ఆయనొక మహా వెన్నెల
అంజనీ బాలకృష్ణ
డాక్టర్ బాలకృష్ణయ్య అన్న పేరులోనే ఏదో మహత్తు ఉందనిపిస్తుంది. ఆయనతో నా పెళ్లి జరిగింది 1950లో. అప్పుడాయన మెడిసిన్ రెండో సంవత్సరం పరీక్షలు రాశాడనుకుంటా. కానీ అప్పటికే ఆయన స్వాతంత్య్ర సమరయోధుడిగా యువనేతగా చాలా పేరున్నవారు. నేను నలుగురన్నల ముద్దు చెల్లిగా కట్టుబాట్లలో పెరిగినా బాలకృష్ణ జీవితంలోకి ప్రవేశించిన తరువాతనే ప్రజల గురించి తెలుసుకోవడం ప్రారంభించాను. కుటుంబం కన్నా ఆయన ప్రజలను ముఖ్యంగా పేద రోగులకు సేవ చేయాలనే తపనలోనే ఉండేవారు. వనపర్తి పట్టణ సర్పంచుగా, మున్సిపల్ చైర్మన్ గా, శాసనసభ్యుడుగా ఆయన 50 ఏళ్లపాటు ప్రజాసేవలో తన జీవితాన్ని పునీతం చేసుకున్న మనిషి.
ఒకటా రెండా నలభై ఏడేళ్లు ఆయన సహచరిగా ఎన్నో జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. ఆయన ఇష్టంగా ఏర్పరచుకున్న విడిదిగా ఈ చిట్యాల పొలంగట్లు, చెట్లు, చేమలు అన్నీ ఆయన్ను గుర్తుకు తెచ్చేవే. వనపర్తి నుండి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ చిట్యాల వ్యవసాయ క్షేత్రానికి ఆయన కారు బయలుదేరిందంటే కనీసం ఏ ముప్ఫైసార్లో దారి వెంట ప్రజలు చేయి ఎత్తితే ఆగడం, వారికి వైద్యపరీక్షలు చేయడం, ప్రిస్క్రిప్షన్ రాయడం అనేది ఓ నిత్యకృత్యం. వారిలో ఎవరైనా ఏమయ్యా ఉత్తి కాగితమేనా మందులివ్వవా అంటే ఆ కాగితాన్ని తనవద్దే ఉంచుకుని మర్నాడు తానే మందులు కొని తెచ్చి ఇచ్చిన సందర్భాలు ఎన్నో. “అరే తమ్ముడూ” అన్న పిలుపు ఆయన సహచరులకు ఎంతో ఇష్టమైనది. నిరంతరం తనచుట్టూ పాతిక ముప్పైమంది లేకుండా ఆయన గడిపిన రోజు బహుశా ఉండదేమో. అదేలాగా తోడుగా కనీసం నలుగైదుగురు లేకుండా ఆయన ఏనాడు భోజనం చేయలేదు
రాజకీయాల్లో ఆయన పోటీవర్గంలోని నాయకులు ఆయన్ను వ్యతిరేకించేవారు కానీ వాళ్ల కుటుంబసభ్యులకు వైద్యుడిగా ఈయనే ఆత్మీయుడు. జయరాములు ఎన్నికల్లో వీరి ప్రత్యర్థులు కానీ ఆయన కుటుంబ సభ్యులకు ఈయనే కుటుంబ వైద్యుడు. బహుశా ఇది ఇతరులకు సాధ్యపడకపోవచ్చు. ‘మా డాక్టర్ సాబ్’ అనే మాటలోనే ప్రజలకు ఆయన పట్ల ఉన్న ఆత్మీయత వ్యక్తమయ్యేది. విచిత్రమేమిటంటే వైద్య విద్య రెండో సంవత్సరం పూర్తవగానే వనపర్తిలో ప్రాక్టీస్ ప్రారంభించి పేదరోగులకు ఉచిత వైద్యశాలను ఆయన ప్రారంభించడం. ఆ కాలంలో ఒక పేద కుటుంబంలో పుట్టి స్వయంకృషితో వైద్య విద్య చదివిన ఆయన తన వృత్తిని ఏనాడూ వ్యాపారంగా మలచలేదు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించిన సందర్భం కూడా లేదు. ఒక్క పైసా కూడా ఫీజు తీసుకోకుండా రోజూ వందలనుందికి వైద్యసేవలందించడం మందులు కూడా కొనలేని నిరుపేదలకు తన ఖాతాలో మందులు కొనివ్వడం ఆయనకు మాత్రమే సాధ్యమేమో. ఒకవేళ ఆయనకున్న అపార ప్రతిభా వ్యుత్పత్తులను కమర్షియల్ గా మార్చుకోగలిగితే నేడు కోట్లకు అధిపతి అయ్యేవారేమో. ఇదంతా ఆయన నిజాయితీగా పేదలను ప్రేమించడం వల్లనే సాధ్యమైందనిపిస్తుంది. అందుకే ఆయన ఓ గొప్ప వ్యక్తి ఒక మహోన్నతుడు.
