దొరుకుతుంది. ప్రజాశ్రేయస్సు కొరకు ఈ అవకా శాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పారు. చివరికి ఆయన మాట మేరకు టిడిపిలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేశారు.
ఈ ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది. దేశచరిత్రలోనే మొదటిసారిగా సరికొత్త రాజకీయ ప్రచార సాధనాలు వాడుకలోకి వచ్చాయి. వీటితోపాటు వనపర్తి ఒక అడుగు ముందు వేసి సైకిల్‌ర్యాలీ, మోటార్ సైకిల్ ర్యాలి నిర్వహించింది. మిత్రులు, కార్యకర్తలు, యువతరం మరియు అన్నివర్గాలవారు ఎంతో ఉత్సాహంగా పనిచేసి,నాన్నగారి విజయానికి దోహదపడ్డారు. ఈ విజయం వనపర్తి నియోజకవర్గానికే ఒక గొప్ప అదృష్టంగా భావిస్తారు. నాన్నగారికి ఉన్న సేవాభావం, అంకితభావం ఆయనకు మంచిపేరు తెచ్చిపెట్టాయి. నియోజకవర్గ అభివృద్ధికి ఆయన నిరంతర కృషి చేశారు.
ఈ మధ్యకాలంలో నేను పల్లెలో తిరిగినప్పుడు ప్రజలు నన్ను ఎంతో ఆదరించారు. ఆదరించడమే కాకుండా ఇదిగో మీ నాన్నగారు మా ఊరికి కట్టించిన స్కూల్ భవనం, పాఠశాలను అప్ గ్రేడ్ చేయించారనె, మా ఊరికి తాగునీటి వ్యవస్థ మీ నాన్నవల్లే వచ్చిందని, పక్కా ఇళ్లు మీ నాన్నే తెచ్చారని, ఈ ఊరికి కరెంట్ మీ నాన్నవల్లే వచ్చిందని, ఈ ఊరికి బస్సు నడవడం మీ నాన్న పుణ్యమే అని ఇలా… ప్రతీ ఊళ్లో నాన్నగారిని వేనోళ్ల కొనియాడారు.
ఇన్ని అభివృద్ధి పనులు చేసినా ఆయన హంగు , ఆర్భాటాలకు పోలేదు. మురికికాల్వలకు కలెక్టర్లచే శంకుస్థాపన చేయించలేదు. ఆయన చేసిన పనులకు ఇలా శంకుస్థాపనలే చేయాలి అని అనుకుని ఉంటే శంకుస్థాపనల రాళ్లతో నేడు వనపర్తి నియోజకవర్గం చుట్టూ చైనానాల్ లాంటి గొప్ప ప్రహరీగోడ తయారయ్యేది.
నియోజకవర్గ ప్రజలతోకాని, కార్యకర్తలతో కాని ఆయన ఎంతో సన్నిహితంగా ఉండేవారు. ఆయన దగ్గర వెయిటింగ్ అనే పదమే లేదు. సమయసందర్భాలకు అతీతంగా ఆయన ఇంట్లో, హాస్పిటల్లో ఎక్కడ ఉన్నా ప్రజలు సరాసరి ఆయన పట్ల దగ్గరకే వచ్చేవారు.
ఒకసారి నాన్న ఒక విద్యుత్ శాఖ అధికారి పని మీద హైదరాబాదు రావాల్సి వచ్చింది. పెట్రోలుకు డబ్బులు లేనందున బస్ వచ్చారు. విద్యుత్ సౌధ వెళ్లి అప్పటి చైర్మన్ తాతారావు గారితో కలిసి సదరు ఉద్యోగి పని చేయించి పెట్టారు. కిందికి వచ్చిన తరువాత “డాక్టరుగారు నేను వెళ్తాను మరి” అని చెప్పి ఆ వ్యక్తి వెళ్లిపోయాడట. నాన్నగారి జేబులో అయిదు పైసలు కూడా లేవుట. గత్యంతరం లేక విద్యుత్ సౌధ నుండి పాత ఎమ్మెల్యే క్వార్టర్స్ వరకు నడుచుకుంటూ వచ్చారు. ఇంటికి వచ్చిన తరువాత నాన్న ఆరోగ్య పరిస్థితి చూస్తే ఎంతో దుఃఖం కలిగింది. ఈ విషయం తలుచు కుంటే ఇప్పటికీ కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి.
