dr. balakrishnaiah wanaparthy

ప్రజల మనిషి
డాక్టర్ బాలకృష్ణయ్య.

తెల్లటి చొక్కా, నల్లటి ప్యాంటు, మెడలో స్టెతస్కోపుతో తిరిగే మనిషిని ఎవరైనా అట్టే గుర్తుపట్టగలరు. చాలామంది ధనవంతులు కేవలం బాత్రూమ్ కొరకు మాత్రమే వాడే స్లిప్పర్లు వేసుకొని, చెంపల పైన, చెవుల క్రింద అడ్డదిడ్డంగా పెరిగిన వెంట్రుకలను ఖాతరు చేయని విధంగా షేవ్ చేసుకొని, బాహ్య రూపానికి ప్రాముఖ్యత ఇవ్వక, పనియే పరమాత్ముడు అని అనుకునే అతనికి ఆ రూపం అడ్డంకి కాలేదు సరికదా, ఆ తెల్లచొక్కా, నల్ల ప్యాంటుకు ఒక గ్లామర్‌ను ఆపాదించాడు అతడు. డెబ్బై ఏళ్ల సుదీర్ఘ జీవితంలో పదేళ్లు బాల్యం, పదేళ్లు వృద్ధాప్యానికి మినహాయిస్తే మిగిలిన యాభై ఏళ్ల ఆయన జీవితం వనపర్తి ప్రజల జీవితాలతో పెనవేసుకుపోయింది.

 20వ శతాబ్దపు తొలివాళ్లలో హైదరాబాద్ రాష్ట్రంలో ఒక భాగమైన వనపర్తి సంస్థానంలో, ఈ సంస్థానంలో పనిచేసే మహదేవయ్య-సంజమ్మ దంపతులకు 1924 నవంబర్ 15న బాలకృష్ణయ్య జన్మించాడు. తానే పెద్దవాడు. వీరికి ఒక తమ్ముడు, ఒక చెల్లెలు.

సంస్థానాల నాటి రోజుల్లో రాజ్యం, భూమి, చదువు ఈ మూడు పరిపాలించేవారి సొత్తులు గానే చెలామణి అవుతుండేవి. పాలితుల్లో భాగమైన అనేక కుటుంబాలు సంస్థానం పరిపాలనా నిర్వహణలో భాగంగా సైన్యంలోనూ, రాజులు దేవిడీల్లోనూ, పనిచేయగా మిగిలినవారు తమతమ వృత్తుల్లో జీవిస్తున్న కాలమది. ఆనాటి సమాజంలో రాజ్యాధికారం, చదువు, ఆస్తుల్లో ఏ ఒక్కటి కూడా పాలితులు కలలోనైనా ఊహించని విషయాలు, జిల్లాలోని ఇతర సంస్థానాల చరిత్రను ఏ మాత్రం అధ్యయనం చేసినా కొల్లాపూర్, జటప్రోలు, గద్యాల వనపర్తి వంటి సంస్థానాల్లో పాలకులు తమ పరిపాలన కోసం చదువుకున్నవారిని అటు కాళహస్తి, ఇటు పశ్చిమగోదావరి నుండి తీసుకొని వచ్చిన వైనం గోచరిస్తుంది. అంతేగాక ఆనాటికి వనపర్తి, మహబూబ్ నగర్లలో జిల్లా మొత్తానికి రెండే ఉన్నత పాఠశాలలు నెలకొని ఉన్నవి. ఈ పరిస్థితుల్లో చిరుద్యోగులైనవారు తమ సంతానాన్ని విద్యావంతుల్ని చేయాలనుకునే అవకాశం అరుదు. ఇటువంటి సామాజిక పరిస్థితుల్లో నాడు తమ పిల్లలకి చదువుసంధ్యలు చెప్పించి విజ్ఞానవంతుల్ని చేయాలనే సంకల్పంతో బాలకృష్ణయ్యను మహదేవయ్య, సంజమ్మ దంపతులు విద్యాభ్యాసం కోసం వీధిబడికి పంపారు. హైస్కూల్ వరకు ఆయన చదువు వనపర్తిలో సాగింది. సంస్థానం నెలకొల్పిన ఈ హైస్కూల్‌లో ప్రధానోపాధ్యాయులుగా ఉన్న వేంకటేశ్వరరావు విద్యార్థులకు ఉత్తమ నైతిక విలువలను బోధించేవారు. వారాంతంలో ఈ విద్యార్థులను గ్రామాలకు తీసుకువెళ్లి వీధులను శుభ్రపరిచే కార్యక్రమంలో పాల్గొనేలా చేశారు.

సిటీ కాలేజీలో బాలకృష్ణయ్య ఎఫ్.ఏ. పూర్తి చేసే నాటికి దేశంలో స్వాతంత్ర్యోద్యమం ఉద్ధతంగా కొనసాగుతోంది. ఈ తరుణంలో నైజాం రాష్ట్రంలో తెలుగుజాతి సాంస్కృతిక పునరుజ్జీవనానికి మాడపాటి హనుమంతరావు, మరవరం ప్రతాపరెడ్డి, దేవులపల్లి రామాసుబ్రహ్మణ్యం తదితరులు గ్రంథాలయోద్యమాన్ని కొనసాగిస్తూ పనిచేస్తున్నారు. వీరి ప్రభావం బాలకృష్ణయ్యపై బలంగా పనిచేసింది. నిజాం నవాబు నియంతృత్వ పాలనకు ఎదురుతిరిగి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. 1948 అక్టోబర్లో వనపర్తిలోని కమాను వద్ద జాతీయ జెండాను ఎగురవేయడం ద్వారా తన సాహసాన్ని ప్రదర్శించారు. ఇలా జెండా ఎగురవేసిన నేరానికి ఆయన నాలుగు నెలల పాటు జైలు శిక్ష అనుభవించారు. కాంగ్రెస్‌లో పనిచేసి కర్నూల్ కాలువబుగ్గ ట్రైనింగ్ క్యాంప్‌లో సైనిక శిక్షణ పొందారు. ఈ స్వాతంత్ర్యోద్యమ కాలంలో తన సమవయస్కులను చేరదీసి జాతీయోద్యమం వైపు నడిపించే క్రమంలో ఆయన జీవితం సాగింది. అలా స్వాతంత్ర్యోద్యమం, నిజాం వ్యతిరేక పోరాటం, గ్రంథాలయోద్యమం ఆయన్ను ముప్పేటా ప్రభావితం చేశాయి.