ఆయన మూఢ విశ్వాసాలను, అంటరానితనాన్ని వ్యతిరేకించేవారు. తన ఇంట్లో పనిచేసే వాళ్లంతా హరిజనులే. వాళ్లందరితో ఆయన సహపంక్తి భోజనం చేసేవారు. అంతలా జన సన్నిహితంగా మెలిగేవారు. తనకు నచ్చని విషయాలను తరతమ భేదాలు లేకుండా గర్తించేవారు. ఎంత ప్రేమ హృదయుడో అంతేలాగ తిరుగుబాటుదారుడు కూడా ఆయన. ఎందరో పేద విద్యార్థులకు ఫీజులు చెల్లించి చదువు చెప్పించారాయన. అప్పుడు నాకూ, మా పిల్లకూ ఎవరికీ తెలియదు. ఇప్పటికీ వారే వచ్చి చెబితేగాని మాకిప్పుడు తెలుస్తుంటుంది.
ఎమర్జెన్సీలో మా ఇల్లు ఎందరికో షెల్టర్గా ఉండేది. పోలీసులకు మా యింటికి వచ్చి సోదా చేసే ధైర్యం ఉండేదికాదు. కానీ అలా చేయడం ఆ కాలంలో నేరం. అయినా బాలకృష్ణ చాలా మందిని తన ఇంట్లో ఉంచుకున్నారు. చివరికి ఆయనపై అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయింది. ఎమర్జెన్సీ తరువాత ఇందిర ప్రభుత్వం ఓడిపోయింది. ఆ సమయంలో ఆయన సంతోషం అంతాఇంతా కాదు. అంతకుముందు తొలిసారిగా 60ల్లో ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చినప్పుడు బాలకృష్ణ అభినందిస్తూ ఆమెకు లేఖ రాయడం దానికి ఆమె సంతకంతో జవాబు లేఖ రావడం కూడా జరిగింది.
1969లో ప్రత్యేక తెలంగాణా ఉద్యమం ఉధృతమైన తరుణంలో ఈయన సమైక్యాంధ్ర వాదిగా ఉన్నారు. ఈ సమయంలోనే వనపర్తి బాలికల పాఠశాలలో ఆంధ్రా ప్రాంతం నుండి వచ్చిన ఇద్దరు టీచర్లు విమల, శాంత పనిచేసేవారు. అప్పటి ఉద్యమకారులు వారిని వనపర్తి నుండి వెళ్లగొడతామని వారిపై దాడికి యత్నించినప్పుడు వారిద్దరిని మా మేడపై దాచి కాపాడటం జరిగింది. మరోవైపు ప్రత్యేక తెలంగాణా ఉద్యమం లో పాల్గొని అరెస్టయిన చాలా మంది యువకులను పోలీస్ కేసుల్లో ఇరుక్కోకుండా విడిపించిందీ ఈయనే.
నిరంతరం ప్రజా ఉద్యమాలు, రాజకీయాలు, రోగులు ఇవే ఆయన లోకం. మరి మేమున్నాం. మా కోసమూ సమయం కేటాయించమని ఏమిటిలా? ఎందుకు? ఎక్కడ? వద్దు! కాదు! కూడదనే ప్రశ్నలు వేసేవాళ్లం కాదు. అవేమీ ఆయనకిష్టముండేది కాదు. “భారత-చైనా మిత్ర మండలి” కార్యదర్శిగా ఆయన నిర్వహించిన పాత్ర కీలకమైనది. ఆ హోదాలోనే ఆయన చైనా దేశం పర్యటించి వచ్చారు. ఆ జ్ఞాపకాలను ‘నా’ చైనాయానం’ పేర అక్షరబద్ధం చేసారు కూడా. ఆ జ్ఞాపకాలను పుస్తకంగా వేయాలనే ఆయన కోరిక నెరవేరనే లేదు.