ఆయన పిల్లలుగా ఆయన ఆర్థికస్థితికి మేము ఆనాడు దుర్భరజీవితం గడిపినా ఆయన పుణ్యఫలానికి మేమందరం ఈరోజు మంచి హోదాల్లో ఉన్నాం. ఆయన సంతానంగా జన్మించడం మేము జన్మజన్మలకు చేసుకున్న పుణ్యం అని అనిపిస్తుంది.
అయితే నాన్న జీవితం గురించి ఆలోచిస్తే కొన్ని విషయాలు బాధ కలిగిస్తాయి. ఆయన ఎన్ని అభివృద్ధిపనులు చేసినా, ప్రజలతో ఎంత సాన్నిహిత్యంగా ఉన్నా ప్రజా సమస్యలకు ఆయన జీవితం అంకితం చేసినా 1985 తరువాత చోటు చేసుకున్న పరిస్థితులు ఆయన్ని మానసికక్షోభకు గురిచేశాయి.
1985లో నాన్న రెండవసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల సమయం నుండే ఆయ నకు వ్యతిరేకంగా ఒక కోటరీ పనిచేయడం ప్రారంభించింది. వాస్తవానికి ఈ ఎన్నికల్లోనే ఆయనకు పార్టీ టికెట్ రాకుండా యత్నించినా, మైసూర్ క్యాంప్ లో నాన్నగారు ఎన్టీఆర్ ప్రత్యేక ప్రశంస లందుకోవడం వల్ల వారి ఆటలు సాగలేదు.
కానీ ఎం.ఎల్.ఏగా ఎన్నికైన తరువాత తను దోవన తాము బలం పుంజుకోవడం ప్రారంభిం. చారు. ఎత్తులు, పైఎత్తులు, లౌక్యం తెలియని నాన్న తన దారిన తాను ప్రజలకోసం పని చేయ డంలో ఈ కుట్రలను గుర్తించలేకపోయారు. కోటరీ పార్టీ శ్రేణులపై పూర్తిగా పట్టు సాధించింది. ఒక వ్యూహాత్మకంగా నాన్నపై దుష్ప్రచారం చేయ నారంభించారు. మరోవైపు నమ్మినవారనుకున్న వారు అవకాశవాదులై ద్రోహం తలపెట్టారు. నాన్న భోళాతనాన్ని, విశ్వాసాన్ని స్వప్రయోజనాలకు వాడు కుని వెనుక గోతులు తవ్వనారంభించారు. చివ రకు లోకాయుక్తలో ఫిర్యాదులు వచ్చినా నిలువ లేదు. నాన్న నిజాయితీ నిస్వార్థాలే ఆయన్ను నిర్దోషిగా నిరూపించాయి.
“ఒకవేళ నాన్నే గనుక ఈ రాజకీయాలను, పదవులను అడ్డు పెట్టుకుని సంపాదించాలను కుంటే కోట్లకు పడగలెత్తడమే గాదు, ఈరోజు మా కుటుంబమే ఇక్కడి నుండి అసెంబ్లీకి ప్రాతి నిధ్యం వహించేది.