మరోవైపు బ్రిటిషువారు దేశవ్యాప్తంగా విద్యావ్యాప్తి, వైద్యసేవలతో సామాన్య ప్రజలను ప్రభావితం చేస్తున్న రోజులు. ఆంగ్లవిద్య ప్రారంభం నుండి బలమైన ప్రభావంతో వేళ్లూనుకుంటున్నది. ఈ స్థితికి భిన్నంగా నైజాం రాష్ట్రంలో ఉర్దూయే పాలన భాష, ఉర్దూయే రాజభాషగా చెలామణి అవుతోంది. ఎవరైనా విద్యను అభ్యసించాలంటే విధిగా తమదికాని పరభాష ఉర్దూ మాధ్యమంలోనే చదువుకోవాలి. ఇది ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యలో సైతం అమలయ్యే స్థితిలో ఉంది.

సంస్థానాల్లో పనిచేసే ఉద్యోగుల కుటుంబాలు ఆయా సందర్భాల్లో ప్రభువుల వెంట ఊటీ, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లవలసి వచ్చేది. ఈ క్రమంలో తమ భార్యాబిడ్డలను కుటుంబం యావత్తును వెంట తీసుకువెళ్లి విద్యాబుద్ధులు చెప్పించుకున్న కుటుంబాలు ఒకటి రెండే కనిపిస్తాయి. అలాంటి కుటుంబాల్లో ఒకటి డాక్టర్ బాలకృష్ణయ్యగారిది.

బాలకృష్ణయ్య తల్లిదండ్రులు వనపర్తి సంస్థానం రాజా రామేశ్వరరావు చిన్నాయన రాందేవ్ రావ్ దేవిడీలో ఉద్యోగం చేసేవారు. విధి నిర్వహణలో భాగంగా వారంతా హైదరాబాదులోని జాంబాగ్ లో ఉన్న వనపర్తి క్వార్టర్స్ లో ఉండేవారు. స్కూల్ ఫైనల్ దాకా వనపర్తిలో చదివిన బాలకృష్ణయ్య ఉన్నత విద్యకోసం హైదరాబాదు చేరుకుని మూసీ ఒడ్డునగల సిటీ కాలేజీలో ఎఫ్.ఏ.లో చేరారు

ఎఫ్.ఏ. తరువాత బాలకృష్ణయ్య ఎం.బి.బి.ఎస్. లో ప్రవేశించారు. జాంబాగ్ క్వార్టర్స్ లో విద్యార్థిగా ఉన్నపుడే తోటి సంస్థాన ఉద్యోగుల పిల్లలను ఒకచోటికి చేర్చి తానే గురువై అక్షరాభ్యాసం చేయించారు. ఆనాటికే విద్యయొక్క ఆవశ్యకతను గుర్తించారు. చదువుకోవడం అంటే ప్రపంచాన్ని అర్థం చేసుకోవడమని, ప్రపంచపోకడల యొక్క సారాంశం చదువు ద్వారా తెలుస్తుందని, ప్రధానంగా ప్రజల అజ్ఞానాన్ని పారద్రోలే శక్తి ఒక్క చదువుకే ఉందన్న నమ్మకంతోనే ఆనాటి పరిస్థితుల్లో ఎంతగా తపిస్తే మరెంతగా ప్రయత్నిస్తే వైద్యవిద్యను ఆయన ఎంచుకోవడం ఎంత సాహసమో మనకర్ణమవుతుంది. వైద్యవిద్య చదువుతున్న కాలంలోనే 1950లో ఆయన వివాహం వనపర్తికి చెందిన లక్ష్మీనర్సమ్మ, బలరాం దంపతుల ఏకైకకుమార్తె అంజనాదేవితో జరిగింది.

సంస్థానాలు భారతదేశంలో విలీనమైనవి. నైజాం రాజ్యం పోలీన్ చర్య తరువాత భారత దేశంలో కలిసి 1952 నాటి ఎన్నికల హైదరాబాదు రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడింది. నాటికి మన బాలకృష్ణయ్య ఉస్మానియాలో మెడికల్ కాలేజీ విద్యార్థి. కీ.శే. సురవరం ప్రతాపరెడ్డి 1952 ఎన్నికల్లో వనపర్తినుండి శాసనసభకు ఎన్నికైనారు. ‘గోల కొండ’ పత్రిక, ఆంధ్రసారస్వత పరిషత్తు ఆయన రెండు కళ్లైతే, ఆయన స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా. అలాంటి సాంస్కృతిక వారసత్వంనుండి స్వంత వ్యక్తిత్వంతో ఒక ఉన్నత లక్ష్యంతో తనను తాను రూపుదిద్దుకుని ఎదిగిన మహానుభావుడు డాక్టర్ బాలకృష్ణయ్య.

1955లో వైద్యవిద్యలో పట్టభద్రుడై వనపర్తి పట్టణంలో డాక్టర్ గా బాలకృష్ణయ్య వైద్యసేవలు చేయడం ప్రారంభించారు. ఒక పక్క కొత్త రాష్ట్రం రాజకీయాధికారం పొందినవారు. మరో పక్కన వైద్యం, విద్య పేరుతో దేశంలోకి వచ్చి మిషనరీ స్కూళ్లు, పాదరీల దవాఖానాలు నెలకొల్పిన తెల్లవారు, మరొకవైపున దేశీయ వైద్యవిధానాన్ని మనసా వాచా కర్మణ నమ్మిన సామాన్య ప్రజలు. ఈ త్రివేణీసంగమంలోంచి బాలకృష్ణయ్య తనకు తానుగా ఎదగాల్సిన సమయం అది. ఆనాటి వనపర్తి తాలూకాలో తొలి ఎం.బి.బి.ఎస్. డాక్టర్ ఈయనే.

1957లో బలిజేపల్లి వాస్తవ్యులైన విఠా కేశిరెడ్డి, సత్యమ్మ దంపతుల ఏకైక కుమార్తె శంకరమ్మను పెళ్లిచేసుకున్నారాయన.

నూతన ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేసినా, పనిచేయకపోయినా ప్రజలను ముందుకు నడిపించడానికి డాక్టర్ బాలకృష్ణయ్య చేసేది. వైద్యవ్పత్తే అయినా యువకులను మనుషులను సమీకరించి వారు చేసే వృత్తులు ఏవైనా, తాను ఉన్నత విద్యావంతుడైనా వారితోనే స్నేహంచేసి సమాజాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించారు. అందులో సఫలీకృతుడైనారు. తక్కువ ఫీజుతో వైద్యం చేస్తున్న క్రైస్తవుల దవాఖానాతో పోటీపడి, ఉచితవైద్యం చేస్తున్న హోమియో డాక్టర్ పద్మనాభయ్య ప్రేరణ, ఆదర్శాలతో అదే కోవలో తాను నయాపైసా ఫీజు తీసుకోకుండా వైద్యసేవలు ప్రారంభించారు. కారణాలేవైనా ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే పని చేసుకుంటారు. తమ అవసరాలకు డబ్బు సంపాదించుకోగలరు. ఒక నాగరిక సమాజంలో మానవులుగా జీవించగలరన్న దృఢాభిప్రాయంతో వాళ్ల పరిమిత ఆదాయంలోనే వారికి తన వైద్యసేవలతో సహకారంగా నిలిచారు.