నేను స్వతహాగా పుస్తక పఠనాభిలాషిని, శరత్ సాహిత్యం అంతా చదివాను. అందుకే మా అబ్బాయిల్లో ఒకరికి శరత్ అనే పేరు పెట్టుకున్నా. తెలుగులో అయితే శ్రీశ్రీని అమితంగా అభిమానించేదాన్ని. ఒకసారి మా అబ్బాయి మహేశ్ కుమార్ ఉన్నవ్కి వీడ్కోలు పలికేందుకు రైల్వే స్టేషన్ చేరుకున్నాం. అప్పుడు కొన్న ఏదో పత్రికలో ‘మద్రాస్లో శ్రీశ్రీ ఇల్లు వేలం’ అనే వార్తను చదివి బాలకృష్ణతో “ఏమిటిది మనమేమైనా చేయగలమా?” అని అడిగా. బహుశా అందుకే కావచ్చు. ఆయన శ్రీశ్రీకి ఆర్థికసాయం చేయాలని పూనుకున్నారు.
ఇది జరిగిన కొద్దికాలానికి ఓ సాయంత్రం హైదరాబాదులో బయటినుండి వస్తూనే ఆయన శ్రీశ్రీ గారిని కొద్దిసేపట్లో మనింటికి తీసుకు వస్తున్నానన్నారు. నేను సీరియస్ గా తీసుకోలేదు.
అంత పెద్ద సినీ కవి ఏమిటి మనింటికి రావడమేమిటి? వారొస్తే కూర్చునేందుకు నాలుగు మంచి కుర్చీలు కూడా లేవు మనింట్లో’ అన్నాను. ఆ వెంటనే బయటికెళ్లిన ఆయన మళ్లీ ఏకంగా శ్రీశ్రీ దంపతులతో ఇంటికి వచ్చారు. వారికి నేనప్పటికప్పుడు చేసి పెట్టిన పూరీలు తింటూ శ్రీశ్రీగారు “అదేమిటమ్మా. మేం మీ ఇంటికి రాలేమన్నావట. హోటల్లో ఇంత మంచి పూరీలు దొరుకుతాయా” అని అభినందించారు.
1982లో శ్రీశ్రీగారికి వనపర్తి పట్టణంలో బాలకృష్ణ ఘనంగా సన్మానం చేసి వీధి వీధి తిరిగి విరాళాలుగా వసూలు చేసిన పాతికవేలకు పైగా నగదును చెక్కు రూపంలో అందజేశారు. ఆ సభకు అంతా వెళ్లిపోగా సరోజా శ్రీశ్రీని నేనే సభా వేదిక దాకా తీసుకువెళ్లాను. సభ జరిగిన తరువాత కులమత వర్గ భేదాలు లేకుండా బాలకృష్ణ ఏర్పాటు చేసిన సహపంక్తి భోజనం ఆరోజుల్లో గొప్ప విషయం. ఆరోజు రాత్రి శ్రీశ్రీ దంపతులు, జ్వాలాముఖి వంటి వారంతా చిట్యాలలోనే గడిపిన జ్ఞాపకం అంతా నిన్నో, మొన్నో జరిగినట్లనిపిస్తుంది. ఆ తర్వాతే అనుకుంటా తమ్ముడి కూతురు సంధ్య అనే అమ్మాయి ఆదర్శ వివాహాన్ని శ్రీశ్రీ సమక్షంలో బాలకృష్ణనే జరిపించారు. ఆయనకు శ్రీశ్రీగారితోనే కాదు స్వామి అగ్నివేశ్, కాళోజి నారాయణరావు వంటి ఎందరో గొప్ప వారితో పరిచయాలుండేవి. వారంతా హైదరాబాద్ లో మా ఇంటికి తరచూ వచ్చేవారు.
