విద్యారంగ సేవలో డాక్టర్ బాలకృష్ణయ్య
“అక్షరమ్ములైన అంటకుండుటకంటె
కొద్ది చదువులైన కొంత మేలు
గుడ్డి వెల్గు మేలు గడుచీకటికంటే
నవయుగాలబాట నార్లమాట”
ప్రముఖ పత్రికా సంపాదకులు, కవి, రచయిత స్వర్గీయ నార్ల వెంకటేశ్వరరావుగారు రాసిన పద్యాన్నే ఆదర్శంగా తీసుకునే విద్యాభివృద్ది వనపర్తి నియోజకవర్గంలో డాక్టర్ బాలకృష్ణ కృషిచేశారనిపిస్తుంది.
ఓ సామాన్య కుటుంబంలో జన్మించి వైధ్య విద్యనభ్యసించి, అటు వైద్యునిగా, ఇటు ప్రతినిధిగా వెలుగొందిన డాక్టర్ బాలకృష్ణయ్య సేవలు మరువలేనివి. మెడిసిన్ చదువుతుండ గానే ఆయన తన ప్రాంత ప్రజలు నిరక్షరాస్యులుగా ఉంటే ఏదేని విషయంలో వారిని చైతన్యపరచడం కష్టమని భావించి ఆనాడే రాత్రిపూట బడులు పెట్టించి ఎందరికో చదువు చెప్పారు. చెప్పించారు వైద్యవిద్య పూర్తికాగానే ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు వనపర్తికి తిరిగి వచ్చారు..
నాలుగు దశాబ్దాల పాటు వైద్య సేవలందించిన ఆయన తన వైద్యం ద్వారా ఎందరి ప్రాణాలో నిలిపారు. ప్రజలకు వైద్య సేవలందించడంలో ఆగ్రగామిగా నిలిచిన ఆయన పేదల సేవకొసం ప్రజా నాయకుడుగా మారారు. రెండు దశాబ్దాలు వనపర్తి మున్సిపల్ చైర్మన్ గా, ఏడు సంవత్సరాలు వనపర్తి ఎం.ఎల్.ఏ.గా ఎంతో సేవ చేశారు.
మున్సిపల్ చైర్మన్ గా పలుమార్లు బాలకృష్ణయ్యనే గెలిపించిన ప్రజానీకం ఎం.ఎల్.ఏ.గా గెలిపించారు.
శాసనసభ్యునిగా ఎన్నికైనప్పటికీ ప్రాంత ప్రజలకు ప్రజాప్రతినిధిగా సేవచేయడంతో పాటు, డాక్టర్ గారు వైద్యసేవలూ కొనసాగించారు ఆగస్టు సంక్షోభంలో మైసూర్ క్యాంప్ నిర్వహించినప్పుడు ఎం.ఎల్.ఏ.లకు డాక్టర్ బాలకృష్ణయ్య వైద్యం చేయడం, అప్పుడు రామారావు డాక్టర్ గారి సేవలను అభినందించడం జరిగాయి. చండశాసనుడైన రామారావు సైతం బాలకృష్ణయ్యగారిని అప్పటినుండి “డాక్టర్ గారు” అని సంబోధించడం మొదలైంది. అప్పటినుండి రామారావుకు మరింత చేరువయ్యారు.
ఆర్టీసీ గోల్కొండ రీజియన్ చైర్మన్, రాష్ట్ర బి.సి. కార్పొరేషన్ చైర్మన్ గా, శ్రీశైలం దేవస్థానం • బోర్డు మెంబర్ బాధ్యతలు నిర్వహించారు.
వనపర్తి నియోజకవర్గంలో రెండు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ఒక ప్రైవేట్ డిగ్రీ కళాశాల ఉండగా ప్రైవేట్ డిగ్రీ కళాశాలను ప్రభుత్వపరం చేసుకోవాలని 11 నవంబర్ 1983 నుండి విద్యార్థులు, లెక్చరర్లు ఆందోళనకు దిగడం, అందుకు ఎం.ఎల్.ఏ.గా పూర్తి మద్దతునిచ్చి ప్రభుత్వంపై వత్తిడి తెచ్చారు. ఈ ఉద్యమం 1983 డిసెంబర్ 25 వరకు కొనసాగింది. రాష్ట్రం మొత్తంలోనే ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలను 21 జనవరి 1984న ప్రభుత్వపరం చేసుకోవడం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ప్రప్రథమమని చెప్పవచ్చు.
అంతేకాదు పెబ్బేరు, ఖిల్లా ఘనపూర్ లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలను, వనపర్తిలో ప్రత్యేకంగా బాలికల కోసం ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంజూరు చేయించడంతో అప్పటి వరకు జిల్లాలోని జిల్లా కేంద్ర నియోజకవర్గంతో పాటు ఏ నియోజకవర్గంలోనూ ఇన్ని జూనియర్ కళాశాలలు లేవు, నియోజకవర్గంలోని పలు ప్రాథమిక పాఠశాలలను ఉన్నత పాఠశాలలుగా స్థాయి పెంచేందుకు ఆయన ఎంతో కృషిచేశారు.