మరోవైపు ఇలా ఉచితంగా అందించే వైద్యసేవలను సైతం వినూత్నంగా ప్రజలకు చేరువ చేసే సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు డాక్టర్ బాలకృష్ణయ్య. రోగులు వైద్యుని వద్దకు రావడం అనే పద్ధతికి స్వస్తి పలికి వైద్యుడై తానే రోగుల వద్దకు స్వయంగా వెళ్లడం ప్రారంభించారు.

1955 నుండి 1962 వరకు ప్రజల వద్దకు వైద్యం తీసుకువెళ్లి సేవచేస్తూనే పట్టణంలో నాటి సమకాలికులైన మిత్రులు బుద్దారం గాజుల చంద్రయ్య, కుర్మయ్య, చింతకుంట ఖుర్బాన్, సర్దార్ సింగ్ వంటి ఔత్సాహికులతో వనపర్తిలో సోషలిస్ట్ పార్టీ నేతృత్వంలో వయోజన విద్యా పాఠశాలలు నెలకొల్పి ప్రజలలో అక్షరాస్యతకై కృషిచేశారు. కులమతాలకతీతంగా సెలవు రోజుల్లో ఊరి దగ్గర్లోని తోటల్లోకి తీసుకెళ్లి సహపంక్తి భోజనాలు ఏర్పాటుచేసి కులవ్యవస్థ నిర్మూలనకు తీవ్రగతిన కృషిచేశారు. ఈ సహపంక్తి భోజనాలకు, గోష్ఠులకు పట్టణంలోని వైశ్యులు సైతం రావడం నాడు అంత సామాన్యమైన విషయం కాదు. వనపర్తిలోని నాయక్ సాహెబ్ తోటలో జరిగిన ఒక సమావేశంలో కాంగ్రెస్, సోషలిస్ట్ పార్టీల నేతలందరినీ పాల్గొనేలా చేసి పెద్ద ఎత్తున సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారీయన. 1949 ప్రాంతంలోనే వనపర్తి ప్రజల్లో కులమత వైషమ్యాల్ని రూపుమాపాలని హరిజనులకు ఆలయ ప్రవేశం కల్పించిన సంస్కర్త,

ఈ 1952-1962 మధ్యకాలంలో వనపర్తి గ్రామపంచాయతీ సర్పంచులుగా కొనసాగిన నారాయణరెడ్డి, అవుసలి బాలయ్య, కృపాదానం గార్లు పదేళ్లుగా ఒకరి తరువాత ఒకరు వరుసగా పనిచేశారు.
1962లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినవి. ఇందులో సోషలిస్ట్ పార్టీ అభ్యర్థిగా కడుకుంట్ల శివారెడ్డి, కాంగ్రెస్ తరపున రాణీ కుముదినీదేవి పోటీపడ్డారు. ఈ ఎన్నికల్లో సోషలిస్ట్ పార్టీ అభ్యర్థి శివారెడ్డిని డాక్టర్ బాలకృష్ణ బలపరిచి ప్రచారంలో కీలకపాత్ర వహించారు. ఈ కారణంగా రాం దేవ్ రావు వద్ద హైదరాబాదులో పనిచేస్తున్న ఆయన తండ్రి మహదేవయ్యను ఉద్యోగంలోంచి తొలగించారు. రాజకుటుంబం తీసుకున్న ఈ నిర్ణయం బాలకృష్ణయ్య యొక్క విశ్వాసాన్ని, మనోబలాన్ని సడలనీయలేదు. తండ్రి ఉద్యోగం కోసం వారివద్దకెళ్లి ప్రాధేయపడలేదు. కానీ డాక్టర్ గారు బలపరిచిన శివారెడ్డి ఈ ఎన్నికల్లో ఓడారు.

ఈ అసెంబ్లీ ఎన్నికల తరువాత ఆరేళ్ల ప్రజాసేవ వల్ల కొందరు స్నేహితులు, సన్నిహితులు చేరువైనారు. అంతేగాక ఆయన అభిప్రాయాలతో, ఆశయాలతో ఏకీభవించే కాగితాల బాల్ రాం, భాష, మియా, సదుర్ల గోపాల్, కాగితాల రంగన్న, అయిందాల లోకప్ప, హెచ్.లక్ష్మీబాయి, శారదమ్మ, వడ్ల లక్ష్మీదేవి, మనుసాని కృష్ణమూర్తి, నారాయణ రావు, వెంకోబరావు, కలకొండ బాలకృష్ణయ్య వంటివారితో కలిసి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనేందుకు “పట్టణాభివృద్ధి సమితి” ని ఏర్పాటు చేశారు.

రాజవంశాల ఏలుబడిలో ఉన్న అన్నిచోట్ల భూములు, గ్రామాలే కాదు మనుషుల్ని సైతం రాజులు తమ స్వంత ఆస్తులుగానే భావిస్తారు. తమ తోటల్ని, రాజప్రాసాదాలను, ఊరివెలుపల ఉన్న ఆస్తుల్ని నేరస్తుల్ని శిక్షించడానికి ఏర్పాటు చేసిన పాత కోటలోని జైళ్లను, కోటచుట్టూ ఉన్న కందకాలను సైతం డబ్బుగా మార్చుకోవాలనుకునే కుతంత్రాల్ని అదుపు చేసేందుకు డాక్టర్ బాలకృష్ణయ్య నాయకత్వాన “పట్టణాభివృద్ధి సమితి” ఎదురొడ్డి నిలిచింది.

మారిన పరిస్థితుల్లో మార్కెటింగ్ మాయజాలం తెలిసిన రాజులు నాటి ప్రధానమంత్రి చేత ప్రైవేటు పాలిటెక్నిక్ లు ప్రారంభించి వనపర్తిలోని తను స్థిరాస్తులన్నింటికీ ధరలు పెంచుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ప్రజల అవసరాల మీద డబ్బు చేసుకునే విధానాలను ఏవగించుకునే వారి పక్షాన నిలిచి నిస్వార్థంగా పనిచేసే నేపథ్యంలో 1962 వనపర్తి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఆయన భారీ ఆధిక్యతతో విజయం సాధించారు. దీనితో ప్రజాప్రతినిధిగా ఆయన జీవితం ప్రారంభం కావడమే గాక వనపర్తి రాజకీయ ముఖ చిత్రం ఆసాంతం ఒక్కసారిగా మారిపోయింది.