బాలకృష్ణ స్వతంత్ర్యోద్యమ కాలంలో గాంధేయవాది. తర్వాత వామపంథా భావాలను అభిమానించి ఆ ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనేవారు. ఎమర్జెన్సీ కాలంలో ఆ తరువాత జగన్నాథ రెడ్డి వంటివాళ్లతో కలిసి జనతాపార్టీలో చేరారు. ఎన్నికల్లో పోటీ కూడా చేసి ఓడిపోయారు. 1982లో టిడిపిలో చేరి ఎం.ఎల్.ఏ. అయ్యారు. పార్టీలేవైనా ఆయన నూత్రం ప్రజలపక్షం నిలిచిన మనిషే
బాలకృష్ణలో ఈ సేవాభావన పెరగడానికి కారణం ఆయన పిన్ని బాలకృష్ణమ్మగారే. ఆమె నిరక్షరాస్యురాలు. కానీ చాలామందికి దానధర్మాలు చేసేది. ఆమె వద్దనే ఈయనే పెరగడం వల్ల ఆ ప్రభావం పడింది.
ఏ స్త్రీ అయినా భర్త తీరిక సమయాన్ని తనకే కేటాయించాలనుకుంటుంది. అందుకు నేనేమీ మినహాయింపు కాదు. కానీ ఆయనకు తీరిక
సమయం ఎక్కడిది. కాలక్రమంలో ఆయనలో ప్రజల మనిషినే చూడటం అలవాటు చేసుకు న్నాను. రాత్రింబవళ్లు అనే తేడా లేకుండా సాగేది ఆయన వృత్తి. ఏ రాత్రో రోగులు (పేషెంట్లు) వస్తే నిద్దురలో ఉన్నారని మేమే లేపేవాళ్లం కాదు. మర్నాడు ఇది తెలిసి ఆయన “మీ సొమ్మేం పోయింది. పాడయ్యేది నా నిద్రే కదా. లేపితే సరిపోయేదని” నాపై, పనివాళ్లపై విరుచుకుపడేవారు. రోగులపట్ల ఆయనకుండే భావన అంత గొప్పది. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసినా పిల్లలను విసుక్కునేవారు కారు. ఆయన మూD ni పిల్లలు మసలుకునేవారు. ఆయన్ను చూసి తనుకు తామే ప్రభావితమై పిల్లలు ఎదిగారు. 10 మంది పిల్లలు మాకు అదృష్టం కొద్ది కలిగారనుకుంటాం. ఇప్పుడు భూపేsh lO కూడా తండ్రి తపన కనిపిస్తోంది.
కాలక్రమంలో బాలకృష్ణ జీవితంలోకి శంకరమ్మ వచ్చింది. ఆయననే ప్రేమించినపుడు ఆయన ప్రేమించిన వాళ్లను ఎందుకు ప్రేమించలేం. అంతా కలిసే సాగిపోయాం. ఆమె నాకిప్పుడు “మా శంకరమ్మ” అయింది. ఒకసారి నాకు న్యూజిలాండ్ నుండి అనుకుంటా మా శంకరమ్మ ఉత్తరంలో చాలా విషయాలు ప్రస్తావిస్తూ “అక్కా నేను నీతో కలిసి భోజనం చేస్తూ కబుర్లు చెప్పాలని ఉందని రాసింది. ఇలా రాయగలగడమంటే సామాన్యం కాదు
అది బాలకృష్ణ సహవాస ఫలితమేననిపిస్తుంది. బాలకృష్ణ వెంట నేను అమెరికా పర్యటించాను. అప్పటికాయన అప్పుడప్పుడే అనారోగ్యానికి గురైనారు. ఆయన జ్ఞాపకశక్తి అపారం. పుస్తకపఠనం ఆయనకిష్టమైన హాబీ. చదవాలనుకున్నా, లేదా నిద్ర పోవాలనుకున్నా ఏ అవాంతరం ఆయన్ను అడ్డుకునేది కాదు. ఎన్నికల్లో ఓడినా వైద్యుడిగా మళ్లీ ప్రజల్లో కలిసిపోయేవారు.
చివరి రోజుల్లో అనారోగ్యంతో ఉన్నా బాలకృష్ణ ఆలోచనాశక్తి చురుగ్గానే ఉండేది. ఆయనలో ఏదో బయటికి చెప్పలేని పశ్చాత్తాపం, అపరాధ భావంతో కొట్టుకుపోయేవారు. ఏది చదివినా అది తనకే అన్వయించుకుని “ఇదుగో చూడు ఇది నన్ను దృష్టిలో ఉంచుకునే రాసినట్లుగా లేదూ?” అని నాతో అనేవారు. బయటికి వెళ్లి నాకోసం ఏదో ఒకటి చిన్న చిన్న వస్తువులు తెచ్చేవారు. నాకిష్టమైన భక్ష్యాలు, జొన్నరొట్టెలు, చేపల కూరని అదే పనిగా తన సన్నిహితుల ఇంట్లోంచి తెచ్చే ప్రేమ ఆయనది. ఇవన్నీ చూసి “ఏమిటి ఈయనలో ఓ కొత్త మనిషి కనిపిస్తున్నాడేమిటీ” అని నాకనిపించేది.