భారత తొలిప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ చేతులమీదుగా 1959లో ప్రారంభమైన వనపర్తిలోని కృష్ణదేవరాయ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉన్న సాంకేతిక పరికరాలు, భవన సముదాయం, ఇంజనీరింగ్ కళాశాలకు కూడా సరిపోతోంది. కనుక వనపర్తికి ఇంజనీరింగ్ కళాశాలను మంజూరుచేయమని పలుమార్లు ముఖ్యమంత్రికి విన్నవించారు. ఇందుకు అనుకూలంగా 1988లో ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జిల్లాకు ఓ ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మహబూబ్ నగర్ జిల్లాకు ప్రభుత్వం మంజూరు చేసి కళాశాలను వనపర్తిలో ఏర్పాటు చేయాలని డాక్టర్ బాలకృష్ణయ్య పట్టుబట్టారు.
ఆదివరకే పలువురు అధికారులు, సాంకేతిక నిపుణులు వనపర్తి పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించి ఇక్కడున్న వసతుల దృష్ట్యా ప్రభుత్వంపై ఎలాంటి అదనపు భారం పడదని నివేదికలు సమర్పించారు. డాక్టర్ గారు కూడా ఎన్టీ రామారావుకు అదే వివరించారు. పైగా చాలాకాలంగా ప్రతిపాదనలు కూడా ఉన్నాయని గుర్తుచేశారు. ఒక్క డాక్టర్ బాలకృష్ణయ్య మాత్రమే జిల్లాకు మంజూరుచేసిన ఇంజనీరింగ్ కళాశాలను వనపర్తి లోనే ఏర్పాటుచేయాలని పట్టుపట్టగా జిల్లాలోని మిగతా 12 నియోజకవర్గాల ఎం.ఎల్.ఏ.లు పార్టీ రహితంగా మహబూబ్ నగర్ లోనే ఏర్పాటు చేయాలని వత్తిడి తెచ్చారు. ఇందులో వనపర్తి నియోజకవర్గ వాసిగా ఉండి ప్రక్క నియోజకవర్గం నుండి ఎం.ఎల్.ఏ.గా గెలుపొందిన నాయకుడు సైతం వనపర్తిలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు మద్దతునీయకపోవడం గమనార్హం. ఆ కళాశాల తీరా ఆ జిల్లాకు రానేలేదు.
ఆ తర్వాత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయ్యాక రెవెన్యూ డివిజన్లో ఇంజనీరింగ్ కాలేజి ప్రైవేట్ యాజమాన్యం కింద మంజూరుచేశారు. వనపర్తి పేరిట మంజూరైన ఇంజనీరింగ్ కళాశాలను మహబూబ్ నగర్ జిల్లా కేంద్ర సమీపంలో నిర్వహిస్తున్నారు. భవనాన్నికూడా అక్కడే నిర్మించారు. అయినా అట్టి ప్రైవేట్ కళాశాలను కూడా వనపర్తి పేర మంజూరైన దానిని వనపర్తికి తరలించే శక్తికూడా లేకపోవడంతో డాక్టర్ బాలకృష్ణయ్య ఇంజనీరింగ్ కళాశాల వాంఛ అలాగే మిగిలిపోయింది.
అంతేకాకుండా ఆసియాఖండంలోనే పేరెన్నిక గన్న ఆటోమేటిక్ సైఫన్ సిస్టంతో నిర్మించిన సరళాసాగర్ ప్రాజెక్టు నిండితే మూడువేల ఎకరాలకుపైగా సాగునీరు అందుతుందని వరుసగా కరువు బారిన పడ్తున్న ఈ ప్రాంత ప్రజలు, రైతులకు మేలు జరిగేలా పక్కనే ప్రవహిస్తున్న పెద్దవాగు నీటిని వడ్డెమాను దగ్గరలో గల కాలువ ద్వారా సరళాసాగర్కు మళ్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే తారకరాను ప్రాజెక్టును కూడా నిర్మించాలని ప్రయత్నించగా కొత్తకోట ప్రాంతానికి చెందిన నాయకులు వ్యతిరేకించారు. తారక రామ ప్రాజెక్టు నిర్మిస్తే శంకరసముద్రానికి (కానాయిపల్లి చెరువుడు) నీరు చేరదని ఆందోళన వ్యక్తం చేశారు. మరి ఇప్పుడు శంకర సముద్రానికి లిఫ్ట్ ద్వారా రామన్ పాడ్ నుండి కృష్ణాజలాలు తరలించే పథకాన్ని మంజూరు చేయించి నీటిని అందజేశారు. కనుక తారకరామ ప్రాజెక్టు ఫైలుకు పట్టిన దుమ్ము దులిపితే కొత్తకోట వారు కూడా వ్యతిరేకించే వీలుండదు. కనుక దీనిపై దృష్టి సారిస్తే ఈ ప్రాంత రైతుల కోసం బాలకృష్ణయ్య కన్న కలలు నిజమౌతాయి.