ఈ సమయంలోనే డాక్టర్ గారి ఆశయాలకు అనుగుణంగా ప్రజలను జాగృతం చేయడానికి కాగితాల రంగన్న నేతృత్వంలో ఒక సాంస్కృతిక దళం ఏర్పడింది. ఈ దళంలోని కాగితాల రంగన్న తనకేమాత్రం అక్షరజ్ఞానం లేకుండానే అద్భుతమైన భావాలతో గేయాలు, కథలు కూర్చుకుని గొల్లసుద్దులు, బుర్రకథలు చెబుతూ అద్భుతప్రావీణ్యంతో రాష్ట్రస్థాయిలో ఎదిగి పుచ్చలపల్లి సుందరయ్యతో ప్రశంసలందుకున్నారు.

వనపర్తి స్థానికనేతగా ఎదుగుతున్న క్రమంలో పట్టణంలో విద్యుచ్ఛక్తి సౌకర్యాన్ని కల్పించడానికి ప్రభుత్వంపై వత్తిడి తెస్తూ పలు ఉద్యమాలను నిర్వహించారు. డాక్టర్ పద్మనాభయ్య నేతృత్వంలో “పట్టణాభివృద్ధి సమితి” పక్షాన నిరాహారదీక్షలు చేపట్టి 1966 నాటికి వనపర్తికి విద్యుత్ వెలుగులు తెచ్చిపెట్టిన సంగతి ఈ తరంవారికి అంతగా తెలియకపోవచ్చు.

1960 దశకంలో వనపర్తి పట్టణం భారీవర్షాల వల్ల తరచూ వరదలకు గురవుతుండేది. ఈ సందర్భాలలో డాక్టర్ బాలకృష్ణయ్య తమ పట్టణాభివృద్ధి సమితి నేతృత్వంలో కలరా బారిన పడిన వందలాది మంది రోగులకు స్వచ్ఛందంగా సెలైన్ బాటిల్స్ ఎక్కించి ప్రాణాలు కాపాడారు. అదే సమయంలో వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన వారికి వైద్యం అందడం లేదని తెలిసి ఒక ప్రైవేటు డాక్టర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయరాదనే నిబంధనను త్రోసిరాజని అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చారాయన.

1967: మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. మళ్లీ రాణీ కుముదినీదేవి రంగంలో ఉంది. పోటీగా ఎం. జగన్నాధరెడ్డిని నిలిపిన డాక్టర్ గారు ప్రచారంలో ముందున్నారు. కానీ మళ్లీ కుముదినీదేవియే గెలిచింది. అయితేనేం డాక్టర్ గారి బలగం పెరిగింది. ఆయన అనుయాయులు ఓటమికి కారణాలను విశ్లేషించుకుని ప్రజాజీవితంలో కొనసాగుతున్న కాలంలో 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమకాలంలో వనపర్తిలో కాల్పులు జరిపితే గాయపడిన వారిని స్వయంగా తీసుకెళ్లి కర్నూల్ చికిత్స చేయించారు. అరెస్ట్ చేసినవారినెందరినో పోలీసులనుండి కాపాడారు. ముల్కిరూల్స్ అమలు ఆరంభమైన ఈ ఉద్యమాన్ని వేర్పాటు ఉద్యమంగా భావించిన బాలకృష్ణయ్య సమైక్యతావాదిగా కడవరకూ సాగిపోయారు.

1970లో రెండవసారి గ్రామపంచాయతీకి ఎన్నికైన తరువాత ఆయన పట్టణ ప్రజల సౌకర్యార్థం పలు కార్యక్రమాలను చేపట్టారు. వీటిలో ప్రధానమైనది మంచినీటి సౌకర్యాన్ని కల్పించడం అప్పట్లో మహిళలు చేదబావులు, దిగుడు బావుల్లో నుండి నీరు తెచ్చుకోవడం, ఊరి చుట్టూ ఉన్న వ్యవసాయ బావుల్ని స్నానాలకు ఉపయోగించుకుంటున్న పట్టణ ప్రజల దుస్థితిని మెరుగుపరిచేందుకు ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న చిట్యాలవాగులో ప్రవహిస్తున్న మంచినీటిని వంపుల ద్వారా సరఫరా చేయడానికి సంకల్పించారు.

నాటి కాంగ్రెస్ ముఖ్య మంత్రి కాసు బ్రహ్మానందరెడ్డిని ఆహ్వానించి 1970 ఆగస్టు 26న ఈ మంచినీటి పథకానికి ప్రారంభోత్సవం చేయించారు. ప్రజల అవసరాలు ప్రాధాన్యతను సంతరించుకున్న సమయంలో భేషజాలకు పోకపోవడం ఆయన ఉన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం.

నిరంతరం పనిలో మునిగి ఆ వత్తిడిని అధిగమించేందుకు తన మిత్రులతో కలిసి వారాంతపు రోజుల్లో షికారుకెళ్లడం డాక్టర్ గారి వ్యాపకం. ఈ షికారుకెళ్లేందుకే ప్రత్యేక స్నేహబృందం ఉండేది. అంతా కలిసి అచ్చంపేట దాటి నల్లమల అటవీ ప్రాంతానికి వనవిహారానికి వెళ్లేవారు.

1971లో దేశవ్యాప్తంగా రాజకీయంగా సెనుమార్పులు వచ్చిన పర్యవసానంగా లోక్ సభకు మధ్యంతర ఎన్నికలు ప్రకటితమైనవి. ఆ ఎన్నికల్లో ఇందిరాగాంధి గరీబీ హఠావో, బ్యాంకుల జాతీయం, భూసంస్కరణలతో ముందుకు వచ్చారు. పేదప్రజల ఆర్తికి ఆలంబనగా నిలవాలనుకున్న డాక్టర్ బాలకృష్ణ కాంగ్రెస్ ను బలపరిచి డి.కె సత్యారెడ్డిని సమర్థించారు. అయితే ఆ ఎన్నికల్లో సత్యారెడ్డిగారు కూడా ఓడిపోయారు.