1989ల ఎన్నికల్లో మళ్లీ నాన్నకు టికెట్ రాకుండా మోకాలడ్డారు. ఒక దశలో మరొకరికి టికెట్ ఖరారై పోయింది. నిగ్గదీయలేని నాన్న దిగాలుపడి ఇంటికి వచ్చారు. నాన్నను విషయం అడిగా ఏమైందని, “మనకు రాలేదు బాబూ వేరే వాళ్ళకిచ్చారు” గాయపడ్డ హృదయంతో అన్నారు. ఇదంతా అర్థం కానీ నేను నాన్నను వెంట తీసుకుని రెండుసార్లు వరుసగా సిట్టింగ్ ఎమ్మెల్యేవైన నీకెలా టికెట్టివ్వరని ఏకంగా వెళ్లి ఎన్టీఆర్ nu అడిగాం. ఆయనతో ఏడేళ్ల డెవలప్మెంట్ను పూర్తిగా చెప్పాం. 1983, 1985లో వరుసగా 4000, 12000 వేల మెజారిటీ వచ్చి బలం పెరిగిందని వివరించాం. చివరికి ఎన్టీఆర్ అందరినీ కాదని టిక్కెట్టిచ్చారు. కోటరీ ఊహించినట్లుగాక నాన్న వచ్చి వనపర్తిలో నామినేషన్ వేశారు. ఆ మరునాడు నాన్న ఎప్పటిలా హాస్పిటల్ ku వెళుతున్నారు. నాకు అర్థం కాక “అదేమిటి మన మివ్వాళ ప్రచారానికి వెళ్లాలి గదా” అన్నాను. “ఎలా వెళతాం బాబూ పెట్రోలికి డబ్బులు లేవు” అని ఆయన సమా ధానం.
ఏడు సంవత్సరాలు ఏకబిగిన ఎం.ఎల్.ఏ.గా పనిచేసిన నాన్న 1989 ఎన్నికల నాటికి ప్రచారానికి డబ్బులు లేని స్థితిలో ఉన్నారు. అలా స్వలాభం చూసుకోకుండా ప్రజాసేవ చేసిన నాన్నకు వ్యతిరేకులు తయారైనారు.
స్వంతపార్టీ అగ్రనాయకులే పార్టీ విజయానికి గండికొట్టి విపక్షం గెలుపుకు ఉద్దేశపూర్వకంగా బంగారు బాటవేశారు. వీటన్నింటికీ నేను మూగ సాక్షిని. అప్పుడు నాన్నతో వీరందరి గురించి ఏ మాత్రం వ్యతిరేకంగా మాట్లాడలేని స్థితి.
వనపర్తి ప్రజలకోసం అహర్నిశలు శ్రమించి అభివృద్ధి చేసిన నాన్న తనవారి వల్లనే ఓడిపో యారు. ఇది ప్రజలు ఓడించింది కాదు. అవకాశవాదుల కుట్ర ఫలితంగా జరిగింది. నాన్న ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోయారు. పార్టీలోని కొందరు స్వార్థపరులు పరాయివారై ద్రోహం చేశారు. అప్పుడు గాని ద్రోహం ఏ ముసుగులో ఉందో ఊహించలేకపోయారు. అయినా నాన్న రోగుల సేవలో మరో అయిదేళ్లు గడిపారు. కానీ మోస పోయినవేదనే ఆయన ఆరోగ్యాన్ని కృంగదీసింది. అయితేనేం ఆయన వనపర్తిని తన ఆత్మగా భావించారు. వారికోసం నిరంతరం తపిస్తూనే తన చివరి రోజులను గడుపుతూ అంతిమశ్వాస విడిచారు. నాన్న అంత్యక్రియలకు వనపర్తి పట్టణంలో వేలాదిమంది పాల్గొనడం అందరికీ తెలిసిందే కాని, సాధారణంగా ముస్లిం కుటుంబాల్లో అంత్యక్రియలకు మహిళలు గడపదాటి బయటకు రారు. అయితే నాన్న మరణం చాలామంది ముస్లిం మహిళలను తమ సొంత సోదరుడి మరణంకన్నా ఎక్కవగా బాధకు గురిచేసి స్వయంగా వారే అంత్యక్రియల్లో పాల్గొన్నారు. వనపర్తి పట్టణంలో మొదటి సారిగా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగడం నాన్నగారికే మొదటిసారి,
బీద, బిక్కి, దరిద్ర నారాయణుల సేవలోనే తన జీవితాన్ని పునీతం చేసుకున్న నాన్న భౌతికంగా నేడు మన మధ్యలేరు. కానీ ఆయన ఆదర్శం ఇంకా సజీవంగానే ఉంది. మా నాన్న ఆదర్శమే నా ఆశయం.