మంచం పట్టిన తర్వాత ఒకసారి ఆయన్ని పలకరించేందుకు అప్పటి హెల్త్ మినిష్టర్ నాగం జనార్ధనరెడ్డిగారొచ్చి పరీక్షించి వీలైనంత త్వరగా ఆస్పత్రికి తరలించమని సలహా ఇచ్చారు. బర్కత్ పుర ఉడ్‌లాండ్ హాస్పిటల్లో బాలకృష్ణను చేర్చాం. ఆ హాస్పిటల్ కి తీసుకెళుతుండగానే ఆయన నన్నెందుకు తీసుకెళుతున్నార్రా చంపడానికా? వద్దు. ఇంట్లోనే ఉంచండన్నారు. బహుశా డాక్టర్ గా అప్పటి ఆయన స్థితి ఆయనకు అవగతమై ఉంటుందేమో మరి. ఉడ్్‌లాడ్స్ లో ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది. అటు నుండి నిమ్స్ కి తరలించాం. కానీ ఆయన్ను దక్కించుకోలేకపోయాం. మమ్మల్నీ, తనను అన్నగా అభిమానించే వనపర్తి ప్రజల్ని వీడి వెళ్లిపోయారు. ఆరోజు 16.12.1997. ఆయన పార్తివ శరీరాన్ని వనపర్తి తెచ్చాం. అటునుండి ఆయన అంతిమయాత్ర.. ఆయన కలలకు ప్రతిరూపమైన చిట్యాల వ్యవసాయక్షేత్రం దాకా సాగింది. తన మట్టిలో మట్టిగా కలిసి మా హృదయాల్లో చిరంజీవిగా నిలిచిపోయారు.
భగవంతుడు గొప్పవాళ్ళకు జన్మనిచ్చి ఎక్కువ ఆయుష్షును ఇవ్వడేమో మరి. అందుకేనేమో ఆయన మా దృష్టిలో 73 ఏళ్ళ చిన్న వయసులోనే కాలధర్మం చెందారు. శాసనసభకు వెళ్లిం తర్వాత హైదరాబాద్ లో శాసనసభ సమావేశాలు అధికార కార్యక్రమాల్లో మునిగితేలిన ఆయన ఈ పనుల్లో పడి వనపర్తి ప్రజలకు దూరమవుతున్నానా? అని మథనపడేవారు. ఆస్పత్రిని అన్నీ తానై నడిపే కాంపౌండర్ రాములు, అల్లుడు డాక్టర్ జగన్ మోహన్, చేతికందిన మా అబ్బాయి మహేష్ లు మరణించడం ఆయన్ను బాగా కృంగదీశాయి. ఇవేగనుక జరగకపోయి ఉంటే బాలకృష్ణ ఇంకా చాలాకాలం బ్రతికేవారు.
ఇలా చెబుతూ పోతే ఆయన జ్ఞాపకాలు ఎడతెగనివి. ఆగని ప్రవాహంలా వస్తూనే ఉంటాయి. ఒక మహాసముద్రం వంటి ఆయన్ను దోసిట్లో చూపడం నాకే కాదు ఎవరికీ సాధ్యంకాదు. ఆయన ప్రాతఃకాల పూజనీయుడు. ఇంకా చెప్పా లంటే ఆయనొక వ్యక్తి కాదు ఒక మహా వ్యవస్థ.
ఆయన అభిమానుల్లో, ప్రజల్లో ఒకర్తిగా నిలబడి చూస్తే బాలకృష్ణ ఒక మహావెన్నెలగా కనిపిస్తారు. అందుకే ఇప్పటికీ ఆయనకై ఎదురుచూస్తూ –
నీవు వత్తువటంచు
రేయి ఎల్లను మేలుకొంటి నేను!
తూరుపు తెల్లవారె
నీవు రావాయె!!
ఆశ జలధార
ఆవిరై ఇంకిపోయె!!!2