రోజు రోజుకూ పెరుగుతున్న ప్రజాదరణ ప్రజలతో ఏర్పడుతున్న అనుబంధాన్ని చూసి ఓర్వలేని వ్యతిరేకవర్గం చిట్యాలలోని ఆయన వ్యవసాయక్షేత్రం వద్ద దాడికి పూనుకున్నారు. ఇది తెలిసిన వనసర్తి ప్రజలు ఆగ్రహంతో వేలాదిగా తరలి దాడికి పూనుకున్నవారిని హతమారుస్తామనగా వారిని వారించిన అహింసావాది డా.బాలకృష్ణయ్య

1972 అసెంబ్లీ ఎన్నికలనాటికి డాక్టర్ గారు ఇండిపెండెంట్ గా పోటీకి నిలిచారు. అయితే ఈయన ఓటమిని కోరుకున్న రాజకుటుంబం కొత్తకోటనుండి ఒక వెనుకబడిన తరగతుల వర్గానికి చెందిన వ్యక్తిని మొదటిసారిగా కాంగ్రెస్ పక్షాన పోటీచేయించి బాలకృష్ణయ్యని ఓడించారు. ఈ ఎన్నికల తరువాత దేశవ్యాప్తంగా వచ్చిన రాజకీయ మార్పులను అవగాహన చేసుకున్న బాలకృష్ణయ్య మారిన కాలంతో బాటు తానూ మారారు. సమాజంలో పెరుగుతున్న అంతరాలు, అంటరానితనం, పెరుగుతున్న దారిద్య్రం, ఆకలి, నిరుద్యోగం, నిరాశ్రయత, అవిద్య అన్నీ చుట్టుముట్టి వేధిస్తున్న కాలంలో వీటికి పరిష్కారంగా మనుషులు ఎటు ప్రయాణం చేయాలి? ఏ విధంగా పరిస్థితుల్ని మార్చుకోవాలి? అనే ప్రశ్నలతో తన అభిప్రాయాలను మార్చుకుని మానవతావాదిగా ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా నాటి సమాజంలో ముందుకు సాగిపోయారు.

1974 ఎప్రియల్ 15.
వనపర్తి పట్టణంలో గ్రామసభ నిర్వహించి, భారత జాతీయ మహాకవి శ్రీశ్రీని ఆయన సహచరులైన విప్లవకవులను పిలిపించి కవిసమ్మేళనం ఏర్పాటు చేయించారు. సమస్యల భారతానికి సాధ్యమైన పరిష్కారాన్ని కవులు తమ కవితల్లో ప్రతిబింబింపజేసి సమాజాన్ని మార్చాల్సిన అవసరాన్ని ప్రకటించారు.

1975
కొల్లాపూర్ పట్టణంలో భారత-చైనా మిత్రమండలి ఆధ్వర్యంలో మొదటి జిల్లా మహా సభలను నిర్వహించి ఆసియా ఖండంలోనే రెండు పెద్దదేశాల మధ్య స్నేహం నెలకొనాల్సిన అవసరం గురించి ప్రజలముందు ప్రస్తావించారు. తర్వాతి కాలంలో భారత-చైనా మిత్రమండలి ఆధ్వర్యంలో చైనా దేశ పర్యటన చేశారు.

1975 జూన్ 26.
భారతదేశంలో ఇందిర ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని విధించింది. ఈ చీకటిరోజుల్లో జరిగిన ఆకృత్యాలకు, అన్యాయాలకు నిరసనగా దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు ఉద్యమాలు నడిపినవి. తదనంతరం జనతాపార్టీ నిర్మాణం జరిగింది. డాక్టర్ బాలకృష్ణయ్య నాటి ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో పాలుపంచుకున్నారు. పౌరహక్కుల పరిరక్షణ కోసం జరిగిన ఆందోళనల్లో భాగస్వామ్యం పొందారు. “పౌరహక్కుల పరిరక్షణ సమితి” ఆధ్వర్యాన జరిగిన ఉద్యమాల్లో ముందుండి నడిచారు. 1977 జూలై 31న అప్పటి జనతాపార్టీ ఎం.పి. తర్వాత ఉపరాష్ట్రపతి అయిన కృష్ణకాంత్ నేతృత్వంలో ఒక మెమోరాండంను నాటి గవర్నర్ కు సమర్పించిన బృందంలో డాక్టర్ బాలకృష్ణయ్య కూడా ఉన్నారు. 1978లో జనతాపార్టీ పక్షాన అసెంబ్లీకి ఎన్నికల్లో జయరాములుతో పోటీపడి మళ్లీ ఓటమి చవిచూశారు, కానీ ఈ ఎన్నికల నాటికి ఆయన అనుచరవర్గం విస్తృతమై వనపర్తి నియోజకవర్గం అంతా వ్యాపించింది. ఆయన 1981లో జరిగిన పంచాయతీ సమితి ఎన్నికల్లో పోటీచేసి ప్రత్యర్థులు రిగ్గింగ్ ఓట్లు వేసుకోవడంతో ఓడిపోవలసివచ్చింది.

ఇదిలా ఉండగా 1977 నవంబర్ 19న దీవిసీమలో ఉప్పెన వచ్చింది. ఈ కారణంగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. గ్రామాలన్నీ శవాలతో స్మశానాలుగా మారాయి. సామూహికంగా మరణించిన ప్రజల అంత్యక్రియలకు అన్ని రాజకీయ పార్టీల నేతలు, యువకులు, విద్యార్థులు నడుం బిగించారు. ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్ల సకాలంలో వరదబీభత్సాన్ని అదుపుజేయలేని స్థితిలో వనపర్తి పట్టణంలో బాలకృష్ణయ్య నేతృత్వంలో అంతా వీధుల్లో తిరిగి విరాళాలుగా డబ్బు, ధాన్యం, వస్త్రాలు సేకరించి ఉప్పెన సంఘీభావ కమిటీకి పంపారు.

జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలైన వనపర్తి, మహబూబ్ నగర్, కొల్లాపూర్, కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్ కర్నూల్ ప్రాంతాలలో రవాణా రంగాన్ని తన అదుపాజ్ఞలలో ఉంచుకుని ప్రైవేట్ వాహనాల్ని నడుపుతున్న అబ్దుల్ ఖాదర్ కార్మికులకు తక్కువ వేతనాలిచ్చి పనిచేయించుకుంటున్న సమయం అది. ఈ స్థితిలో కార్మికులు తమ మెరుగైన వేతనాల కోసం ఉద్యోగ భద్రత కోసం ఒక సంఘాన్ని స్థాపించుకున్నారు. ఫలితంగా చాంద్ భాన్, లక్ష్మీనారాయణ, గులాం ముస్తఫా, సి. హన్మంత్ రెడ్డిలను ఉద్యోగాలనుండి తొలగించారు. తమ హక్కుల సాధనకోసం ఊరూరా ఆందోళనలు చేస్తున్న సమయంలో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టులను అడ్డుకుని డాక్టర్ బాలకృష్ణయ్య గారు స్వయంగా ఆందోళనల్లో పాల్గొని సమ్మెకు సంఘీభావం తెలియజేశారు.

1979
విజయవాడలో జరిగిన భారత-చైనా మిత్రమండలి రాష్ట్ర మహాసభల్లో బాలకృష్ణయ్య గారు రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైనారు.

1982 జనవరి 5.
వనపర్తి పట్టణంలో భారత-చైనా మిత్రమండలి రెండవ జిల్లా మహాసభలు జరిగాయి. డా. హరగోపాల్ ప్రధాన వక్తగా పాల్గొన్నారు. ఈ తరువాత “మండలి” తృతీయ మహాసభలు కాకినాడలో 1982 జనవరి 9, 10 తేదీల్లో జరిగినప్పుడు బాలకృష్ణయ్య గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవినుండి రాష్ట్ర ఉపాధ్యక్షునిగా ఎన్నికైనారు. ఇదే సంవత్సరం భారత-చైనా మిత్రమండలి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ నుండి చైనా వెళ్తున్న ఆరుగురు సభ్యుల ప్రతినిధి వర్గంలో డా. బాలకృష్ణయ్యకు అవకాశం లభించింది. 1982 జూలై 9న కలకత్తానుండి బయలుదేరి రంగూన్ మీదుగా చైనా వెళ్లారు. చైనాలో 13 రోజులు జూలై 21 దాకా పర్యటించి భారతదేశం వచ్చారు.

అప్పటిదాకా సుమారు మూడు దశాబ్దాల పాటు మహాకవి శ్రీశ్రీ సాహిత్యం చదువుతూ ప్రభావితమై చైనా సోషలిస్ట్ సమాజాన్ని చూసే అవకాశం బాలకృష్ణగారి జీవితంలో తటస్థించింది.

మాతృదేశంలో ఆర్థికపరమైన దోపిడి, సాంఘికపరమైన పీడన లేనటువంటి సమాజం కావాలని కోరుకునే అసంఖ్యాకమైన వాళ్లలో డాక్టర్ బాలకృష్ణయ్యగారు ఒకరు.

సోవియట్ రష్యా విప్లవాన్ని మొదటి ప్రపంచ యుద్ధకాలంలో, చైనా విముక్తిని రెండో ప్రపంచ యుద్ధకాలంలో పత్రికల్లో చదివి తన సహచరుడు సదుర్ల గోపాల్-

“కమ్యూనిజం రైలుబండి వస్తున్నది
కష్టజీవికిందులోన చోటున్నది”

అని పరవశించి పాడితే ఆనందబాష్పాలతో అంత అద్భుతమైన సమాజం తన జీవితకాలంలో చూడకపోతానా అనే ఆశతో నిరంతరం తపించి ప్రజా రాజకీయాలలో పనిచేసిన అతనికి, సాటి మనిషిగా మహాకవి శ్రీశ్రీని ఆదుకోవటం వ్యక్తిగతంగా తాను చేసినప్పటికీ, అదే సాటిమనుష్యులను రాజ్యమే ఆదుకునే చైనా ప్రజల సమాజాన్ని చూసే అవకాశం లభించడం నిజంగానే తన జీవితంలో గొప్ప సందర్భంగా ఆయన భావించారు

డాక్టర్ బాలకృష్ణయ్య గారి ధర్మపత్ని అయిన శ్రీమతి. అంజని బాలకృష్ణ ముదిరాజ్ కూడా సాహితీ అభిమాని కావడం ఒక విశేషం. ఒకానొక సందర్భంలో అంజనీదేవిగారు, 1981 నవంబర్ లో “కమెండో” రాజకీయ పత్రికలో శ్రీశ్రీ ఇల్లు వేలం అని చదివి డాక్టర్ గారితో మనం వారిని ఎలాగైనా సహాయం చేయగలమా అని అడిగారు.

ఆంధ్రదేశంలో అపారంగా అభిమానులున్న మహాకవి శ్రీశ్రీ ఇల్లు వేలంపాటకు గురవుతున్నప్పటికీ ఏ పత్రికా, ఏ రచయితల సంఘం, ఆయనచే వందలాది పాటలు రాయించుకుని లక్షలు సంపాదించుకున్న సినిమారంగం ఆయన్ను పట్టించుకోలేదు.

ఈ పరిస్థితుల్లో డాక్టర్ బాలకృష్ణయ్య 1982 ఫిబ్రవరి 7న ఒక విస్తృత సమావేశాన్ని ఏర్పాటుచేసి శ్రీశ్రీని ఆర్థికంగా ఆదుకొనడానికి అందరికీ విజ్ఞప్తి చేశారు. అందరి అభిప్రాయం మేరకు మార్చి 14న జరిగే సభలో ఆర్థికసహకారం అందజేయాలని నిర్ణయించారు. ఆ మేరకు దాదాపు నెలరోజుల్లో విస్తృతంగా విరాళాలు సేకరించి సుమారు పదివేలమంది సమక్షం లో రూ.25వేల చెక్కుని మహాకవి శ్రీశ్రీకి అందజేశారు. శ్రీశ్రీ తనను కష్టకాలంలో ఆదుకున్న వనపర్తి ప్రజల సహృదయ సన్మానం నోబుల్ బహుమతికన్నా గొప్పదని చెప్పుకున్నారు. ఆ తరువాత రోజున కర్నూల్లో జరిగిన మరో సన్మానసభలో పాల్గొన్న శ్రీశ్రీ తన ఆర్థిక ఇబ్బందులు వనపర్తి, హైదరాబాదు ప్రజల సహాయంతో తొలగిపోయాయని చెప్పుకున్నారు. ఈ రెండునగరాల్లో జరిగిన సన్మానం ఒక ప్రజారచయితకు జరిగిన సన్మానమేనని, ఇకముందు తను ఆర్థిక సాయం కోసం ఎక్కడికి వెళ్లనని ప్రకటించారు.

నిన్నటి దుఃఖం, నేటి చింత. రేపటి భయం లేని సమాజం కోసం కన్న కలలు ఎలా నెరవేరుతాయనే తపనతో ఎదురుచూస్తున్న కాలంలో వెండితెర వేల్పు, తెలుగు ప్రజల ఆరాధ్యదైవం నందమూరి తారకరామారావు కాంగ్రెస్ పాలనపై సమరశంఖం పూరించారు. ఈ క్రమంలో వనపర్తి లోని ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ నిర్వాహకులు తెలుగుదేశం పార్టీ నిర్మాణానికి పూనుకున్నారు. అందులో భాగంగా 1982 మేనెల పట్టణంలో శ్రీపతి రాజేశ్వర్ ముఖ్యఅతిథిగా యాపర్ల నాగన్న, సి.టి. డేనియల్, ఇబ్రహీం, జె. శివప్రసాద్, రఫీఖ్ అహ్మద్, బాలప్ప, ఎ. రాంచందర్ లు సభను ఏర్పాటుచేసి సభ్యత్వ నమోదును ప్రారంభించారు. అనంతరం ఎన్టీఆర్ నవంబర్ నెలలో వనపర్తి బహిరంగసభకు వచ్చినపుడు ఆయన సమక్షంలో బాలకృష్ణయ్య తెలుగుదేశంలో చేరారు.

సరిగ్గా ఇదే కాలంలో గద్వాల ప్రాంతంలోని పేదరైతుల కోసం సేరీ భూములిప్పించేందుకు పోరాటం చేసి సాధించిన విజయమోహన్ రెడ్డి అనే ప్రజలపక్షపాతి జిల్లా వైద్యాధికారిగా పదవీవిరమణ చేసిన దశలో ఉన్నారు. భూమిపై హక్కు ధనవంతులకో, భూస్వాములకో కాదని పేదవాడికి, దున్నేవాడికే భూమి అన్న ఎన్టీఆర్ నినాదానికి ప్రేరేపితుడై ఆయన తెలుగుదేశం పార్టీలో వ్యవస్థాపక సభ్యత్వం పొందారు.

స్వాతంత్ర్యం వచ్చినప్పటినుండి అట్టడుగు వర్గాల అభ్యున్నతికోసం మార్గాల్ని అన్వేషిస్తూ విద్యావంతులు కానిదే సమాజ పురోగతిని సాధించలేమని, అభివృద్ధిఫలాలు అందరమూ అందుకోలేమని భావించి నాగర్ కర్నూల్ పట్టణంలో జాతీయోన్నత పాఠశాలను ఏర్పాటుచేసి గ్రామీణ ప్రాంతాల్లోని పేదపిల్లలను తీసుకువచ్చి, హాస్టళ్లలో ఉంచి ఉచిత భోజనం, దుస్తులు ఇప్పించి, విద్యావంతుల్ని చేయడం ద్వారా రిజర్వేషన్ల ప్రాతిపదికన పాలనలోకి పంపే ప్రక్రియకు నాంది పలికారు. అంటరానితనానికి, మద్యపానానికి వ్యతిరేకంగా తాలూకా నిర్మాణ కార్యకర్తల సంఘాన్ని ఏర్పాటు చేశారు. గ్రామాలనుంచి ప్రజలు సద్దులు కట్టుకుని ప్రభుత్వ కార్యాలయాల్లో తమ పనులకోసం వస్తే వారికి ఆసరాగా నిలిచిన నాయకుడు పి. మహేంద్రనాధ్.

మానవ వికాసానకి విద్యా, వైద్యం రెండూ కళ్లలాంటివని భావించి రెండుచేతులా ఆ రెండు రంగాలను ఆవాహనం చేసుకుని సుమారు 30 ఏళ్లు వనపర్తి పట్టణ ప్రజల సాంఘిక, రాజకీయ, ఆర్థిక, విద్యావికాసానికి కృషిచేసినవారు మన బాలకృష్ణయ్య. మహబూబ్ నగర్ జిల్లా పక్షాన రాజకీయాల్లో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వానికి త్రిమూర్తుల్లా నిలిచింది వీళ్లే. తమ స్వార్థం కోసమో, రాజకీయ లబ్దికోసమో కాక శ్రీశ్రీ మాటల్లో చెప్పాలంటే… “అవినీతి, బంధుప్రీతి, చీకటి బజారులు అలుముకున్న ఈ దేశాన్ని తమ శక్తిమేరకు కాపాడటానికి తమదైనటువంటి పరిమితుల్లో కృషిచేసినవారు వీరే వీరే వీరే ఈ ముగ్గురే!

1983 జనవరి 6.

రాష్ట్ర శాసనసభకు జరిగిన ఆరవ శాసనసభ ఎన్నికల్లో వనపర్తి నియోజకవర్గం నుండి తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా డాక్టర్ బాలకృష్ణయ్య గెలుపొందారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన అనంతరం మూడు దశాబ్దాలకు గాను మొదటిసారిగా రాష్ట్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడటం, అందులో వనపర్తి ప్రజల చిరకాల వాంఛగా బాలకృష్ణయ్య తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలుపొందడంతో రాజకీయచరిత్ర మలుపు తిరిగింది. మొదటిసారి ఎం.ఎల్.ఏ.గా ఎన్నికైన అనంతరం డాక్టరుగారు చేసిన మహత్తరకార్యం ఆర్.ఎల్.డి. డిగ్రీ కళాశాలను ప్రైవేట్ యాజమాన్యం నుండి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావడం.

వనపర్తి పట్టణంలో ప్రైవేట్ ఆర్.ఎల్.డి. డిగ్రీ కాలేజీలో యాజమాన్యం లక్షలాది రూపాయల దుర్వినియోగాన్ని ప్రశ్నిస్తూ విద్యార్థులు, అధ్యాపకులు, ఇతర సిబ్బంది సంఘటితమై ఆందోళనకు ఉపక్రమించారు. దాదాపు పదిహేను మాసాలు ధర్నాలు, నిరాహారదీక్షలు, నిరసన ప్రదర్శనలు చేపట్టి, సమస్యను ప్రభుత్వ దృష్టికి తెచ్చారు. 1974లో ఏర్పరచిన కళాశాల యాజమాన్యం నామమాత్రపు వేతనాలతో సిబ్బందిని ఇబ్బందులకు గురిచేయడం పట్ల సర్వత్రా వ్యక్తమైన నిరసన తీవ్రరూపం దాల్చడంతో అనివార్యంగా కళాశాలను 1984 ఫిబ్రవరి 9న ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. మధ్యయుగాల్ని తలపించేలా వెట్టి చాకిరిచేయించుకున్న యాజమాన్యం నుండి బయటపడిన సుమారు 50 మంది సిబ్బంది ప్రభుత్వ సర్వీసుల్లోకి మార్చబడినారు.

1984 ఆగస్టు సంక్షోభంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో భాగంగా ఎన్టీఆర్ వెన్నంటి నిలిచినవారిలో బాలకృష్ణయ్య గారొకరు. ఆనంతరం శాసనసభ రద్దయిన తరువాత 1985 మార్చి ఎన్నికల్లో డాక్టరు గారు మళ్లీ వనపర్తి నుండి ఎన్నికైనారు. శాసనసభ్యులుగా బాలకృష్ణయ్యగారు వనపర్తి నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి ఎనలేని కృషిచేశారు. కడుకుంట్ల, బలిజేపల్లి, వనపర్తి హరిజన, తెలుగువాడ పాఠశాలలను ఇంకా పలు పాఠశాలలను హైస్కూల్ స్థాయికి పెంచారు. ఉర్దూలో విద్య నభ్యసించిన బాలకృష్ణయ్యగారు ఆ భాషాభివృద్ధికి ఏర్పడిన “అంజ్‌మన్ తర్‌ఖి”కి అధ్యక్షులుగా కొనసాగుతూ ఉర్దూ మీడియం పాఠశాలలను ఏర్పరిచారు. నైజాం వ్యతిరేకోద్యమంలో పనిచేసినప్పటికి మైనారిటీ ప్రజల భాష ఉర్దూ కోసం ఆయన కృషిసల్పారు.

1987లో ఏర్పడిన మండలాల వ్యవస్థతో తెలుగుదేశం పార్టీ వినూత్నంగా చేపట్టిన అధికార వికేంద్రీకరణకు బీజావాపన అయ్యింది. జిల్లాలో ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో లేనట్లుగా వనపర్తి పరిధిలో 6 మండలాలు ఏర్పాటయ్యేలా ఆయన చర్య తీసుకున్నారు. మండలాలకు తొలిసారిగా ఎన్నికలు జరిగినప్పుడు ఘనపురం నుండి వెంకటయ్య, కొత్తకోట బాలాగౌడ్, అడ్డాకుల ఎల్లగౌడ్, పెదమందడి కుర్మన్న, వనపర్తి కృష్ణారెడ్డిగార్లు గెలిచారు. అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయం పాటించిన అవగాహన బాలకృష్ణయ్య గారిది. ఈ ఎన్నికల్లోనే ఒకేసారి ఐదుమండలాల్లో తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. ఆ తరువాత మళ్లీ ఇన్ని స్థానాలు ఎప్పుడూ గెలవలేదు.

మండలానికొకటి చొప్పున జూనియర్ కాలేజీని సాధించడంలోనూ, ప్రత్యేకంగా మహిళా విద్యా వ్యాప్తికి బాలికల కోసం కళాశాలను సాధించారు. ఇదే కాలంలో అప్పటి సాంకేతిక విద్యామంత్రికి వనపర్తి డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ కోర్సుల ప్రారంభానికి విజ్ఞప్తులు చేశారు. 26 ఎకరాల్లో ఉన్న ఇదే కళాశాలలోని వసతుల దృష్ట్యా ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపారు. ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాల దృష్ట్యా అది కార్యరూపం దాల్చలేదు.
1989లో టెలిఫోన్ ఎక్స్ఛేంజి నిర్మాణానికి గాను కేంద్రప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలకు వెంటనే స్పందించి కేటాయింపులు జరిగాయి.

బాలకృష్ణయ్య శాసనసభకు ఎన్నికైన తొలి విడతలోనే వెనుకబడిన తరగతుల సంక్షేను సంఘం లెజిస్లేటివ్ కమిటీకి చైర్మన్ గా నియుక్తులయ్యారు. 1983-1985 వరకు మొదటిసారి, 1985 ఎన్నికల తర్వాత 1985-1989 దాకా మళ్లీ ఈ కమిటీకి చైర్మన్ గా కొనసాగారు. ఈ కమిటీ చైర్మన్ ఆయన రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారు. అంతేగాక తమిళనాడు. అండమాను నికోబార్ దీవులను కూడా వారు ఈ కమిటీ చైర్మన్ హోదాలో సందర్శించారు.
శాసనసభ్యులుగా కొనసాగుతున్న కాలంలో ఆర్టీసీ గోల్కొండ రీజియన్ చైర్మన్ , శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సభ్యులుగా మాత్రమే గాక అనేక శాసనసభా కమిటీల్లో సభ్యులుగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయాభివృద్ధికి రైతులకు తోడుగా నిలువడమే గాక రక్షిత మంచినీటి పథకాలకు ఆయన కృషిచేశారు

సాగునీటి సౌకర్యం కోసం భీమా ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తిచేయాలని, బచావత్ అవార్డు ప్రకారం జిల్లాకు చెందవలసిన జలరాశిని వినియోగించుకోలేకపోవడం పట్ల ఆందోళన చెందారు. శ్రీశైలం జలవిద్యుత్తు ప్రాజెక్ట్ కోసం 60 వేల ఎకరాల నల్లరేగడి భూమి నీటిముంపునకు గురై 67గ్రామాల్లోని 12 వేల కుటుంబాలు కాందిశీకులుగా మారిపోయారని వ్యధచెందేవారాయన. 1989లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక పవనాల కారణంగా ప్రజలు తెలుగుదేశాన్ని గెలిపించలేదు. మన బాలకృష్ణయ్యగారు కూడా ఈ ఎన్నికల్లో గెలువలేదు. 1997లో జరిగిన భారత స్వాతంత్య్ర స్వర్ణోత్సవాల సందర్భంగా వారిని ఘనంగా సన్మానించారు.
ఎన్నికల్లో ఓడిన నాటికి ఆయన వయసు 65 సంవత్సరాలు. అయినా ప్రజలకు దూరం కాలేక మళ్లీ వైద్యసేవ చేయడంలోనే గడిపారు. కానీ వృద్ధాప్యం, అనారోగ్యం ఆయనను కృంగదీశాయి. 73వ యేట 1997 డిసెంబర్ 16న హైదరాబాదులో కాలధర్మం చెందారు.

సాధారణమైన మనుషులు మరణిస్తారు. ప్రజలు వారిని మరచిపోతారు. జనం మనుషులు మరణించినా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. వారు జీవన్మృతులు. నమ్మిన అభిప్రాయాలకోసం బాధల్ని, పేదరికాన్ని, కావడికుండల్లా మోసి సమస్యల సానరాయి మీద తనను తాను అరగదీసుకుని పదవుల్ని పాదాలకు వేసుకునే పాదరక్షల్లా భావిస్తారు. బాలకృష్ణయ్య గారు తన బొందిలో ఊపిరున్నంత కాలం ప్రజల మధ్యే బ్రతికి ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేసి పుట్టిన ఊరికి పేరు తెచ్చి ఒక నూతన ఒరవడికోసం నిరంతరం కృషిసల్పి జాతికే నిండుదనం తెచ్చారు. పరిచయమైన ప్రతి ఒక్కరికీ మిత్రుడై, ప్రతిపక్షాలకు కూడా అజాతశత్రువై జీవించిన ప్రజల మనిషి డా. బాలకృష్ణయ్య.